నో టెన్షన్... ఓన్లీ అటెన్షన్... | Key steps to Success in exams | Sakshi
Sakshi News home page

నో టెన్షన్... ఓన్లీ అటెన్షన్...

Mar 1 2026 6:14 AM | Updated on Mar 1 2026 6:14 AM

Key steps to Success in exams

సైకాలజిస్ట్‌ విశేష్‌
ఫౌండర్, జీనియస్‌ మేట్రిక్స్‌ హబ్‌
www.psyvisesh.com

వసంత కాలం రాకతో ప్రకృతిలో కొత్త చిగుళ్లు ఎలా వస్తాయో, విద్యార్థుల జీవితంలో ‘పరీక్షల సీజన్‌’ కూడా వారి మేధస్సుకు కొత్త రెక్కలు ఇచ్చే సమయం. దురదృష్టవశాత్తు ఈరోజుల్లో ‘పరీక్ష’ అనే పదం వినగానే విద్యార్థుల గుండెల్లో ఒక తెలియని వణుకు, మెదడులో ఒక రకమైన నిశ్శబ్ద యుద్ధం మొదలవుతున్నాయి. కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా ఒక రకమైన ఆందోళనలోకి జారిపోతున్నారు. ఇళ్లలో పండుగ వాతావరణం పోయి, ఒక రకమైన ‘యుద్ధ ప్రాతిపదిక’ వాతావరణం మొదలవుతుంది.

అసలు పరీక్ష అంటే ఏమిటి? అదంటే ఎందుకంత భయం? అది కేవలం మూడు గంటల పాటు కాగితంపై పెన్నుతో చేసే యుద్ధమా? లేక మన జ్ఞాపకశక్తిని, సహనాన్ని పరీక్షించే కొలమానమా? పరీక్షల్లో విజయం సాధించడమెలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈరోజు తెలుసుకుందాం. 

పరీక్షలంటే ఎందుకు భయం? 
మన మెదడు పరిణామ క్రమంలో ప్రమాదాల నుండి మనల్ని రక్షించడానికి ‘ఫైట్‌ ఆర్‌ ఫ్లైట్‌’ (పోరాడు లేదా పారిపో) అనే మెకానిజాన్ని అభివృద్ధి చేసుకుంది. పూర్వకాలంలో అడవిలో పులి కనిపిస్తే మెదడులోని ‘అమిగ్డలా’ అనే భాగం అలర్ట్‌ అయ్యి, ఒంట్లో అడ్రినలిన్, కార్టిసాల్‌ వంటి స్ట్రెస్‌ హార్మోన్లను విడుదల చేసేది. తద్వారా మనం ఆ పులితో పోరాడడమో లేదా అక్కడి నుంచి పారిపోవడమో చేసేవాళ్లం.

నేటి కాలంలో విద్యార్థులకు ఆ ‘పులి’ మరేదో కాదు– ‘పరీక్ష’. ప్రశ్నపత్రం చూడగానే లేదా పరీక్ష గురించి ఆలోచించగానే, మెదడు దాన్ని ఒక ప్రాణాపాయ స్థితిగా గుర్తిస్తుంది. అందుకే చేతులు వణకడం, చెమటలు పట్టడం, చదివింది మరచిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే, ఇది మీ అసమర్థత కాదు.. మీ మెదడు మిమ్మల్ని రక్షించడానికి చూపిస్తున్న అతి స్పందన మాత్రమే! ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే సగం భయం పోతుంది.

జ్ఞాపకశక్తి వర్సెస్‌ వ్యక్తిత్వం 
చాలామంది తల్లిదండ్రులు, విద్యార్థులు చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే, పరీక్షల్లో వచ్చే మార్కులను విద్యార్థి తెలివితేటలతో లేదా వ్యక్తిత్వంతో ముడిపెట్టడం.
» మీరు ఒక నిర్ణీత సమయంలో ఎంత సమాచారాన్ని గుర్తుంచుకోగలరు? దాన్ని పేపర్‌ మీద ఎంత స్పష్టంగా ప్రెజెంట్‌ చేయగలరు? మీ ప్రిపరేషన్‌ను ఎలా ప్లాన్‌ చేసుకున్నారు? అనే విషయాలను మాత్రమే పరీక్షలు కొలుస్తాయి.

