కోర్టులను మూసేయండి | Andhra Pradesh High Court Serious on CS Vijayanand | Sakshi
Sakshi News home page

కోర్టులను మూసేయండి

Feb 26 2026 4:58 AM | Updated on Feb 26 2026 8:42 AM

Andhra Pradesh High Court Serious on CS Vijayanand

కోర్టు ఆదేశాలు అమలు చేసే ఉద్దేశం లేకపోతే ఆ పనే చేయండి 

ప్రజలకు, కక్షిదారులకు న్యాయం చేయలేకపోతే ఇక కోర్టులెందుకు?

సీఎస్‌పై నిప్పులు చెరిగిన హైకోర్టు 

సీఎస్‌ను నాలుగు రోజులు జైల్లో ఉంచితే అందరూ దార్లోకి వస్తారు 

గ్రూప్‌–1 ఉద్యోగులను నాన్‌ ఫోకల్‌ పోస్టులకు బదిలీ చేయాలన్న కోర్టు ఆదేశాలను సీఎస్సే అమలు చేయకపోతే ఎలా?  

మిగిలిన వారికేం గౌరవం ఉంటుంది.. తద్వారా ఏం సందేశం ఇస్తున్నారు? 

ప్రభుత్వాధికారుల వల్ల న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోయే పరిస్థితి దాపురించింది 

మేం ఉన్నది ప్రజలకు న్యాయం చేయడానికి, న్యాయ వ్యవస్థ ప్రతిష్ట కాపాడటానికే 

ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదు.. 

ఫోకల్‌.. నాన్‌ ఫోకల్‌ పోస్టుల నిర్వచనం లేదని ఎలా చెబుతారు? 

1966లోనే కార్యనిర్వాహక ఉత్తర్వులు.. వాటి ఆధారంగానే బదిలీలు  

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌కు సైతం ఫోకల్, నాన్‌ ఫోకల్‌ గురించి తెలుసు 

ఆ అధికారులతో కుమ్మక్కయ్యారు కాబట్టే మా ఆదేశాలు పట్టించుకోలేదు 

ఆ అధికారులను బదిలీ చేసి తీరాల్సిందే.. విచారణ నేటికి వాయిదా 

సాక్షి, అమరావతి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎ­స్‌) విజయానంద్‌పై హైకోర్టు నిప్పులు చెరిగింది. కోర్టు ఆదేశాలను అమలు చేసే ఉద్దేశం లేకపోతే కోర్టులను మూసి వేయడం మంచిదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రజలకు, కక్షిదారులకు న్యాయం చేయలేకపోతే ఇక న్యాయస్థానాలు ఎందుకని ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే కోర్టు ఆదేశాలను అమలు చేయకుంటే అతని కింద పని చేసే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కోర్టు ఆదేశాలంటే ఏం గౌరవం ఉంటుందని నిలదీసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం ద్వారా మిగిలిన అధికారులకు ఏం సందేశం ఇస్తున్నారని ఆయన్ను ప్రశ్నించింది. 

ప్రజలకు న్యాయం చేయడానికి, న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడటానికే తాము ఇక్కడ ఉన్నామని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వాధికారుల తీరు వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి దాపురించిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. త్వరలో పదవీ విరమణ చేయనున్న విజయానంద్‌ను నాలుగు రోజుల పాటు జైల్లో ఉంచితే అధికారులందరూ దార్లోకి వస్తారంది. 

కోర్టు ఆదేశాలను అమలు చేయవద్దని సలహా ఇస్తే ఎంత మాత్రం సహించేది లేదని స్పష్టం చేసింది. గ్రూప్‌–1 ప్రధాన పరీక్షలో ఉత్తీర్ణులై ప్రస్తుతం వివిధ పోస్టుల్లో కొనసాగుతున్న అధికారులను నాన్‌ ఫోకల్‌ (ప్రాధాన్యత లేని) పోస్టులకు బదిలీ చేయాలన్న తమ ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్దేశ పూర్వకంగానే అమలు చేయలేదని హైకోర్టు ఆక్షేపించింది.   

