గత ఆర్థిక సంవత్సరం ఊపిరితిత్తుల కేన్సర్‌కి సంబంధించి ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు రెట్టింపయ్యాయి, చికిత్స వ్యయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా గుర్తించడం, నివారించడం, ఆర్థికంగా సన్నద్ధంగా ఉండటానికి సంబంధించి తెలుసుకోవాల్సిన విషయాల గురించి సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశవ్యాప్తంగా ఊపిరితిత్తుల కేన్సర్ ప్రజలపై చూపుతున్న ప్రభావం గురించి టాటా ఏఐజీకి వచ్చిన క్లెయిమ్స్ గణాంకాల్లో కీలకాంశాలు వెల్లడయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఊపిరితిత్తుల కేన్సర్ సంబంధిత బీమా క్లెయిమ్‌ల సంఖ్య, అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే రెట్టింపయ్యింది. దీనితో పాటు ఆసుపత్రిలో చికిత్స వ్యయాలు 27 శాతం మేర పెరిగాయి. చికిత్స మరింత ఖరీదైనదిగా మారడాన్ని, కేన్సర్ బాధితుల కుటుంబాలకు ఆర్థికంగా పెనుభారం అవుతున్న విషయాన్ని ఇది తెలియజేస్తోంది.
“ఊపిరితిత్తుల కేన్సర్ అనేది ప్రస్తుతం అరుదైన ముప్పుగా ఉండటం లేదు. వైద్యంపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇండివిడ్యువల్ క్లెయిమ్‌లు లక్షల స్థాయిలో, కొన్ని సందర్భాల్లో రూ. 50 లక్షలకు పైగా కూడా వస్తుండటాన్ని మేము చూస్తున్నాం. స్టాండర్డ్‌గా ఉండే రూ. 5 లక్షలో లేదా రూ. 10 లక్షల పాలసీల్లాంటివి, కుటుంబాలకు ఎంతో అవసరమైన సందర్భాల్లో సరిపోని పరిస్థితి నెలకొనవచ్చు.
బీమా ఉంటే సరిపోదు. వైద్యానికి సంబంధించి నేటి వాస్తవిక పరిస్థితులను ప్రతిబింబించే విధంగా సరైన కవరేజీ ఉండాలి. ఎలాంటి ముందస్తు హెచ్చరికా లేకుండా దాడి చేసే ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కొనేలా ఆర్థికంగా సర్వసన్నద్ధంగా ఉండే క్రమంలో బీమాను పునఃమదింపు చేసుకునేందుకు, అప్‌గ్రేడ్ అయ్యేందుకు ఇది సరైన సమయం” అని టాటా ఏఐజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & నేషనల్ హెడ్ – కన్జూమర్ క్లెయిమ్స్ రుద్రరాజు రాజగోపాల్ తెలిపారు.
వచ్చిన వాటిలో 64 శాతం క్లెయిమ్‌లు 50 ఏళ్ల పైబడిన వారికి చెందినవని డేటాలో వెల్లడైంది. ఈ వ్యాధి, పెద్దవారిలోనే ఎక్కువగా ఉంటోందనే విషయాన్ని ఇది తెలియజేస్తోంది. మరింత సంక్లిష్టమైన కేసుల్లో సగటు క్లెయిమ్ పే అవుట్ రూ. 3 లక్షలు పైగా ఉండగా, అత్యధిక ఇండివిడ్యువల్ క్లెయిమ్ ఏకంగా రూ. 58 లక్షలుగా నమోదైంది. గత మూడేళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలకు చెల్లించిన మొత్తం రెట్టింపు స్థాయికి మించింది. మహారాష్ట్ర (23.9%), గుజరాత్ (17%), ఢిల్లీ (12.3%) నుంచి క్లెయిమ్‌లు అత్యధికంగా వచ్చాయి. బహుశా ఆయా రాష్ట్రాల్లో వాయు కాలుష్యం అత్యధికంగా ఉండటం, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలు, డయాగ్నోస్టిక్స్ ఉండటం ఇందుకు కారణం అయి ఉండొచ్చు.
ఊపిరితిత్తుల క్యాన్సర్ కారకాలకు సంబంధించి అత్యధికంగా దాదాపు 85 శాతం కేసుల్లో స్మోకింగ్ ప్రధానమైనదిగా ఉంటున్నప్పటికీ, అదొక్కటే కారణం కాదు. వాయు కాలుష్యానికి, సెకండ్-హ్యాండ్ స్మోక్‌కి, నిర్దిష్ట పనిప్రదేశాల్లో రసాయనాలకి ఎక్స్‌పోజ్ కావడం వల్ల కూడా రిస్కులు పెరుగుతాయి. నగరాల్లో జీవించే వారు, దుమ్మూ ధూళితో కూడుకున్న ప్రదేశాల్లో పని చేసేవారు లేదా స్మోక్ చేసే కుటుంబ సభ్యులు ఉన్న వారు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ చరిత్ర, సరైన ఆహార అలవాట్లు లేకపోవడం, కదలకుండా ఒకే చోట కూర్చుని ఉండే జీవన విధానాలు కూడా ఇందుకు దారి తీయొచ్చు.
అందుకే హెచ్చరిక సంకేతాలను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. మీ వయస్సు 40 పైగా ఉండి, స్మోకింగ్ అలవాటు ఉన్నా లేదా గతంలో స్మోక్ చేసినా, లేదా కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతంలో నివసిస్తున్నా, ఈ కింది లక్షణాలు కనిపిస్తే డాక్టరును సంప్రదించడం శ్రేయస్కరం:
దగ్గు ఆగకుండా రావడం, తీవ్రత పెరగడం
చాతీలో నొప్పి లేదా అసౌకర్యం
దగ్గినప్పుడు రక్తం రావడం
చిన్న పని చేసినా ఊపిరి తీసుకోవడం కష్టం కావడం
కారణం లేకుండా అలసిపోవడం లేదా బరువు తగ్గిపోవడం
తరచుగా లేదా పదే పదే ఛాతీ సంబంధ అంటువ్యాధులు వస్తుండటం
రిస్కు ఎక్కువగా ఉండే వారికి ఏటా తక్కువ డోస్‌లో సీటీ స్కాన్‌ల్లాంటి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. వ్యాధిని ముందుగానే గుర్తించేందుకు, మెరుగైన చికిత్స ఫలితాలు సాధించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అన్ని రకాల కేసులను నివారించలేకపోయినప్పటికీ, ఆరోగ్యకరమైన అలవాట్లు, రిస్కులను కొంత తగ్గించగలవు. స్మోకింగ్ మానివేయడం, కాలుష్యం ఉండే ప్రాంతాలకు ఎక్స్‌పోజర్‌ని తగ్గించుకోవడం, సమతుల్యమైన డైట్ తీసుకోవడం, శారీరకంగా యాక్టివ్‌గా ఉండటం, తరచుగా హెల్త్ చెకప్‌లు చేయించుకోవడంలాంటి పనులు చిన్నవే అయిననప్పటికీ సమర్ధవంతంగా ఉపయోగపడతాయి.
(చదవండి: లంగ్ కేన్సర్‌ని ముందుగా గుర్తించగలమా..?)