»మీలో ఉన్న సృజనాత్మకత, మీ నాయకత్వ లక్షణాలు, కష్టాల్లో ఉన్నప్పుడు మీరు స్పందించే తీరు, మీ జీవితంలోని అసలైన ప్రతిభను పరీక్షలు ఎప్పటికీ కొలవలేవు.అందుకే మనం మొదట మన మెదడులో ఉన్న ‘పరీక్ష అంటే భయం’ అనే పాత ప్రోగ్రామింగ్‌ను బ్రేక్‌ చేయాలి. పరీక్షను ఒక గండంలా కాకుండా, ఒక అవకాశంగా చూడటం అలవాటు చేసుకోవాలి.

థామస్‌ ఆల్వా ఎడిసన్‌ నుంచి స్టీవ్‌ జాబ్స్‌ వరకు ఎందరో మహానుభావులు అకడమిక్‌ పరీక్షల్లో విఫలమైనవారే! కాని, వారు జీవితం అనే పరీక్షలో నెగ్గారు ఎందుకంటే వారు తమ మెదడును గొప్ప లక్ష్యాల కోసం తీర్చిదిద్దుకున్నారు. ఈ పరీక్షలు కేవలం మీ విద్యా ప్రయాణంలో ఒక చిన్న మలుపు మాత్రమే! ఈ మలుపు దగ్గర ఆగిపోకుండా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడమే అసలైన విజయం.

గుర్తున్నది గుర్తున్నట్లుగా రాయాలంటే? 
చాలామంది విద్యార్థులు రాత్రుళ్లు నిద్ర మానేసి గంటల తరబడి పుస్తకాల ముందు కూర్చుంటారు. కాని, పరీక్ష హాల్లోకి వెళ్ళగానే అంతా ‘బ్లాంక్‌’ అయిపోతుంది. దీనికి కారణం మనం చదివే పద్ధతిలో లోపం ఉండటమే. మన మెదడు ఒక లైబ్రరీ వంటిది. అక్కడ పుస్తకాలు (సమాచారం) పేర్చడమే కాదు, అవసరమైనప్పుడు వాటిని వెతికి పట్టుకోవడం కూడా తెలియాలి. జ్ఞాపకశక్తి దేవుడిచ్చిన వరం కాదు, అది ఒక నైపుణ్యం. 

పైన చెప్పిన మెలకువలు వాడితే సగటు విద్యార్థి కూడా అసాధారణ ఫలితాలను సాధించగలడు. చదవడం అంటే కష్టపడటం కాదు, ‘స్మార్ట్‌’గా మెదడుకు నచ్చినట్లుగా నేర్చుకోవడం. జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా టాపర్స్‌ వాడే టాప్‌ టెక్నిక్స్‌ మీకోసం...  

1. స్పేస్డ్‌ రివిజన్‌
మనం ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకున్న 24 గంటల్లోనే దానిలో దాదాపు 70శాతం మర్చిపోతాం. జర్మన్‌ సైకాలజిస్ట్‌ హెర్మాన్‌ ఎబ్బింగ్హాస్‌ దీన్ని‘ఫర్‌ గెట్టింగ్‌ కర్వ్‌’ అన్నారు. దీనికి పరిష్కారం ఒకే రోజు ఒక విషయాన్ని పదిసార్లు చదవడం కంటే, నిర్ణీత కాలవ్యవధుల్లో దాన్ని రివిజన్‌ చేయాలి. ఈరోజు ఒక టాపిక్‌ చదివితే, దాన్ని రేపు ఒకసారి, వారం తర్వాత ఒకసారి, నెల తర్వాత ఒకసారి రివైజ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల సమాచారం మీ షార్ట్‌ టెర్మ్‌ మెమరీ నుంచి లాంగ్‌ టెర్మ్‌ మెమరీలోకి మారుతుంది. ఇది మీ మెదడులో శాశ్వతంగా నిలిచిపోతుంది.

