విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో తానాడిన తొలి మ్యాచ్‌లోనే (విదర్భపై 92 బంతుల్లో 8 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 133 పరుగులు) విధ్వంసకర శతకం బాదిన అతను.. ఇవాళ (జనవరి 8) తన రెండో మ్యాచ్‌లో ఛత్తీస్‌ఘడ్‌పై మెరుపు అర్ద సెంచరీతో మెరిశాడు. 31 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేశాడు.
మొత్తంగా ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో 125 బంతులు ఎదుర్కొన్న హార్దిక్.. 21 సిక్సర్లు, 10 ఫోర్ల సాయంతో 208 పరుగులు చేసి మహోగ్రరూపంలో ఉన్నాడు. త్వరలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ సిరీస్‌లో హార్దిక్ ఇదే జోరును కొనసాగిస్తే పర్యాటక జట్టుకు తిప్పలు తప్పవు. జనవరి 21 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో హార్దిక్ కీలక సభ్యుడు. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టే ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లోనూ కొనసాగుతుంది. హార్దిక్ ఇదే ఫామ్‌లో ఉంటే ప్రపంచకప్‌లో టీమిండియాకు తిరుగుండదు. గత వరల్డ్‌కప్‌లోనూ హార్దిక్ టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఛత్తీస్‌ఘడ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న బరోడా 36.5 ఓవర్ల అనంతరం 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఓపెనర్లు నితిన్ పాండ్యా (2), అమిత్ పాసి (5) నిరాశపర్చినా.. ప్రయాన్షు మోలియా (79 నాటౌట్), విష్ణు సోలంకి (54), హార్దిక్ పాండ్యా (75), జితేశ్ శర్మ (64 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. మోలియా, జితేశ్ ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న హార్దిక్ అన్న కృనాల్ పాండ్యా (20) ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు.


