24 ఏళ్ల వయసులో 197 దేశాలు..! | Around 197 countries with Shubham Kumar From Bihar | Sakshi
Sakshi News home page

24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!

Mar 4 2026 2:31 PM | Updated on Mar 4 2026 4:40 PM

Around 197 countries with Shubham Kumar From Bihar

విదేశీ టూర్‌ వ్లాగర్‌ అనగానే మంచి ఆదాయం, వీసా, మంచి ఆంగ్ల భాషా నైపుణ్యం తదితరాలతో ముడిపడి ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే సాధ్యం. అది కూడా డబ్బున్నవాళ్లకే సాధ్యం, అని అందరి మదిలో నాటుకున్న భావన. అయితే అందరి అంచనాలను బ్రేక్‌ చేస్తూ ఓ గ్రామీణ యువకుడు..ఎలాంటి బడ్జెట్‌, కనీసం ఇంగ్లీష్‌ భాషా నైపుణ్యం, వివిధ వీసాలు కూడా లేకుండానే ఏకంగా 197 దేశాలు చుట్టేస్తూ..గ్రేట్‌ ట్రావెల్‌ వ్లాగర్‌గా పేరుతెచ్చుకుంటున్నాడు. అది కూడా తన సొంత డబ్బుతోనే ఇన్ని దేశాలు చుట్టేసి రావడం విశేషం. కేవలం 24 ఏళ్లకే ఇన్ని దేశాలంటే మాటలు కాదుకదా..!. మరి ఆ యువకుడు ఎవరు..?, ఏమా కథ చూద్దామా..!. 

బిహార్‌లోని ముంగేర్‌, భాగల్పూర్‌ల మధ్య ఒక చిన్న గ్రామానికి చెందని శుభమ్‌ కుమార్‌ అనే యువకుడు  197 దేశాలు పర్యటించాడు. అదికూడా కేవలం భారతీయ పాస్‌పోర్ట్‌తో, తన సొంత డబ్బుతో చుట్టొచ్చాడు. సాధారణంగా విదేశీ ప్రయాణం అంటే.. చేతినిండా డబ్బు, బహుళ వీసాలు పొందే సామర్థ్యం, మంచి ఆంగ్లభాషా నైపుణ్యం ఉంటేనే సాధ్యమవుతుంది. తనవద్ద ఇవేమి లేకపోయినా..కేవలం తనకున్న ఇష్టం, ప్యాషన్‌తో అలవోకగా దేశాలు చుట్టేశాడు. నిజానికి శుభమ్‌ది మధ్య తరగతి నేపథ్యం. 

తండ్రి ప్రభుత్వ పాఠశాల టీచర్‌. ఇరుకైన గ్రామదారుల నడుమ చిన్న చిన్న గదులతో ఉండే ఇల్లు. సోషల్‌ మీడియాలో తన హోమ్‌టూర్‌ వీడియోలతో వేలాదిగా అభిమానులను సంపాదించుకున్న అతడి జర్నీ..నెమ్మదిగా ట్రావెల్‌ వ్లాగ్‌ పేరుతో విదేశీ టూర్‌లు పర్యటించే రేంజ్‌కు చేరుకున్నాడు. అతడి వీడియోలు చాలా నేచురల్‌గా, వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో అందరూ సులభంగా కనెక్ట్‌ అయ్యేవారు. 

అలా అతడి యూట్యూబ్‌ ఛానెల్‌కి ఏకంగా మూడు మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు, ఆరు లక్షలకు పైగా ఫోలోవర్లు ఉన్నారు. అతని ప్రతి ట్రావెల్‌ వీడియో కనీసం మూడు నుంచి నాలుగు లక్షల వ్యూస్‌ వస్తుంటాయి. ఇదంత శుభమ్‌కి ఒక్కరాత్రిలో సంపాదించిన ఘనత మాత్రం కాదు. 

జర్నీ ఎలా ప్రారంభమైందంటే..
తనకేమి బహుళ వీసాల సామర్థ్యం లేదని, అలాగే ఇంగ్లీష్‌పై అంత పట్టు కూడా లేదని ఓపెన్‌గానే చెప్పేశాడు శుభమ్‌. కేవలం ఇండియా పాస్‌పోర్ట్‌తోనే పర్యటిస్తున్నట్లు తెలిపాడు. తనకు 13 లేదా 14 ఏళ్ల వయసు నుంచి విదేశాలు పర్యటించాలనే కోరిక బలంగా ఉండేదని అలా ఈ ట్రావెల్‌ వ్లాగ్‌గా వీడియోలు చేస్తూ..తన కోరికను నెరవేర్చుకున్నానని అంటున్నాడు. సరిగ్గా 2018లో లేహ్-లడఖ్ పర్యటనతో మొదలైంది అతడి ప్రస్థానం. 

ఓ పక్క పాఠశాల తరగుతులు..మరోవైపు ఈ విదేశాల టూర్లుతో బిజీగా ఉండేవాడు. తన తొలి అంతర్జాతీయ పర్యటన మాత్రం నేపాల్‌, తర్వాత రష్యా, థాయిలాండ్‌, లావోస్‌..అలా 2019 నాటికి చైనా నుంచి తన మొదటి గ్లోబల్‌ వ్లాగ్‌ పోస్ట్‌ చేశాడు. అలా చేస్తున్నప్పుడు సవాళ్లు మాములుగా లేవని..తన టూర్‌ ఖర్చుల కోసం కోచింగ్‌ సెంటర్లను కూడా మినహాయించాల్సి వచ్చేదని చెప్పుకొచ్చాడు శుభమ్‌. అంతేగాదు 16 ఏళ్ల వయసుకి రష్యా వెళ్లి అక్కడ భూభాగంలో దాదాపు 3 వేల కిలోమీటర్లు హిచ్‌హైక్‌ చేశాడు. 

అలాగే తల్లిదండ్రులకు ఐఏఎస్‌కి ప్రిపేరవ్వుతా, ఢిల్లీ వెళ్తానని అబద్ధం చెప్పి..మలేషియా విమానం ఎక్కాడు. అయితే ఇక్కడ విదేశీటూర్‌లకు వెళ్లాలంటే ఎంతో స్ట్రాంగ్‌ పాస్‌పోర్టులు చాలానే ఉండాలి. కేవలం భారత పాస్‌పోర్ట్‌తో అన్ని దేశాలు చుట్టిరావడం చాలా కష్టం.. ఎందుకంటే  డాక్యుమెంటేషన్ ఒత్తిడి, పరిమిత వీసా యాక్సెస్, వీసా స్టాంపులకు పాస్‌పోర్ట్‌లో తగినంత ఖాళీ పేజీలు ఉండాలి కూడా. ఆ క్రమంలో  ఈక్వెడార్ పర్యటనకు దాదాపు బహిష్కరింపబడతానని భయపడ్డాడట శుభమ్‌. 

ఎందుకంటే అప్పటికే తన పాస్‌పోర్ట్‌లో ఖాళీ పేజీలు లేనందున తనకు ఈక్వెడార్‌లోకి ప్రవేశం దాదాపుగా నిరాకరిస్తారనే అనుకున్నాడు. పైగా అప్పటికే ఆరు పాస్‌పోర్ట్‌లను నింపాడు. అయితే శుభమ్‌ ప్రతి దేశానికి ఈ పాస్‌పోర్ట్‌తోనే వెళ్లాలని లక్ష్యం పెట్టుకున్నాడట. అలాగే దీంతోనే వెళ్లగలను అని పూర్తిగా విశ్వసించాడట. ఆ నమ్మకంతోనే విజయవంతంగా విదేశాలు చుట్టిరాగలిగాను అంటున్నాడు శుభమ్‌. 

16 ఏళ్లకు మొదలు పెట్టిన ఈ జర్నీని ఏడేళ్లు తన తండ్రి ఇచ్చిన డబ్బులతో పర్యటించగా, 23 ఏళ్లు వచ్చేటప్పటికీ తన పూర్తి సొంత నిధులతో టూర్‌లు ప్లాన్‌ చేసుకున్నాడట. అంటే శుభమ్‌ అప్‌లోడ్‌ చేసే వీడియోల ద్వారా వచ్చిన ఆదాయం..అలాగే ఆయా దేశాల్లో ఉంటూ కొంత సంపాదించిన డబ్బుతో తన ప్రయాణానికి నిధులు సమకూర్చుకునేవాడట. అలా శుభమ్‌ శుభప్రదంగా 197 దేశాలు పర్యటించాడు. అంతేకాదండోయ్‌ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సైతం అతడికి ఫోన్‌చేసి మరి అభినందించారట. 

ఇప్పుడు అతని టూర్‌ బకెట్‌ లిస్ట్‌లో బ్రెజిల్‌ దేశం ఉంది. ప్రస్తుతం అక్కడే ఉన్నాడట శుభమ్‌. పరిమిత వనరులే ఉన్నా..గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి కూడా..తన ఆసక్తితో ఇంతటి అనితరసాధ్యమైనదాన్ని సాధించి చూపించి..ఇతర ట్రావెల్‌ వ్లాగర్లకు, నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు కదా..!.

 

 

(చదవండి: అత్యంత విషపూరితమైన పాయిజన్‌తో..ప్రాణాంతక వ్యాధులకు చెక్‌..!)

Advertisement
 
Advertisement
Advertisement