2. యాక్టివ్‌ రీకాల్‌
చాలామంది విద్యార్థులు చేసే అతిపెద్ద తప్పు ‘పాసివ్‌ రీడింగ్‌’. అంటే పుస్తకం ముందు పెట్టుకుని పదే పదే చదువుతూ వెళ్లడం. ఇది మనకు ‘అన్నీ తెలుసు’ అనే భ్రమను కలిగిస్తుంది. ఒక పేజీ చదివిన తర్వాత పుస్తకాన్ని మూసేయండి. ‘ఇప్పుడే నేను ఏం చదివాను?’ అని మీకు మీరు ప్రశ్నించుకోండి. కళ్లు మూసుకుని ఆ సమాచారాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. సమాచారాన్ని మెదడులోకి పంపడం కంటే, మెదడు నుంచి బయటకు తీయడానికి ప్రయత్నించినప్పుడే న్యూరాన్ల మధ్య సంబంధాలు బలపడతాయి. పరీక్షలో మనం చేసేది ఇదే.. కాబట్టి ఇంట్లోనే ఆ ‘ప్రాక్టీస్‌’ చేయాలి.

3. ఫైన్మాన్‌ టెక్నిక్‌
నోబెల్‌ విజేత రిచర్డ్‌ ఫైన్మాన్‌ అభివృద్ధి చేసిన ఈ టెక్నిక్, ఒక విషయం మీకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి బెస్ట్‌ టూల్‌. మీరు ఒక క్లిష్టమైన టాపిక్‌ నేర్చుకున్నప్పుడు, దాన్ని ఒక పదేళ్ల పిల్లాడికి వివరిస్తున్నట్లుగా ఊహించుకోండి. 

మనం ఇతరులకు వివరించాలి అనుకున్నప్పుడు క్లిష్టమైన పదాలను వాడలేము. సరళమైన ఉదాహరణల కోసం వెతుకుతాము. ఆ క్రమంలో మనకు ఎక్కడైతే వివరించడం రాదో, అక్కడ మనకు ‘సబ్జెక్ట్‌ గ్యాప్‌’ ఉందని అర్థమవుతుంది. ఆ గ్యాప్స్‌ను మళ్ళీ చదివి భర్తీ చేసుకోవాలి. మీకు ఒక విషయం సరళంగా వివరించడం రాకపోతే, మీకు ఆ విషయం సరిగ్గా అర్థం కాలేదని అర్థం.

4. నిమోనిక్స్‌–విజువలైజేషన్‌
మన మెదడుకు అక్షరాల కంటే ‘బొమ్మలు’, ‘కథలు’, ‘రంగులు’ అంటే ఎక్కువ ఇష్టం.
» ఇంద్రధనుస్సులోని రంగులను గుర్తుంచుకోవడానికి ’VIBGYOR’ అనే పదాన్ని వాడతాం. ఇలా కీవర్డ్స్‌తో నిమోనిక్స్‌ తయారు చేసుకోండి.
» మీ ఇంట్లోని గదులను గుర్తు తెచ్చుకుని, ఒక్కో గదిలో ఒక్కో ఇంపార్టెంట్‌ పాయింట్‌ను ‘పెట్టినట్లు’ ఊహించుకోండి (మెమరీ ప్యాలెస్‌) పరీక్షలో ఆ గదిని తలచుకోగానే ఆ పాయింట్‌ గుర్తొస్తుంది.

5. పోమోడోరో టెక్నిక్‌ 
మెదడు ఏకాగ్రత సుమారు 25 నుంచి 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అది అలసిపోతుంది. అందుకే, 25 నిమిషాలు పూర్తి ఏకాగ్రతతో చదవండి. ఆ తర్వాత 5 నిమిషాలు బ్రేక్‌ తీసుకోండి. ఈ బ్రేక్‌లో ఫోన్‌ చూడకూడదు! కేవలం నీళ్లు తాగడం లేదా చిన్నపాటి నడక చేయాలి. 4 సైకిల్స్‌ తర్వాత 15–20 నిమిషాల పెద్ద బ్రేక్‌ తీసుకోండి. ఇది మీ మెదడును మళ్ళీ రీచార్జ్‌ చేస్తుంది.

