పసిపాపగా మొదలైన నటి సారా అర్జున్ ప్రయాణం, ఇప్పుడు పాన్‌ఇండియా స్టార్‌డమ్ వరకూ చేరింది. ఇంకా ఎన్నో కలలు, ఎన్నో పాత్రలు, ఎన్నో విజయాలు ఆమె కోసం ఎదురుచూస్తున్నాయి. ఆ విషయాలే మీకోసం..
రెండేళ్లు కూడా లేవు!
‘‘ఇంత చిన్న వయసులోనే ఇన్ని సినిమాలు ఎలా చేశావు?’’ అని చాలామంది అడుగుతుంటారు. కాని, కెమెరా ముందు నిలబడినప్పుడు నాకు రెండేళ్లు కూడా లేవు! ఒకరోజు అమ్మానాన్నలతో కలిసి మాల్‌కు వెళ్లినప్పుడు, ఒక ప్రకటన సంస్థ ప్రతినిధి మీ పాప యాడ్‌లో నటిస్తుందా? మా పేరెంట్స్‌ని అడిగారు. అలా పద్దెనిమిది నెలల పసిపాపగా నా ప్రయాణం మొదలైంది. ఐదేళ్లకే వందకు పైగా ప్రకటనల్లో నటించాను.
క్రేజీ మెమరీ!
‘నాన్న’ సినిమా షూటింగ్ సమయంలో నా డైలాగులే కాదు, విక్రమ్ అప్పా డైలాగులు కూడా నాకు కంఠస్థం అయ్యేవి. ఆయన ఎక్కడైనా మర్చిపోతే, నేనే గుర్తు చేసేదాన్ని! ఆ సమయంలో అనుష్క శెట్టితో నాకు ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది. ‘జంక్ ఫుడ్ అస్సలు తినకు, మంచి ఆహారం తీసుకోవాలి’ అని ఆమె ఇచ్చిన సలహా ఇప్పటికీ గుర్తుంది.
గాసిప్స్ మామూలే!
‘ధురంధర్’ సినిమాలో రణవీర్ సింగ్‌తో ఉన్న వయస్సు తేడా గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇక ఇటీవల రాకేష్ బేడీ ఆప్యాయంగా పలకరించడాన్ని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. హీరోయిన్ గా మారిన తర్వాత గాసిప్స్ సహజమే అని చాలా త్వరగా అర్థమైంది.
మిగతావన్నీ తర్వాతే!
ఎన్ని సినిమాలు చేసినా, ఒక్కరోజు కూడా స్కూల్ మిస్ కాలేదు. చిత్రీకరణలన్నీ సెలవుల్లోనే ఉండేలా నాన్న జాగ్రత్తగా ప్లాన్ చేసేవారు. చదువు, సినిమా రెండింటినీ బ్యాలెన్స్ చేయటం మా కుటుంబం ఇచ్చిన పెద్ద బలం.
ప్రశ్నలే నా గురువులు!
‘నాకు కొత్త ప్రదేశాలను చూడటం అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్‌లో ఎంతోమంది రకరకాల మనుషులు పరిచయమవుతుంటారు. ఎవరిని కలిసినా వివిధ ప్రశ్నలు అడుగుతుంటాను. వారి అలవాట్లు, మాట్లాడే తీరు గమనిస్తూ ఉంటాను. ఆ పరిశీలనే నేను చేసే పాత్రలకు ప్రాణం పోయడానికి సహాయపడుతుంది.
ప్రేమ అంతా సినిమాలపైనే!
పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తాను. ‘యుఫోరియా’లో నేను చేసిన పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, భావోద్వేగ భరితమైన, శక్తిమంతమైన పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నాను.
రికార్డుల దిశగా దూసుకెళ్తూ!
ఇటీవల ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎమ్‌డీబీ) విడుదల చేసిన ‘అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సెలబ్రిటీల’ జాబితాలో తొలి స్థానంలో నిలవడం నాకు ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగించింది. దానిని నేను గౌరవంగా భావిస్తున్నాను. ఇది ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమకు నిదర్శనం.
ఇష్టాలు..!
» అభిమాన నటుల్లో హీరో విజయ్ దేవరకొండ అంటే పెద్ద క్రష్! ఆయన ఎనర్జీ అంటే నాకు చాలా ఇష్టం. తమిళంలో సూర్య నా ఫేవరెట్. ఇక హీరోయిన్లలో ఐశ్వర్య రాయ్‌ని చూస్తూ పెరిగాను. ఆమె నా ఆదర్శం.
»ఆహారంలో హైదరాబాద్ బిర్యానీ అంటే పిచ్చి. కాని, ఇప్పుడు ఆరోగ్యం కోసం డైట్ పాటిస్తున్నాను. అలాగే, నా డాగీతో గడిపే సమయం నాకు అత్యంత ప్రియమైనది.


