బరువు తగ్గించే చిట్కాలు..సింపుల్ రెమిడీస్ వంటివి ఎన్నో చూశాం. పలానా వ్యాయామం, డైట్ అంటూ ఏవేవో కొంగొత్త విధానాలతో బరువు తగ్గిన ఉదంతాలు చూశాం. కొందరు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటూ..కార్డియాక్ వర్కౌట్లు, వాకింగ్‌లు, స్కిప్పింగ్‌లు అంటూ ఎంతో శ్రమ పడి తగ్గగా.. మరికొందరు సైక్లింగ్‌తో కుస్తీలు పడ్డారు. ఒక్కోక్కరూ ఒక్కోదారిలో వెళ్లి బరువు తగ్గి స్ఫూర్తిగా నిలిచారు. కానీ ఈ మహిళ ఇంతలా కష్టపడకుండా అందరు సులభంగా చేసే, చాలా తేలికైన అలవాటుతో ఇట్టే బరువు తగ్గింది. అది కూడా ఏకంగా 86 కిలోలు బరువు తగ్గడం అంటే మాటలు కాదు కదా..!. అలా అని షార్ట్‌కట్‌లు, ఏవేవో మందులు, ఇంజెక్షన్‌లు తీసుకోలేదు సుమీ..!. మరి ఆమె ఎలా అంతలా బరువు తగ్గింది..?, ఏంటా హాబీ..? అంటే..
బరువు తగ్గించే జర్నీలో అందరికీ అతిపెద్ద టాస్క్ వ్యాయామం, వర్కౌట్లు. కానీ ఈ అమెరికా మహిళ కామ్ ఆ పాట్లు ఏం పడకుండా చాలా స్మార్ట్‌గా చిన్న చిన్న అలవాట్లతో మైండ్‌ని సెట్ చేసుకుంటూ సులభంగా బరువు తగ్గి అద్భుతం చేసింది. తాను ఎలాంటి ఫిట్‌నెస్ ట్రైనర్, స్నేహితులు, బంధువుల సహాయం తీసుకోకుండా కేవలం ఆ చిన్న అలవాటుతో బరువు తగ్గించుకున్నానంటోంది.
తాను చెప్పబోయే అలవాటు వినడానికి హాస్యస్పదంగా, నమ్మశక్యంగా అనిపించకపోయినా..అద్భుతం చేసిందనేది నమ్మక తప్పని వాస్తవం అని అంటోందామె. కామ్ తనకు ఉన్న డైరీ రాసే అలవాటే అద్భుతంగా బరువు తగ్గేందుకు హెల్ప్ అయ్యిందట. అలా ఏకంగా 86 కిలోలు పైనే బరువు తగ్గానని చెబుతోంది. ఆ డైరీలో తన వెయిట్‌లాస్ జర్నీని ఎందుకు ప్రారంభించింది.. ఆ టైంలో తాను ఎలా ఉండేది వంటి పోటోలతో సహా పొందుపరిచింది. వాటిని చూసుకుంటూ..తన శరీర పరివర్తనలో మార్పులకు శ్రీకారం చుట్టిందట.
ఎందుకంటే ఆ డైరీ ఓపెన్ చేయగానే తన దినచర్య సరిగా ఉందా, ఆహారం మితంగా తిన్నానా లేదా అని తరచి.. తరచి.. చూసుకోవడమే కాకుండా జవాబుదారీగా ఉండాలే చేస్తుందట. ఆ క్రమంలో తనకు స్ఫూర్తిని కలిగించే సూక్తులు, మార్గదర్శకులు తదితరాలన్నింటి గురించి రాసేదట. అంతేగాదు ఒకరకంగా ఏం తిన్నాను, ఏం వ్యాయామాలు చేశాను అన్నది రాస్తున్నప్పుడూ..అబ్బా ఇది చేయలేకపోయాను..ఇంకా బాగా చేయాలి అనే ఫీడ్ బ్యాక్ ఇస్తుంటుందట ఆ అలవాటు. దాంతో బరువు తగ్గాలనే ఆలోచన బలంగా మదిలో నాటుకుని..అన్నింటిపై సరైన ఫోకస్ పెడతామట. ఫలితంగా బరువు తగ్గడం సులభం అవుతుందని అంటోందామె.
నిజంగా హెల్ప్ అవుతుందా అంటే..?
బరువు తగ్గించే జర్నీలో డైరీ రాసే అలవాటు పెద్ద పాత్ర పోషిస్తుందని పరిశోధనలు సైతం చెబుతుండటం విశేషం. హార్వర్డ్ నివేదిక ప్రకారం, దాదాపు 1,700 మంది రోజువారి ఆహార రికార్డులను తమ డైరీలో ట్రాక్ చేయగా..వారంతా రెండు రెట్లు బరువు తగ్గారట. అలాగే మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ ప్రచురించిన 2012 జర్నల్ సైతం ఇలా డైరీ రాసే వ్యక్తులు అధిక మొత్తంలో బరువు తగ్గినట్లు అధ్యయనం పేర్కొంది.
ఇలా మనం తినేవాటిని వ్రాయడం, ప్రాముఖ్యతను హైలెట్ చేయడం వల్ల తమ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయనేది తరచి చూసుకునే అవకాశం వస్తుందట..దాంతో బరువు తగ్గుతారట. ఇలా ఎంత ఎక్కువగా తాము తినే ప్రతి ఆహారం గురించి నమోదు చేసే అలవాటు ఉంటే అంత అధిక మొత్తం లో బరువు తగ్గుతారని పలువురు నిపుణులు చెబుతున్నారు. మరి వెయిట్‌లాస్ జర్నీలో మంచి ఫలితాలు అందుకునేందుకు డైరీ రాసే అలవాటుని సత్వరమే ప్రారంభిద్దామా మరి..
(చదవండి: Beauty Tips: శీతాకాలంలో ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం.. ఈ ఆరు సూప్‌లు..!)