6.  ‘క్యూ3ఆర్‌’ మెథడ్‌ 
ఇది ఒక టెక్స్‌ట్‌ బుక్‌ చదవడానికి అత్యుత్తమ పద్ధతి.
సర్వే: ముందుగా లెసన్‌ హెడ్డింగ్స్, బొమ్మలు, హైలైట్‌ చేసిన పదాలను చూడండి.
క్వశ్చన్‌: ఆ లెసన్‌ నుండి ఎలాంటి ప్రశ్నలు రావచ్చు? అని ప్రశ్నలు వేసుకోండి.
రీడ్‌: ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ చదవండి.
రిసైట్‌: చదివింది గట్టిగా లేదా మనసులో నెమరువేసుకోండి.
రివ్యూ: చివరగా ఒకసారి అంతా రివైజ్‌ చేయండి.
ఎగ్జామ్‌ డే స్ట్రాటజీ: ఫైనల్‌ టచ్‌

క్రికెట్‌లో బ్యాటర్‌ నెట్స్‌లో ఎంత ప్రాక్టీస్‌ చేసినా, మైదానంలో ఆ బంతిని ఎలా ఎదుర్కొంటాడనేదే ముఖ్యం. అలాగే, మీరు నెలల తరబడి పడ్డ కష్టం, మీ మెదడులో నిక్షిప్తమైన వేల పేజీల సమాచారం  మూడు గంటల ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటాయి. పరీక్ష రోజున మీ మెదడును మీరు ఎలా ‘హ్యాండిల్‌’ చేస్తారనేదే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. దీనిని సైకాలజీలో ‘పెర్ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌’ అంటారు.

పరీక్షకు ముందు రాత్రి: ప్లాన్‌ ‘అ’
చాలామంది విద్యార్థులు పరీక్షకు ముందు రాత్రి ‘అవుట్‌ ఆఫ్‌ సిలబస్‌’లాగా రాత్రంతా మేల్కొని చదువుతుంటారు. ఇది అతిపెద్ద పొరపాటు.
మెదడును చల్లబరచండి: పరీక్షకు ముందు రాత్రి తొమ్మిది గంటలకల్లా పుస్తకాలు మూసేయండి. కొత్త విషయాలు అస్సలు ముట్టుకోవద్దు. ఆ సమయంలో కొత్తవి చదివితే మెదడులో ‘కాగ్నిటివ్‌ ఓవర్‌లోడ్‌’ జరిగి, పాతవి కూడా కన్‌ఫ్యూజ్‌ అయ్యే ప్రమాదం ఉంది.

వస్తువుల సిద్ధం: హాల్‌ టికెట్, పెన్నులు, పెన్సిల్స్‌ అన్నీ ముందురోజే ఒక బ్యాగులో పెట్టుకోండి. ఉదయాన్నే వాటి కోసం వెతుక్కోవడం వల్ల కలిగే ఒత్తిడి మీ జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది.

పరీక్ష రోజు ఉదయం: పాజిటివ్‌ వైబ్రేషన్స్

లైట్‌ ఫుడ్‌: ఖాళీ కడుపుతో వెళ్లొద్దు, అలాగని భారీగా తినొద్దు. పండ్లు లేదా ఇడ్లీ లాంటి తేలికపాటి ఆహారం తీసుకోండి. మెదడుకు శక్తి కావాలి, కాని, అది జీర్ణం కావడానికి ఎక్కువ రక్తం కడుపుకు వెళ్తే, మెదడు మొద్దుబారుతుంది.

ఆందోళన కలిగించే మిత్రులకు దూరం: పరీక్ష సెంటర్‌ దగ్గర ‘ఈ క్వశ్చన్‌ చదివావా? అది చాలా ఇంపార్టెంట్‌ అంట కదా!’ అని భయపెట్టే స్నేహితులతో చర్చలు వద్దు. అది మీలో ‘యాంగ్జయిటీ స్పైక్‌’ కలిగిస్తుంది. మీకు మీరే ‘నేను సిద్ధంగా ఉన్నాను‘ అని చెప్పుకోండి.

