నేటి నుంచి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం
అమలుకాని హామీలు అమలైనట్టు చెప్పే గోబెల్స్ యాత్ర
ప్రచారంతో మస్కా కొట్టేద్దామని చంద్రబాబు ప్రయత్నం.. ప్రజలు నిలదీస్తారని టీడీపీ కేడర్‌లో ఆందోళన
ఆడబిడ్డ నిధి లేదు.. 50 ఏళ్లకే పెన్షన్ లేదు..
20 లక్షల ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు.. తల్లికి వందనం తొలి ఏడాది గోవిందా
రెండో ఏడాది 20 లక్షల మందికి కోత
ఈ ఏడాది 22.65 లక్షల మందికి మొండిచేయి.. పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవకు రూ.20వేలు ఎక్కడ?
అందులోనూ 7 లక్షల మంది రైతులకు పూర్తిగా మంగళం.. రెండేళ్లలో ఆరు గ్యాస్ సిలిండర్లకు గాను ఇచ్చింది రెండే..
సూపర్ సిక్స్ బకాయిల మొత్తం రూ.1,99,688.78 కోట్లు
ఉద్యోగుల హామీలు హుళక్కి.. రెగ్యులర్‌గా అందాల్సినవీ లేవు
పీఆర్‌సీ, ఐఆర్ లేదు.. పెండింగ్ డీఏలూ లేవు
దగా డీఎస్సీతో నిరుద్యోగుల మండిపాటు
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు.. జగన్ ఇచ్చేవి మాత్రమే కాదు.. అంతకన్నా ఎక్కువ ఇస్తామన్నారు. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టో చూపిస్తూ ఊదరగొట్టేశారు.. రెండేళ్లయింది.. సూపర్ సిక్సూ లేదు.. సూపర్ సెవనూ లేదు.. ప్రజలకు అన్నింట్లో మొండిచేయే.. కానీ ఏమిచ్చినా ఇవ్వకపోయినా ప్రచారం పెద్ద ఎత్తున చేసి ప్రజలకు మస్కా కొట్టేయొచ్చన్నది చంద్రబాబునాయుడి ఆలోచన. ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా నిలబెట్టుకోలేక విఫలమైన చంద్రబాబు ఇప్పుడు ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి 45 రోజుల భారీ ప్రచార కార్యక్రమానికి తెరతీశారు.
సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ పేరుతో జనంలోకి వెళ్లాలని చంద్రబాబు పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని ఆదేశించారు. కానీ ప్రతి గడప తొక్కాలి, ప్రతి తలుపూ తట్టాలని చంద్రబాబు చెబుతుంటే తలుపు తట్టి లోపలికి వెళ్లి ఏం చెప్పాలా అని పార్టీ క్యాడర్ బితుకు బితుకుమంటున్నారు. చేయని పనులను చేసినట్టు, ఇవ్వని సొమ్మును ఇచ్చినట్టు, నెరవేర్చని హామీలను నెరవేర్చినట్లు చెబితే ప్రజలు నమ్మేస్తారా? ఊరుకుంటారా? కాలర్ పట్టుకుని నిలదీయరా అని మదనపడుతున్నారు.
సూపర్ సిక్స్‌లో పూర్తిగా అమలైంది ఒక్కటీ లేదు
చంద్రబాబు పాలన రెండేళ్లు దాటినా.. మూడు బడ్జెట్లు పెట్టినా సూపర్ సిక్స్‌లో పూర్తిగా అమలైన హామీ ఒక్కటీ లేదు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు ఏడాదికి రూ.18 వేల చొప్పున, రెండేళ్లలో రూ.36 వేలు బాకీ. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున, రెండేళ్లలో ప్రతి నిరుద్యోగికి రూ.72 వేలు బాకీ. 50 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.4 వేల చొప్పున, రెండేళ్లలో రూ.96 వేలు బాకీ. మరోవైపు తల్లికి వందనం తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది 20 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఈ ఏడాది 22.65 లక్షల మందికి ఎగ్గొట్టారు. మిగిలిన వారికి ఇచ్చింది కూడా రూ.8 వేలు. రూ.9 వేలు మాత్రమే.
కొందరికి రూ.13 వేలు ఇచ్చారు. అన్నదాత సుఖీభవ కింద పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు ఇస్తానన్నారు. అంటే రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది రూ.14 వేలు. ఇక్కడ బాకీ రూ.26 వేలు. గ్యాస్ సిలిండర్లు ఏటా మూడు ఉచితం అన్నారు. రెండేళ్లలో ఆరు ఇవ్వాల్సి ఉండగా రెండు మాత్రమే ఇచ్చారు. అవి కూడా అందరికీ ఇవ్వలేదు. పదహారింటికి గాను ఐదురకాల బస్సుల్లోనే ఉచిత బస్సు అమలుచేస్తున్నారు. తొలిఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. సున్నా వడ్డీ రుణాలు ఎగ్గొట్టి మహిళలను నిండా ముంచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలను అయోమయంలో పడేశారు.
ఉద్యోగులకూ మొండిచేయే..
ఉద్యోగులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు దిక్కులేదు. పీఆర్సీ లేదు.. ఐఆర్ లేదు.. 5 డీఏలు పెండింగ్.. సరెండర్ లీవ్స్ పెండింగ్.. రూ.40 వేల కోట్లకుపైగా బకాయిల చెల్లింపు కూడా లేదు. ఉద్యోగులకు అన్నీ ఇబ్బందులే. పేదలకు మూడు సెంట్ల స్థలంలో ఇల్లు ఇస్తానని చెప్పినా ఒక్కటంటే ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీని నిరీ్వర్యం చేయడంతో ఆస్పత్రులు సేవలు నిలిపివేస్తుండడం తరచూ చోటుచేసుకుంటోంది.
ఇవన్నీ ఇస్తామని ఎన్నికల్లో ఇంటింటికీ వెళ్లి బాండ్లు ఇచ్చామని ఇప్పుడు జనం ఆ బాండ్లు చూపించి ఇమ్మని అడిగితే ఏం చేయాలని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు. ఈ ఖరీఫ్‌లో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వలేమని చావుకబురు చల్లగా చెప్పింది. విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపి పైకి మాత్రం ఛార్జీలు తగ్గించామని ప్రచారం చేసుకోవడం గురించి ప్రజలు అడిగితే తాము ఏంకావాలని సొంత క్యాడరే ప్రశ్నిస్తోంది.
దగా డీఎస్సీ.. నేతల గుండెల్లో దడ..
తొలి సంతకం డీఎస్సీపైన చేసి.. దాని గురించి మెగా డీఎస్సీ అంటూ ప్రచారం చేసి.. దాన్లో అతిపెద్ద స్కామ్ చేశారు. అసలు పోటీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చేశారు. స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో అక్రమాలతో నిరుద్యోగుల ఉసురుపోసుకున్నారు. మెరిట్లో నిలిచిన అభ్యర్థులను పక్కనపెట్టి, తమకు కావాల్సిన వారికి, డబ్బులిచ్చిన వారికి రెడ్ కార్పెట్ పరిచి ఉద్యోగాలిచ్చేశారు. కేవలం తమ వాళ్ల కోసం ప్రత్యేకంగా జీవోలు ఇచ్చారు. తమ పని అయిపోగానే ఆ జీవోలు రద్దు చేశారు. సరి్టఫికెట్లు ఇచ్చిన క్రీడా సంఘాలు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి.
సాఫ్ట్ బాల్ అసోసియేషన్‌కు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడు. జూడో సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా విశాఖపట్నం ఎంపీ, లోకేశ్ తోడల్లుడు భరత్ ఉన్నారు. ఈ నిజాలన్నీ బయటపడడంతో నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన మెరిట్ విద్యార్థుల ఇళ్ల తలుపులు తట్టి ఏమి చెప్పాలనే భయం టీడీపీ నేతలను వేధిస్తోంది.
అప్పుల కుప్ప
సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండేళ్లలో సృష్టించింది అప్పుల కుప్పే. రెండేళ్లలోనే సుమారు రూ.3.5లక్షల కోట్ల పైగా అప్పు చేసింది. అంత సొమ్ము తెచ్చినా అది సూపర్ సిక్స్‌కూ చేరలేదు, రైతుకూ అందలేదు, పేదల ఇళ్లకూ దక్కలేదు. ఒకవైపు ఖజానా ఖాళీ అంటూ హామీలకు మంగళం పాడుతూనే, మరోవైపు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎౖMð్సజ్ ద్వారా సామాన్యుడిపై భారాలు వేస్తున్నారు.
సొంత పార్టీలోనే మంటలు
ప్రజల తలుపులు తట్టే ముందు సొంత నేతల ఇళ్లల్లో పరిస్థితిని చూడాలని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. పనిచేసినవారిని పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి మంత్రి పదవులు ఇచ్చారంటూ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శలు ఎక్కుపెట్టారు. నిధుల కేటాయింపులో అన్యాయంపై రాజీనామాకు సిద్ధమని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హెచ్చరించారు. పల్లె కన్నీరు కారుస్తోందని తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ స్టేటస్‌లు పెడుతున్నారంటే గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు అన్ని జిల్లాల్లో మంత్రులకు, ఎమ్మెల్యేలకు పొసగడంలేదు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తమకు మెతుకు కూడా మిగల్చకుండా అన్నీ ఊడ్చేస్తున్నారని ద్వితీయ శ్రేణి నాయకులు మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 45 రోజుల ఇంటింటి ప్రచారం ఎలా చేయాలని క్యాడర్ ప్రశి్నస్తోంది.
ఇప్పటికే రెండుసార్లు వాయిదా
నిజానికి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం మొదట జూన్ 25న మొదలవ్వాలి. అప్పుడు వాయిదా పడి జూలై 15కు మారింది. అది కూడా వాయిదా పడి తాజాగా 27కు చేరింది. ఒక ప్రచార కార్యక్రమాన్నే రెండుసార్లు వాయిదా వేసుకోవాల్సి రావడం ఆ పార్టీ యంత్రాంగంలోని గందరగోళానికి అద్దంపడుతోంది. పైగా కూటమి విజయాలు అని చెప్పుకుంటూ జనసేన, బీజేపీలను పక్కనపెట్టి తెలుగుదేశం ఒంటరిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుండడం విశేషం. కలిసి కార్యక్రమం చేస్తే మూడు పార్టీల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి భగ్గుమంటుందనే భయంతోనే కేవలం తన పార్టీతోనే చంద్రబాబు దీన్ని నిర్వహిస్తున్నారు.


