తన పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని సహించబోమంటూ ఆందోళనకారుల్ని హెచ్చరించారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కూడా చురకలు అంటించారు. శుక్రవారం ఇరాన్ ఆందోళనలపై ఓ వీడియో మేసేజ్‌లో ఖమేనీ స్పందిస్తూ..
మన దేశ వీధులను పాడుచేసి.. మరో దేశ అధ్యక్షుడిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి కోసం రోడ్డెక్కి దేశ పరువు తీయొద్దు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని ఇస్లామిక్ రిపబ్లిక్ సహించబోదు అని వార్నింగ్ ఇచ్చారు.
తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన.. ఈ సమయంలో ఇరాన్ యువత ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని, అప్పుడే ఎలాంటి శత్రువునైనా ఇరాన్ ఎదుర్కొగలుగుతుందని అభిప్రాయపడ్డారు.
మీ సంగతి చూస్కోండి
నిరసనకారులపై కాల్పులు జరిపితే చూస్తూ ఊరుకోబోమని ట్రంప్ పదే పదే ఇరాన్‌ను హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమేనీ, అగ్రరాజ్యం అధ్యక్షుడికి చురకలంటించారు. ఇతర దేశాలకు నీతులు చెప్పే ముందు సొంత దేశంపై దృష్టిపెట్టాలంటూ ట్రంప్‌కు ఖమేనీ హితవు చెప్పారు.
ఖమేనీ గద్దె దిగాలంటూ ఇరాన్ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో జరుగుతున్న ఆందోళనలు.. గత కొద్దిరోజులుగా తీవ్రతరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచిపారిపోయారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఇరాన్ ప్రభుత్వం వాటిని ఖండించినా.. ఖమేనీ మాత్రం అధికారికంగా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన ఆశ్రయం కోసం మాస్కోకు వెళ్లారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఊహాగాలను తెర దించుతూ ఇవాళ ఆయన ఇరాన్ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు.
2026 ఆర్థిక బడ్జెట్‌పై అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రసంగం సమయంలో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఆర్థిక సంక్షోభంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, తారాస్థాయికి చేరుకున్న నిరుద్యోగ సమస్య, కరెన్సీ విలువ పడిపోవడం,వీటికి తోడు రాజకీయ స్వేచ్ఛకు భంగం కలగడంతో.. ఇరాన్ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. టెహ్రాన్, మష్హాద్, ఇస్ఫహాన్ వంటి నగరాల్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా, ఇరాన్‌లో నూతన సంస్కరణలను డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ప్రజలు రోడ్డెక్కి నినాదాలు చేశారు.
డిసెంబర్ 28న మొదలై.. 27 ప్రావిన్సుల్లో 250కి పైగా ప్రాంతాలకు నిరసనలు విస్తరించాయి. ఆందోళనకారుల్ని అణచివేసేందుకు భద్రతా బలగాలు.. టియర్ గ్యాస్, షాట్‌గన్స్, వాటర్ కేనన్‌లు ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గత 12 రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనల్లో ఇప్పటిదాకా 35 మంది మరణించారు. వీళ్లలో నలుగురు చిన్నారులు, ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారు. సుమారు 1,200 మందికి పైగా అరెస్టు అయ్యారు. భారీగా ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లింది.
పరిస్థితి తీవ్రతరం కావడంతో ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేసింది ఇరాన్ ప్రభుత్వం. నిరసనకారులను విదేశీ శక్తుల కిరాయి సైనికులుగా అభివర్ణిస్తూ, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.