పరీక్ష హాలులో: ఆ మూడు గంటల మంత్రం

1. మొదటి 15 నిమిషాలు ‘ది స్కాన్‌’:
ప్రశ్నపత్రం చేతికి రాగానే కంగారు పడకండి. న్యూరోసై¯న్స్ ప్రకారం, ప్రశ్నలు చదువుతున్నప్పుడు మీ మెదడు లోపల సమాచారాన్ని వెతకడం మొదలుపెడుతుంది.పేపర్‌ మొత్తం ఒకసారి స్కాన్‌ చేయండి. మీకు బాగా తెలిసిన సమాధానాలను ముందుగా గుర్తించండి. ఇది మీ మెదడులో ‘డోపమైన్‌’ విడుదల చేసి, భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

2. అమిగ్డలా హైజాక్‌ – బ్రెయిన్‌ ఫ్రీజ్‌ అయితే?:
ఒక్కోసారి కష్టమైన ప్రశ్న చూడగానే మైండ్‌ బ్లాంక్‌ అవుతుంది. దీనిని ‘బ్రెయిన్‌ ఫ్రీజ్‌’ అంటారు.అలా జరిగినప్పుడు, పెన్ను కింద పెట్టి, వెనక్కి ఆనుకుని కూర్చోండి. ఒక 30 సెకన్ల పాటు లోతైన శ్వాస తీసుకోండి. మీ శరీరానికి ఆక్సిజన్‌ అందగానే, భయం వల్ల ఆగిపోయిన మీ ‘ప్రీఫ్రంటల్‌ కార్టెక్స్‌’ (ఆలోచించే భాగం) తిరిగి పనిచేయడం మొదలుపెడుతుంది.

3. ది త్రీ అండ్‌ పాస్‌ మెథడ్‌
ఫస్ట్‌ పాస్‌: అతి సులభమైన, మీకు 100శాతం తెలిసిన సమాధానాలు రాసేయండి.
సెకండ్‌ పాస్‌: కొంచెం ఆలోచిస్తే వచ్చే సమాధానాలపై దృష్టి పెట్టండి.
థర్డ్‌ పాస్‌: చివరగా కష్టమైన, అసలు తెలియని ప్రశ్నలను లాజిక్‌తో రాయడానికి ప్రయత్నించండి.

ప్రజెంటేషన్‌: ది సైకాలజీ ఆఫ్‌ ఇంప్రెషన్‌ 
ఎగ్జామినర్‌ మీ పేపర్‌ దిద్దేటప్పుడు వారి మనసును మీరు గెలవాలి. సమాధానాల మధ్య గ్యాప్‌ వదలండి. ముఖ్యమైన పదాలను అండర్‌లైన్‌ చేయండి. బొమ్మలు, ఫ్లో చార్ట్స్‌ వేయండి. ఎగ్జామినర్‌కు మీ సమాధానం ఎంత సులభంగా అర్థమైతే, వారు అన్ని ఎక్కువ మార్కులు వేసే అవకాశం ఉంటుంది. దీనినే సైకాలజీలో ‘హాలో ఎఫెక్ట్‌’ అంటారు.

సమయ పాలన...
ప్రతి సెక్షన్‌కు ఎంత సమయం కేటాయించాలో ముందే ప్లాన్‌ చేసుకోండి. ఒకే ప్రశ్న దగ్గర ఆగిపోవద్దు. వాచ్‌ చూసుకుంటూ, చివరి 15 నిమిషాలు కేవలం తప్పులు సరిచూసుకోవడానికి కేటాయించండి.

పరీక్ష అయిపోయిన తర్వాత..
ఒక పరీక్ష అయిపోగానే దాని గురించి పోస్ట్‌ మార్టం వద్దు. ‘ఆ ప్రశ్న తప్పు రాశాను’ అని బాధపడటం వల్ల తదుపరి పరీక్షపై ప్రభావం పడుతుంది. ‘గతం గతః’. మీ దృష్టి మరుసటి రోజు జరగబోయే యుద్ధంపైనే ఉండాలి.

మీ లెగసీకి మీరే సృష్టికర్తలు
డియర్‌ స్టూడెంట్స్, 
మీరు కేవలం ఒక రోల్‌ నంబర్‌ కాదు. మీరు ఒక అద్భుతమైన మేధస్సు కలిగిన వ్యక్తులు. పరీక్ష అనేది కేవలం మార్కుల కోసం కాదు, మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం కోసం. ఈ పరీక్షలు మీ క్రమశిక్షణను, మీ పట్టుదలను నిరూపించుకోవడానికి ఒక వేదిక మాత్రమే! నేడు మీరు పడుతున్న కష్టం, రేపు మీరు నిర్మించబోయే సామ్రాజ్యానికి పునాది. కాబట్టి ఆందోళనను వదిలేయండి, ప్లానింగ్‌ను నమ్మండి. మీ మెదడును మీరు సరైన విధంగా డిజైన్‌ చేసుకుంటే, ఏ పరీక్షా మీకు అసాధ్యం కాదు.

2 నిమిషాల్లో ప్రశాంతత!
ఒత్తిడి శత్రువు కాదు, అది మీ శరీరం మిమ్మల్ని సిద్ధం చేస్తున్న తీరు మాత్రమే! దాన్ని భయంగా కాకుండా, ఒక ‘ఎనర్జీ’గా భావించండి! పరీక్ష హాల్లో ప్రశ్నపత్రం చూడగానే మైండ్‌ బ్లాక్‌ అయినా లేదా చదివేటప్పుడు విపరీతమైన ఆందోళన కలిగినా ఈ పద్ధతులను పాటించండి:

బాక్స్‌ బ్రీతింగ్‌
ఇది మన నాడీ వ్యవస్థను వెంటనే శాంతపరుస్తుంది. నాలుగు సెకన్లు నెమ్మదిగా ముక్కుతో గాలి పీల్చుకోండి. నాలుగు సెకన్లు గాలిని లోపలే పట్టి ఉంచండి. 4 సెకన్లు నోటి ద్వారా నెమ్మదిగా గాలిని వదలండి. నాలుగు సెకన్లు గాలి పీల్చకుండా ఖాళీగా ఉండండి. ఇలా 3–4 సార్లు చేస్తే మెదడుకు ఆక్సిజన్‌ అంది, ఆందోళన మాయమవుతుంది.

ఇన్‌స్టంట్‌ మజిల్‌ రిలాక్సేషన్‌
మీ అరచేతులను గట్టిగా ముడిచి, భుజాలను పైకి బిగబట్టండి. ఐదు సెకన్ల పాటు అలాగే ఉంచి, ఒక్కసారిగా వదిలేయండి. మీ ఒంట్లోని నెగటివ్‌ ఎనర్జీ మొత్తం ఆ ఒత్తిడితో పాటే బయటకు పోయినట్లు అనిపిస్తుంది.

గ్రౌండింగ్‌ టెక్నిక్‌ 
మీ ఆలోచనలు భవిష్యత్తు గురించి భయపడుతున్నప్పుడు, మీ మనస్సును ప్రస్తుత క్షణంలోకి తీసుకురావడానికి ఇది బెస్ట్‌ మెథడ్‌. కళ్ళు తెరిచి మీ చుట్టూ ఉన్న ఐదు వస్తువులను చూడండి. నాలుగు వస్తువులను తాకండి. మూడు రకాల శబ్దాలను వినండి. రెండు రకాల వాసనలను పీల్చండి. ఒక మంచి విషయాన్ని తలచుకోండి.

పాజిటివ్‌ అఫర్మేషన్‌
కళ్లు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకుంటూ, మనసులో ‘నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను దీన్ని చేయగలను’ అని మూడుసార్లు చెప్పుకోండి. ఇది మీ సబ్‌–కాన్షియస్‌ మైండ్‌కు ధైర్యాన్ని ఇస్తుంది.

