ఎన్నాళ్లుగా.. ఈ పాపాలు? | Adulterated milk in the united East Godavari district | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లుగా.. ఈ పాపాలు?

Feb 26 2026 5:04 AM | Updated on Feb 26 2026 5:04 AM

Adulterated milk in the united East Godavari district

ప్రజలను పీడిస్తున్న అనుమానాలు 

ఏ పాలను నమ్మాలో అర్థం కాని పరిస్థితి 

మనం తాగుతున్నవి పాలేనా?

రాజమహేంద్రవరం రూరల్‌/కడియం: ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అని ప్రజాకవి వేమన ఏనాడో ప్రశ్నించాడు. అయితే పాలను విషపూరితం చేస్తారని ఆయన కూడా ఊహించలేదు. లేదంటే ‘కడివెడైననేమి గరళ పాలు’ అనే వాడేమో! రాజమహేంద్రవరంలో ఆరుగురు మృతి చెందడంతో పాటు, 15 మంది ఆస్పత్రిపాలు కావడానికి పాలే కారణమని తేలడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అసలు మనం ప్రతి రోజూ తాగుతున్నవి పాలేనా! అన్న అనుమానం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలను పట్టి పీడిస్తోందీ. 

ఎన్నాళ్లుగా లేక ఎన్నేళ్లుగా ఈ కల్తీపాలను మనం వినియోగిస్తున్నాం? మన ఆరోగ్యాలపై ఇప్పటికే వాటి ప్రభావం మొదలైందా?  సంపాదనే ధ్యేయంగా ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి పాలను విషపూరితం చేస్తూ ఎన్నాళ్ల నుంచి వ్యాపారులు ఈ పాపాలను కొనసాగిస్తున్నారు? అన్న సందేహాలు కలుగుతున్నాయి. కల్తీ  ప్యాకెట్‌ పాల కారణంగా క్యాన్సర్‌ తదితర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతామన్న అభిప్రాయంతో.. ఎంతోమంది స్వచ్ఛమైన పాలకోసం ఆరా తీస్తుంటారు. 

తమ సమీపంలో పాల అమ్మకందారుల నుంచి కొనుగోలు చేసి వినియోగిస్తుంటారు. ఇంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా ప్రస్తుతం కల్తీ పాలు మరణాలకు కారణమయ్యాయంటే.. అసలు ఏం చేయాలో పాలుపోని అయోమయ స్థితిలోకి ప్రజలు వెళ్లిపోయారు. 

కల్తీ కా నామ్‌ పాడి! 
కల్తీ జరిగేదాన్నే పాడి అంటారు! అని జనం సరిపెట్టుకోవాలేమో! ఎందుకంటే జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా పాల ఉత్పత్తి జరగడం లేదన్నది వాస్తవం. డిమాండ్, సప్లయిల మధ్య ఉంటున్న భారీ వ్యత్యాసాన్ని కల్తీ పాల ద్వారానే పూడుస్తున్నారన్నది పచ్చినిజం! వివిధ సంస్థల ద్వారా సరఫరా అయ్యే పాల ప్యాకెట్‌లను పక్కన పెడితే అనాపాల సరఫరాదారులు ఎంతమంది ఉంటారు? వారు ఎన్ని పాలు అమ్ము తున్నారు? వారు ఎక్కడ నుంచి ఆ పాలను సేకరిస్తున్నారన్న సమాచారం కూడా ప్రభుత్వ యంత్రాంగం దగ్గర లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  

అటకెక్కిన మిల్క్‌ యాక్ట్‌ 
వినియోగదారులు, సరఫరాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మిల్క్‌ యాక్ట్‌ను రూపొందించారు. ఈ యాక్టు ద్వారా పాల సరఫరాదారులను గుర్తించడం, పాల స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించారు. స్వచ్ఛమైన పాలు వినియోగదారులకు చేరే విధంగా వ్యవస్థకు రూపకల్పన చేశారు. పాల సరఫరాదారులను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే అమూల్‌ సంస్థను రాష్ట్రానికి తీసుకొచ్చారు.

మిల్క్‌ యాక్ట్‌ ద్వారా మహిళాసంఘాల బలోపేతానికి కృషి చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ యాక్టును అమలును పట్టించుకోలేదు. దీంతో ప్రజలు వినియోగించే పాలు ఎన్ని? వాటిని సరఫరా చేసేవారు ఎంతమంది? వీటి నాణ్యత ఏపాటిది? తదితర అంశాలన్నీ గాల్లో లెక్కలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది.  

బ్రాండెడ్‌ డెయిరీలు కొంత నయం 
పాలను సేకరించే సమయంలో బ్రాండెడ్‌ డెయిరీలు పలు జాగ్రత్తలు తీసుకుంటాయి. వాటి సొంత ల్యాబ్‌లలో పరీక్షలు చేసి మాత్రమే పాలను సేకరిస్తాయి. దీంతో అక్కడికి చేరే పాలల్లో కల్తీ జరిగేది తక్కువేనంటున్నారు. అంటే ప్రజలకు మాత్రం కల్తీ పాలనే అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లుగా భావించాల్సి వస్తోంది.  

భారీ స్థాయిలో మోసం 
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గేదెలు 1,85,000, ఆవులు 74వేలు ఉన్నట్టుగా పశు సంవర్ధకశాఖ లెక్కలు చెబుతున్నాయి. అంటే మొత్తం 2,59,000కు గాను పాలిచ్చే పశువులు 50 శాతం మాత్రమే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 1,29,500 పశువుల నుంచి రోజుకు 4.61 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా జనాభా సుమారు 22 లక్షలు. సరాసరిన ప్రతి ఒక్కరూ రోజుకు సుమారు 300 మిల్లీలీటర్ల పాలు వినియోగిస్తారని అంచనా వేస్తే.. జిల్లా ప్రజల అవసరాలకే 6.60 లక్షల లీటర్ల పాలు కావాల్సి ఉంటుంది. 

కానీ ఉత్పత్తి అవుతున్న పాలు 4.61 లక్షల లీటర్లు మాత్రమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంటే రెండు లక్షల లీటర్ల పాలు కల్తీ చేసే ప్రజలకు అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ లెక్కలు ప్రజల రోజూ వినియోగించే పాలకు సంబంధించినవి. ఇవి కాకుండా ప్రయివేటు డెయిరీలు సేకరించేవి, ఇతరత్రా అవసరాలకు సరఫరా అయ్యే పాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కల్తీ మరింత భారీగా పెరుగుతుందంటున్నారు.  

సాధారణ కల్తీ ఇలా.. 
పాల లభ్యత తక్కువగా ఉన్న సమయంలో వ్యాపారులు కల్తీకి తెగబడుతున్నారు. పాలకు రంగు, చిక్కదనం, నురుగును రప్పించేందుకు యూరియా, మైదా, డిటర్జెంట్‌లను వినియోగిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇవి కాకుండా పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు కూడా పలు రసాయనాలను వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది కాకుండా వెన్న తీసేసిన పాలకు కూడా జిడ్డును రప్పించేందుకు కూడా పలు పదార్థాలను వాడుతున్నారంటున్నారు. ప్రస్తుతం ఈ కల్తీ గుట్టును తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపైనే ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement