సాక్షి, హైదరాబాద్: చైనా మాంజా విషయంలో నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దారాన్ని అమ్మినా.. కొనుగోలు చేసినా.. ఆ మాంజాతో పతంగులు ఎగరేసినవాళ్లపైనా కేసులు పెడతామని హెచ్చరించారు. తాజాగా భారీగా నిషేధిత మాంజాను పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ..
చైనా మాంజాపై నిషేధం విధించి పదేళ్లు అవుతోంది. ఇండస్ట్రీయల్ అవసరం కోసం తయారైన దారాన్ని మాంజాగా ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఇక మీదట నగరంలో అమ్మినా.. కొన్నా.. ఆ దారంతో పతంగులు ఎగరేసినా కేసులు పెడతాం. చైనా మాంజా కారణంగా ఎవరికైనా గాయాలైనా కేసులు పెడతాం. చైనా మాంజా విషయంలో పీడీ యాక్ట్ ప్రయోగించే ఆలోచన చేస్తున్నాం అని సజ్జనార్ హెచ్చరించారు.

చైనా మాంజాపై బ్యాన్ ఉన్నప్పటికీ.. సంక్రాంతి సీజన్‌కు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని దుకాణాదారులు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. పతంగులు ఎగురవేసే సమయంలో అవి తెగి మాంజా గాలిలో వేలాడుతున్నాయి. వాహనాలపై ప్రయాణించేవారికి చుట్టుకొని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే పక్షులు చనిపోతున్నాయి. తాజాగా..
నగరంలో అధికారులు పట్టుకున్న మాంజా విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి దుకాణాదారులు చైనా మాంజాను తెప్పించే క్రమంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు.. చైనా మాంజా తయారు చేస్తున్న రెండు ఫ్యాక్టరీలను సీజ్ చేసినట్లు.. గుజరాత్, రాజస్థాన్ తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ మాంజా ఫ్యాక్టరీలపై పోలీసుల ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.


