దిండుతో కళ్లపై ఒత్తిడి!
దిండు లేకుండా నిద్ర పోవడం వల్ల కంటిపై ఒత్తిడి తగ్గి గ్లాకోమా తీవ్రత తగ్గే అవకాశం ఉందని తాజా అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా శాశ్వత అంధత్వానికి దారితీసే కారణాలలో గ్లాకోమా ఒకటి. దీనికి ప్రధాన కారణం కంటిలో ఉండే అధిక ఒత్తిడి దృష్టి నరాన్ని దెబ్బతీయడం.
ఎత్తైన దిండ్లు లేదా ఒకటి కంటే ఎక్కువ దిండ్లను వాడటం వల్ల మెడలోని జుగులార్ వెయిన్‌పై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కంటి ద్రవం సరిగ్గా బయటకు వెళ్లలేక, కంటి లోపల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి దృష్టి నరాన్ని (ఆప్టిక్ నెర్వ్)ప్రభావితం చేస్తుంది. ఇది గ్లాకోమా రావడానికి కారణం అవుతుంది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆప్తమాలజీలో ప్రచురించిన ప్రకారం, ఈ అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు 144 మంది గ్లాకోమా రోగులను పరీక్షించారు. కూర్చున్నప్పుడు, రెండు దిండ్లతో పడుకున్నప్పుడు, దిండు లేకుండా పడుకున్నప్పుడు వారి కంటి లోపల ఉండే ఒత్తిడిని ప్రతి రెండు గంటలకు ఒకసారి 24 గంటల΄ాటు పరిశీలించారు. దిండ్లతో తల ఎత్తుగా పెట్టి పడుకున్నప్పుడు, దాదాపు మూడింట రెండు వంతుల మంది రోగులలో కంటిలో ఒత్తిడి పెరిగినట్లు వారు గమనించారు. యువకులు, ప్రైమరీ ఓపెన్–యాంగిల్ గ్లాకోమా ఉన్నవారిపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధకులు తెలిపారు.
ఈ ఫలితాలు ప్రాథమికమైనవే అయినప్పటికీ, గ్లాకోమా ఉన్నవారు తాము నిద్రించే విధానంలో జాగ్రత్త వహించడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.