నాన్‌ ఫోకల్‌ పోస్టులకు బదిలీ చేయాలంటూ ఆదేశం.. 
గ్రూప్‌–1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఈ నెల 11న ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్‌–1లో ఇప్పటికే ఎంపికై ప్రస్తుతం పలు చోట్ల ఉద్యోగాలు చేస్తున్న అధికారులను తక్షణమే నాన్‌ ఫోకల్‌ (ప్రాధాన్యత లేని) పోస్టులకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఓ వారంలో ఆ అధికారుల బదిలీలకు సంబంధించిన వివరాలతో ఓ నివేదికను రిజి్రస్టార్‌ జ్యుడీషియల్‌కు అందచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం.. తమ ఆదేశాల మేరకు ఆ అధికారులను నాన్‌ ఫోకల్‌ పోస్టులకు బదిలీ చేయకపోవడంతో విజయానంద్‌ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 

ఏఐని అడిగితే ఏంటో తెలిసేదిగా..  
ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని, తమ ముందు వ్యక్తిగతంగా హాజరైన సీఎస్‌ విజయానంద్‌ను ప్రశ్నించింది. తక్షణమే బదిలీ చేయాలని తాము ఈ నెల 11న ఆదేశాలిస్తే, ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదని, దీని బట్టి ‘తక్షణమే’ అన్న పదానికి సీఎస్‌కు అర్థం తెలిసినట్లు లేదని పేర్కొంది. 

తమ ఆదేశాలను అమలు చేసి తీరాల్సిందేనని, లేని పక్షంలో తాము తీసుకునే కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధంగా ఉండాలని విజయానంద్‌కు తేల్చి చెప్పింది. ఈ సమయంలో అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ జోక్యం చేసుకుంటుండగా, సీఎస్‌ స్వయంగా తమ ముందు ఉన్నారని, ఆయన్నే అడిగి వివరాలు తెలుసుకుంటామని, ఈ దశలో మీ జోక్యం అవసరం లేదని ఏజీకి తేల్చి చెప్పింది. 

సర్వీసు నిబంధనల్లో ఫోకల్, నాన్‌ ఫోకల్‌ పోస్టుల నిర్వచనం లేదని ఏజీ చెప్పగా.. 1966లోనే ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది.   ఈ ఉత్తర్వుల ఆధారంగానే ఫోకల్, నాన్‌ ఫోకల్‌ పోస్టులకు బదిలీలు జరుగుతూ వస్తున్నాయని తెలిపింది. ఫోకల్, నాన్‌ ఫోకల్‌ పోస్టులకు అర్థం తెలియకుంటే, నిఘంటువును చూసినా, ఏఐని అడిగినా తెలుస్తుందని పేర్కొంది. 

ఫోకల్, నాన్‌ ఫోకల్‌ పోస్టుల గురించి అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌కు కూడా తెలుసని, కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రం తెలియదని చెబుతున్నారంది. గ్రూప్‌–1 ప్రధాన పరీక్షలో ఉత్తీర్ణులై వివిధ పోస్టుల్లో కొనసాగుతున్న అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమ్మక్కయ్యారని, అందుకే వారిని నాన్‌ ఫోకల్‌ పోస్టులకు బదిలీ చేయాలన్న తమ ఆదేశాలను కావాలనే అమలు చేయడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.   

అధికారులను సమర్థించొద్దు  
1966 నాటి ఉత్తర్వుల గురించి తమ అధికారులకు తెలిసి ఉండకపోవచ్చునని ఏజీ చెప్పగా, కోర్టు ఆదేశాలను అమలు చేయని ఓ అధికారిని సమర్థించేందుకు ఎందుకింత తాపత్రయ పడుతున్నారని ఏజీని ప్రశి్నంచింది. తమ ఆదేశాలను అమలు చేసి, ఆ వివరాలను తమ ముందుంచాలని సీఎస్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. 

ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ, వ్యక్తిగత హాజరు నుంచి సీఎస్‌కు మినహాయింపు కావాలని కోరారు. తమ ఆదేశాలను అమలు చేస్తే వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని, అమలు చేయకుంటే మాత్రం హాజరు కావాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement