అదనపు మట్టి పనులు సాకు చూపి సర్కారు దోచిపెట్టేయత్నం
హంద్రీ–నీవా రెండో దశ కాలువ ఐదో ప్యాకేజీ పనుల్లో మాయాజాలం
2024 డిసెంబర్ 3న లైనింగ్ పనులకు రూ.241.20 కోట్లు మంజూరు
ఆ పనులు సీఎం చంద్రబాబు సన్నిహితుడికి చెందిన ‘బీఎస్సార్ ఇన్‌ఫ్రా’కు అప్పగింత
గతంలో చేయని మట్టి పనులను ఇప్పుడు అదనంగా చేశారని వింతవాదన
ఈ సాకుతో అంచనా రూ.241.2 కోట్ల నుంచి రూ.312 కోట్లకు పెంచుతూ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి సర్కార్ ఓ వైపు అప్పులు చేయడంలో సరి కొత్త రికార్డులు నెలకొల్పుతూనే.. మరో వైపు సాకులు వెతికి మరీ అస్మదీయులకు ప్రయోజనం చేకూరుస్తోంది. డీపీఆర్(సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లోని ప్రమాణాల ప్రకారం గతంలో కాలువ తవ్వారు.. ఆ పనులు చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లులూ చెల్లించారు. గతంలో కాలువ తవకంలో మట్టి పనుల పరిమాణం తగ్గిందని, ఇప్పుడు వాటిని కాంట్రాక్టర్ అదనంగా చేశారని.. అందుకు అదనంగా బిల్లులు ఇచ్చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ ఐదో ప్యాకేజీ (360.4 కి.మీ నుంచి 400.5 కి.మీ వరకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్) పనుల అంచనాను రూ.241.20 కోట్ల నుంచి రూ.312 కోట్లకు పెంచేస్తూ ఆదివారం ఉత్తర్వులు (జీవో ఆర్‌టీ నెంబరు 433) జారీ చేసింది. హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ ప్రధాన కాలువ ఐదో ప్యాకేజీలో కాలువ తవ్వకం పనులు గతంలో పూర్తయ్యాయి.
ఆ కాలువ ద్వారా ఏడేళ్లుగా నీరు ప్రవహిస్తోంది. ఆ కాలువకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులకు ప్రభుత్వం 2024 డిసెంబర్ 3న రూ.241.20 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులకు రూ.195.21 కోట్ల కాంట్రాక్టు విలువతో గతేడాది జనవరిలో జల వనరుల శాఖ టెండర్లు పిలిచింది. వాటిని రూ.204.6 కోట్లకు (జీఎస్టీ, సీనరేజీ తదితర పన్నుల వ్యయం కాకుండా) కోట్ చేసిన సీఎం చంద్రబాబు సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్ ఇన్‌ఫ్రా దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం ఈ పనులను ఆర్నెలల్లోగా పూర్తి చేయాలి. కానీ సకాలంలో పూర్తి చేయలేదు. మిగిలిన పనులను ఇప్పుడు చేస్తోంది. గతేడాది లైనింగ్ పనులను అత్యంత నాసిరకంగా చేయడంతో ఒక సీజన్‌లో నీటి ప్రవాహానికి లైనింగ్ ఎక్కడికక్కడ కాలువలో కొట్టుకుపోయింది.
మట్టి పనులను చేశారంటూ...
గతంలో మట్టి పనుల పరిమాణం తగ్గించి కాలువ తవ్వారని.. ఇప్పుడు అప్పట్లో తగ్గించిన మట్టి పనులను కాంట్రాక్టర్ చేశారని.. వాటికి కాంట్రాక్టర్‌కు అదనంగా బిల్లులు చెల్లించాలని.. దానివల్ల అంచనా వ్యయాన్ని రూ.312 కోట్లకు పెంచాలని హంద్రీ–నీవా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రాష్ట్ర మంత్రివర్గం వాటికి ఆమోద ముద్ర వేయడంతో దాన్ని అమలు చేస్తూ ఆదివారం జలవనరులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కాలువ తవ్వకం పనులను గతంలో ఈపీసీ(ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్) విధానంలో అప్పగించినప్పుడు మట్టి పనులను పరిమాణం మేరకు కాకుండా ఎందుకు తగ్గించారు.. బిల్లులు ఏ మేరకు చెల్లించారు. ఇప్పుడు అదనంగా చేసిన పనులు ఏమిటో నివేదిక ఇవ్వాలంటూ హంద్రీ–నీవా అధికారులను ఆ ఉత్తర్వుల్లో ఆదేశించింది. గతంలో ఈపీసీ కింద కాంట్రాక్టర్ పనులు పూర్తి చేశారు.. బిల్లులూ చెల్లించారు.. ఇప్పుడు అదనంగా మట్టి పనులు చేశారనే సాకు చూపి కాంట్రాక్టర్‌కు రూ.70.8 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చడానికే సరి కొత్తగా సాకులు వెతుకుతున్నారని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