పిల్లల విజయంలో పేరెంట్స్‌దే ప్రధాన పాత్ర!
పరీక్షల సీజన్‌ రాగానే ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. టీవీలు ఆగిపోతాయి, శుభకార్యాలకు వెళ్లడం మానేస్తారు, అంతా ఒక రకమైన ‘కర్ఫ్యూ’ వాతావరణం నెలకొంటుంది. పిల్లల కంటే తల్లిదండ్రులే ఎక్కువ టెన్షన్‌ పడుతుంటారు. తల్లిదండ్రులు సృష్టించే ఈ అతి జాగ్రత్తే పిల్లల్లో తెలియని ఒత్తిడిని పెంచుతుంది. అందుకే పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఒక వార్డెన్‌లా కాకుండా ఒక కోచ్‌లా వ్యవహరించాలి. ఈ కష్ట సమయంలో మీరు వారికి ఇచ్చే మద్దతు, ప్రేమ వారి వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. వారి మీద నమ్మకం ఉంచండి, వారు అద్భుతాలు సృష్టిస్తారు.

పోలిక అనే విషం: చాలామంది తల్లిదండ్రులు చేసే అతిపెద్ద తప్పు – తమ పిల్లలను పక్కింటి పిల్లలతోనో లేదా బంధువుల పిల్లలతోనో పోల్చడం. మీరు పోల్చిన ప్రతిసారీ పిల్లల సెల్ఫ్‌–ఎస్టీమ్‌ దెబ్బతింటుంది. ‘మా నాన్నకు నాకంటే నా మార్కుల మీదనే ప్రేమ ఎక్కువ’ అనే భావన వారిలో కలుగుతుంది. దీనివల్ల వారి మెదడులో అమిగ్డాలా యాక్టివేట్‌ అయ్యి, చదువు మీద ఆసక్తి తగ్గుతుంది.

గుర్తుంచుకోండి, ప్రతి బిడ్డ ఒక ప్రత్యేకమైన ‘జీనియస్‌’. ఒక చేపను చెట్టు ఎక్కలేదని తిడితే అది జీవితాంతం తనను తాను తక్కువ చేసుకుంటుంది. మీ పిల్లల ఎదుగుదలను వారి నిన్నటి పర్ఫార్మెన్స్‌తో మాత్రమే పోల్చండి.

సేఫ్‌ స్పేస్‌: పిల్లలు పరీక్షల గురించి భయపడుతున్నప్పుడు వారికి కావాల్సింది ఉపన్యాసాలు కాదు, ఒక భరోసా. ‘నువ్వు ఎన్ని మార్కులు తెచ్చుకున్నా మేము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం’, ‘పరీక్ష పోతే జీవితం అయిపోదు, మేము నీకు తోడున్నాం’ అనే మాటలు పిల్లల మెదడులో భయాన్ని పోగొట్టి, వారిని మరింత ఏకాగ్రతతో చదివేలా చేస్తాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. తల్లిదండ్రులు టీవీలు, ఫోన్‌లకు దూరంగా ఉండి పిల్లలకు చదువుకునే వాతావరణం కల్పించాలి.

వినడం నేర్చుకోండి: చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడటం అంటే లెక్చర్‌ ఇవ్వడం అనుకుంటారు. పిల్లవాడు ‘నాకు ఈ సబ్జెక్ట్‌ కష్టంగా ఉంది’ అన్నప్పుడు, ‘నువ్వు సరిగ్గా చదవట్లేదు’ అని అనకుండా, ‘అవునా, ఏ పార్ట్‌ కష్టంగా ఉంది? మనం ఎవరినైనా అడుగుదామా?’ అని అడగండి. వారి బాధను మీరు అర్థం చేసుకుంటున్నారని తెలిస్తే, వారి సగం ఒత్తిడి తగ్గిపోతుంది.

ప్రాసెస్‌ మీద దృష్టి పెట్టండి: ‘నీకు 95% రావాలి’ అని టార్గెట్‌లు పెట్టకండి. దానికి బదులుగా ‘ఈరోజు నువ్వు అనుకున్న షెడ్యూల్‌ పూర్తి చేశావా?’ అని అడగండి. ఫలితం మన చేతుల్లో లేదు కాని, ప్రయత్నం మన చేతుల్లో ఉంది. ప్రక్రియ సరిగ్గా ఉంటే ఫలితం దానంతట అదే వస్తుంది.

ఫిజికల్‌ అండ్‌ మెంటల్‌ హెల్త్‌ మద్దతు: పరీక్షల సమయంలో పిల్లల ఆహారం, నిద్ర విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. మెదడు చురుగ్గా ఉండటానికి కావాల్సిన పండ్లు, నట్స్, మరియు తగినంత నీరు అందిస్తూ ఉండాలి. రాత్రంతా మేల్కొని చదవమని ఒత్తిడి చేయకండి. ఏడు గంటల నిద్ర ఉంటేనే వారు పరీక్షలో చదివింది రాయగలరని గుర్తుంచుకోండి.

మెదడుకు శక్తినిచ్చే ఇంధనం! 
మన మెదడు మన శరీర బరువులో కేవలం రెండు శాతంమాత్రమే ఉంటుంది, కాని, మనం తీసుకునే శక్తిలో  20 శాతం మెదడుకే అవసరం. పరీక్షల సమయంలో విద్యార్థులు చేసే అతిపెద్ద తప్పు – చదువు మీద పెట్టిన దృష్టిని శరీరం మీద పెట్టకపోవడం. మీ మెదడు ఒక రేసింగ్‌ కార్‌ అనుకుంటే, దానికి సరైన పెట్రోల్, టైర్ల మెయింటెనెన్స్‌ ఎంత అవసరమో, పరీక్షల సమయంలో విద్యార్థికి ‘బయోలాజికల్‌ సపోర్ట్‌’ కూడా అంతే ముఖ్యం.

నిద్ర: మెమరీ సేవర్‌ 
చాలామంది విద్యార్థులు రాత్రంతా మేల్కొని చదువుతారు. కాని, సైన్స్ ఏం చెబుతుందంటే.. మీరు పగలు చదివిన విషయాలన్నీ నిద్రలోనే మెదడులో స్థిరపడతాయి. మనం నిద్రపోతున్నప్పుడు మెదడులోని హిప్పోకాంపస్‌ సమాచారాన్ని క్రమబద్ధీకరిస్తుంది. నిద్ర తక్కువైతే, మీరు ఎంత చదివినా అది ‘షార్ట్‌ టర్మ్‌ మెమరీ’లోనే ఉండిపోయి, పరీక్ష సమయంలో గుర్తుకు రాదు.పరీక్షల సమయంలో కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. నిద్రకు ముందు ఫోన్‌ చూడటం మానేయాలి, ఎందుకంటే ఆ బ్లూలైట్‌ నిద్రను దూరం చేస్తుంది.

హైడ్రేషన్‌–డైట్‌ 
మెదడులో 75 శాతంనీరు ఉంటుంది. కేవలం రెండు శాతం నీరు తగ్గినా మీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి. ప్రతి గంటకు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల మెదడు అలసిపోకుండా ఉంటుంది.ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉండే బాదం, వాల్‌నట్స్, గుడ్లు, తాజా ఆకుకూరలు మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు, జంక్‌ ఫుడ్‌ తినకండి. ఇవి ‘షుగర్‌ క్రాష్‌’ కలిగించి మిమ్మల్ని నిద్రపోయేలా చేస్తాయి.

వ్యాయామం: మెదడుకు ఆక్సిజన్‌ 
పరీక్షల సమయంలో వ్యాయామం అంటే సమయం వృథా అనుకుంటారు. కాని, అది తప్పు. మీరు ఒక 15–20 నిమిషాలు వేగంగా నడిచినా లేదా వ్యాయామం చేసినా మెదడులో ‘బీడీఎన్‌ఎఫ్‌’ (బ్రెయిన్‌ డిరైవ్డ్‌ న్యూరోపతిక్‌ ఫ్యాక్టర్‌) అనే ప్రోటీన్‌ విడుదలవుతుంది. ఇది మెదడు కణాలను రిపేర్‌ చేసి, కొత్త విషయాలను వేగంగా నేర్చుకునేలా చేస్తుంది. అందుకే చదువు మధ్యలో ‘బ్రేక్‌’ తీసుకున్నప్పుడు ఫోన్‌ చూడకుండా, కాసేపు డాబా మీద నడవండి లేదా చిన్నపాటి స్ట్రెచింగ్‌ చేయండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement