ఆర్మీ ట్రైనింగ్‌ సెంటర్‌లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్‌ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే.. | Two Agniveer Trainees Die Of Suspected Meningococcal Infection, Know Its Symptoms, Prevention Measures | Sakshi
Sakshi News home page

ఆర్మీ ట్రైనింగ్‌ సెంటర్‌లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్‌ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..

Mar 1 2026 9:52 AM | Updated on Mar 1 2026 11:26 AM

Two Agniveer Trainees Die Of Suspected Meningococcal Infection

షిల్లాంగ్‌లోని ఆర్మీ శిక్షణా కేంద్రంలో ఇద్దరు అగ్నివీర్‌ శిక్షణార్థులు అనుమానిత మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ బారినపడి గంటల వ్యవధిలోనే మరణించారు. ఒక్కసారిగా అస్సాం రెజిమెంటల్‌ సెంటర్‌ ఉలక్కిపడింది. సత్వరమై సైనిక సౌకర్యంలో చుట్టుపక్కల కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ఆయా వ్యక్తులతో టచ్‌లో ఉన్నవారిని ఐసోలేషన్‌లో ఉంచడం, వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించేలా సత్వరమే అన్ని చర్యలు చేపట్టింది. కేవలం ఆర్మీ శిక్షణా కేంద్రంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా గట్టి నిఘా ఉంచినట్లు స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇంతకీ అసలేంటి మెనింగోకాకల్ వ్యాధి ..? ఎందువల్ల వస్తుందంటే..?

మెనింగోకాకల్ వ్యాధి అంటే ..?
మెనింజైటిస్ మెదడు,  వెన్నుపాము చుట్టూ ఉన్న కణజాలాల వాపుకు కారణమవుతుంది. మెనింజైటిస్ ప్రపంచ ఆరోగ్యానికి ఒక  తీవ్రమైన ముప్పుగా అభివర్ణించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ).  ఇది అనేక రకాల బ్యాక్టీరియాలే, వైరస్‌లు, శిలీంధ్రాలు, పరాన్నజీవుల వల్ల సంభవిస్తుందని WHO పేర్కొంది. అయితే ఇది అంటువ్యాధి లాంటిది కాదని కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు వైద్యులు.

బాక్టీరియల్ మెనింజైటిస్ అత్యంత తీవ్రమైన రకం మెనింజైటిస్ అని WHO చెబుతోంది. దీని కారణంగా రోగికి తీవ్రమైన, ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. మెనింగోకోకస్ అనేది నీసేరియా మెనింగిటిడిస్ అనే బాక్టీరియా వల్ల కలిగే బాక్టీరియల్ మెనింజైటిస్.

వ్యాధి లక్షణాలు
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం మెనింగోకాకల్ వ్యాధి యొక్క కొన్ని సాధారణ లక్షణాలు:

ప్రకాశవంతమైన కాంతి వల్ల ఇబ్బంది పడటం
విరేచనాలు
జ్వరం
తలనొప్పి
వాంతులు
ముదురు రంగులోకి మారినట్లు కనిపించే చర్మ దద్దుర్లు
గట్టి మెడ
గందరగోళం,చిరాకు
చాలా నిద్రమత్తుగా అనిపించడం
నడవడానికి లేదా నిటారుగా ఉండటానికి ఇబ్బంది
విపరీతమైన మంటలు, నొప్పులు
కీళ్లు, కండరాల నొప్పి
ఆకలి లేకపోవడం

ఎవరికీ ఈ ప్రమాదం అధికం అంటే..

ఈ ఇన్ఫెక్షన్ ఏ వ్యక్తినైనా ప్రభావితం చేయవచ్చు, అయితే, కొంతమందికి ఎక్కువ ప్రమాదాలు ఉంటాయి. 

ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, టీనేజర్ లేదా చిన్న వయస్సులో ఉన్నవారు

ప్లీహ గాయం లేదా ప్లీహము లేకపోవడం

సికిల్ సెల్ వ్యాధి ఉన్నవాళ్లకు

కాంప్లిమెంట్ ఇన్హిబిటర్ మందులు తీసుకునేవాళ్లు

మెనింగోకాకల్ వ్యాధి సాధారణంగా ఉండే ప్రాంతాలను సందర్శించడం వల్ల

దీనికారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలు..
బాధిత వ్యక్తులు వెంటనే వైద్య చికిత్స పొందకపోతే  ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు, చికిత్స పొందినప్పటికీ ప్రజలు చనిపోవచ్చు. ఈ వ్యాధి కారణంగా ఎదురయ్యే సమస్యలు..

మెదడు దెబ్బతినడం
మూత్రపిండాల నష్టం
అవయవాలు కోల్పోవడం
నరాల దెబ్బతినడం
పూర్తిగా వినికిడి లోపం

నివారణ చర్యలు
వ్యాక్సిన్లు సాధారణ రకాల బాక్టీరియల్ మెనింజైటిస్ నుంచి ఉత్తమ రక్షణను అందిస్తాయని WHO చెబుతోంది. మెనింగోకాకస్, న్యుమోకాకస్, హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా టైప్ బి (Hib) వల్ల కలిగే  మెనింగోకాకల్ వ్యాధిని  టీకాలు నిరోధించగలవు. 
ఇతర నివారణ చర్యలు..

11-12 సంవత్సరాల వయస్సులో మెనింగోకాకల్ కంజుగేట్ (MenACWY) వంటి టీకాలు వేయించడం.16 ఏళ్ల లోపు వాళ్లకు బూస్టర్‌డోస్‌లు వేయించడం. అలాగే సెరోగ్రూప్ B నుంచి అదనపు రక్షణ కోసం సిఫార్సు చేసిన MenB టీకాలు వేయించడం. టీకాలు సాధారణ జాతులను (A, C, W, Y, B) లక్ష్యంగా చేసుకుంటాయి. టీనేజ్ పిల్లలు, టీనేజర్లు, HIV లేదా అస్ప్లెనియా వంటి ఆరోగ్య ప్రమాదాలు ఉన్నవారికి ఈ టీకాలు వేయించడం మంచిది.

పరిశుభ్రత పద్ధతులు: ముఖ్యంగా బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత లేదా తినడానికి ముందు సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోండి. కడగని చేతులతో కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకకుండా ఉండండి. పానీయాలు, ఆహారం, పాత్రలు, లిప్‌స్టిక్‌లు లేదా సిగరెట్లను పంచుకోవద్దు, దగ్గు/తుమ్ము వచ్చినప్పుడు చేతులు లేదా జేబురుమాల్‌ అడ్డుపెట్టుకోవడం. ఈ చర్యలు తీసుకుంటే శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాప్తి చెందే ఈ బ్యాక్టీరియాను కట్టడి చేయొచ్చు. ముఖ్యంగా దద్దుర్లు, మెడనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యం సహాయం తీసుకోవడం ఉత్తమం. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: రీల్స్‌ పిచ్చి వర్సెస్‌ చదువు..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement