ఎవరైనా మీతో అభ్యంతరకరంగా మాట్లాడితే ఏం చేస్తారు? వెంటనే ఆయనకు ధీటుగా జవాబిస్తారు. అలా కాకుండా మీ పక్కనున్న వ్యక్తిని తిట్టారనుకోండి.. దానిని ఏమంటారు? ఏదో భయంతో అలా చేసి ఉంటారని అనుకోవడం సహజమే కదా! ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అదే పని చేశారు. తాను కోరితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటిస్తే చంద్రబాబు జవాబు ఇవ్వకపోగా... వైఎస్సార్ కాంగ్రెస్‌పై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారు.
అసలు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు.. మంత్రులతో మాట్లాడించారు. అంతేకాక మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడానికి పోలవరం ప్రాజెక్టు సందర్శన పెట్టుకుని, గోదావరి జలాల గురించి, రాష్ట్రాల మధ్య సహకారం గురించి సుద్దులు చెప్పారు. పోనీ చంద్రబాబు నిజంగానే అంత చిత్తశుద్దితో ఈ విషయాలు మాట్లాడారా అంటే అదీ కనిపించదు. ఆయన విపక్షంలో ఉంటే ఒక రకం, అధికారంలో ఉంటే మరో రకం.
చంద్రబాబు గత చరిత్ర అంతా ఇలా వైరుధ్యాలతోనే సాగుతోంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో 2011లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతోపాటు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలలో కొన్నిచోట్ల టీడీపీ కూడా పోటీచేసింది. ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్నందున గెలిచే అవకాశాలు లేవన్న అంచనాకు వచ్చారు. అందువల్ల పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేసే సానుకూల పరిస్థితులు లేవని భావించిన చంద్రబాబు వెంటనే డైవర్షన్ రాజకీయం చేశారు. మహారాష్ట్రలో కట్టిన బాబ్లి ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని, రెండు రాష్ట్రాల ఒప్పందానికి వ్యతిరేకంగా నిర్మించారని ఉమ్మడి ఏపీ రాజకీయ పార్టీలు ఆరోపించేవి. ఆ వివాదాన్ని చంద్రబాబు వ్యూహాత్మకంగా తన భుజాన వేసుకుని ఆ ప్రాజెక్టుపై పోరాటం ప్రకటించారు.
పొరుగు రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాజెక్టును సందర్శించి హడావుడి చేయడానికి సిద్దమయ్యారు. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సుమారు 75 మందిని వెంటబెట్టుకుని దండయాత్ర మాదిరి మహారాష్ట్రకు బయల్దేరారు. ఆ రాష్ట్ర పోలీసులు దానిని అడ్డుకున్నారు. వారు పెట్టిన బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లే యత్నం చేశారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ధర్మాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత పోలీసులు వారిని వదలిపెట్టేశారు. అయినా తమను బాబ్లి ప్రాజెక్టు వద్దకు మీడియాతో సహా అనుమతించాలని డిమాండ్ చేస్తూ అక్కడే భైఠాయించారు. ఒక దశలో లాఠీ ఛార్జ్ కూడా జరిగింది. దీనికి ముందు రాష్ట్ర సరిహద్దులో దాదాపు గంటన్నర సేపు వీరంతా ధర్నా చేశారు.మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. పొరుగు రాష్ట్రానికి రావాలంటే పాస్ పోర్టు కావాలా అని కూడా ఆయన ప్రశ్నించారు.
తాము యుద్దం చేయడానికి రాలేదంటూనే అంటూనే పోలీసుల సూచనలు పట్టించుకోకుండా హంగామా సృష్టించారు. దాంతో పోలీసులు చంద్రబాబుతో సహా ఆందోళనకారులపై కేసు పెట్టి అరెస్టు చేశారు.వారందరిని ఒక కాలేజీ ఆవరణలో ఉంచారు. .ఆ సమయంలో కొందరు నేతలు అక్కడనుంచి వచ్చేసినా, ఎక్కువమంది కేసులో ఇరుక్కున్నారు. కేసు రిజిస్టర్ కావడంతో టిడిపి నేతలు ఆందోళనకు గురయ్యారు. ఆ తరుణంలో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకు పరిస్థితిని టీడీపీ నేతలు వివరించడంతో ఆయన ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఏపీకి తీసుకువచ్చారు. ఆ కేసు ధర్మాబాద్ కోర్టుకు వెళ్లింది. కోర్టులో విచారణకు వచ్చే సమయానికి చంద్రబాబు విభజిత ఏపీకి సీఎం కావడంతో బిజీ షెడ్యూల్స్ అంటూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు.
అక్రమంగా నిర్మించిన బాబ్లి ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణలో 18 లక్షల ఎకరాలకు నీటి సంక్షోభం వస్తుందని ఆరోపించేవారు. తీరా చూస్తే ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చేది రెండు,మూడు టీఎంసీలే కావడం విశేషం. విపక్షంలో ఉండగా చంద్రబాబు వ్యవహరించిన తీరు అది. అప్పుడు రాష్ట్రాల మధ్య రాజకీయాలు వద్దని అనలేదు. ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని అనేవారు. భావోద్వేగాలు రెచ్చగొడుతున్నట్లు ఆయన ఫీల్ కాలేదు. ఇప్పుడేమో రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ వల్ల వచ్చేవి 22 టీఎంసీలే అంటూ అర్ధం లేని వాదన తీసుకువచ్చారు. అది నిజమే అయితే రేవంత్ కు ఆ మాటే చెప్పి ఉండవచ్చు కదా! ఈ స్కీమ్ వల్ల రాయలసీమకు పెద్దగా కలిసి వచ్చేది లేదని, అందువల్ల తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడనవసరం లేదని లేఖ రాసి ఒప్పించి ఉండవచ్చు కదా! రేవంత్ తో కుమ్మక్కై చీకటి ఒప్పందం చేసుకున్నారన్న అభిప్రాయం ఏర్పడినా చంద్రబాబు మాత్రం దానిని ఖండించలేకపోయారు.

దీంతో రేవంత్ చెప్పిందంతా నిజమేనని, ఆయన డిమాండ్‌కు తలొగ్గి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ను చంద్రబాబు నిలిపివేశారని ఏపీ ప్రజలకు అర్థమైంది. తన శిష్యుడుగా పేరొందిన రేవంత్ ను ఒక్క మాట అనలేకపోవడంతో ఈయనలో ఏదో భయం ఉందన్న భావన రాజకీయవర్గాలలో ఏర్పడింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి టైమ్ లోనే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌కు స్టే వచ్చిందని తొలుత ప్రచారం చేశారు. అయినా జగన్ పనులు ఎక్కడా ఆపకుండా 85 శాతం పూర్తి చేశారని వీడియోలతో సహా కధనాలు రావడంతో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు, ఆయన మంత్రులు ఇప్పుడు ఏకంగా ఆ ప్రాజెక్టే అవసరం లేదన్నట్లు మాట్లాడి మరింత తప్పు చేశారు.ఒక తప్పును కవర్ చేసుకోబోయి మరిన్ని తప్పులు చేశారన్నమాట.
పోనీ అన్ని ప్రాజెక్టులు అనుమతులతోనే ఆరంభం అవుతున్నాయా అంటే ఏ రాష్ట్రంలో అలా జరగదు.చంద్రబాబు చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తం పట్నం, చింతలపూడి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగు గంగ వంటి ప్రాజెక్టులను అలాగే చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు అనుమతులు కేంద్రం నుంచి సాధించే ప్రయత్నంలో ఉన్న సమయంలోనే కుడి, ఎడమ కాల్వలను తవ్వించారు. కుడి కాల్వకు టిడిపి వారే అడ్డుపడడానికి యత్నించిన సంగతి అందరికి తెలిసిందే. తెలంగాణ ప్రాజెక్టులకు తాను అడ్డు పడడం లేదని చంద్రబాబు ఏపీలో ఆయా సభలలో చెప్పడాన్ని ఎద్దేవ చేస్తూ తెలంగాణకు చెందిన 16 ప్రాజెక్టులపై ఎపి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆ మీడియా వెల్లడించింది.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2015-2017 మధ్య ఐదుసార్లు చంద్రబాబు ప్రభుత్వం లేఖలు ఎలా రాశారని ఆ మీడియా ప్రశ్నించింది. ఇదే కాదు..ఓటుకు నోటు కేసు సమయంలో హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలని, గవర్నర్ శాంతిభద్రతలు పర్యవేక్షించాలని, ఏపీ ప్రభుత్వం కూడా హైదరాబాదఃలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవచ్చని చంద్రబాబు బృందం వాదించేది. మరో విశేషం ఏమిటంటే ఓటుకు నోటు కేసు గురించి చెప్పమంటే, కేసీఆర్ టెలిఫోన్ టాపింగ్ ఎలా చేస్తారని ఎదురు ప్రశ్నించేవారు. ఏపీలో కేసీఆర్‌పై కేసులు పెట్టించారు.ఆత్మరక్షణలో పడిన ప్రతిసారి ఇలా డైవర్షన్ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు సిద్దహస్తుడని చరిత్ర చెబుతోంది. అయినా ఈసారి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ విషయంలో మాత్రం డైవర్షన్ రాజకీయం ఫలించలేదు.

కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


