పిల్లలు లేని దంపతుల మనోవేదనను కొన్ని ఆసుపత్రులు, కొందరు వ్యక్తులు వారికి ఆసరాగా మలుచుకుంటున్నారు. ఇందు కోసం అందమైన అమ్మాయిలను ట్రాప్ చేసి వారి అండాలను అమ్ముకుంటూ అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో యువతులు అనారోగ్యం బారినపడి వారి జీవితాన్నే నాశనం చేసుకుంటున్నారు. అద్దె గర్భాలు, అండాల కొనుగోలు కోసం కొన్ని ముఠాలు మన దేశం, తెలుగు రాష్ట్రాల్లో దందాలు నడుపుతున్నాయి. ఇందుకు సంబంధించిన కొన్ని నివేదికలు బయటకు వచ్చాయి.
పిల్లలు పుట్టకపోతే చాలా మంది దంపతులు సంతాన సాఫల్య కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. దీంతో ఈ కేంద్రాలకు బిడ్డల కోసం వచ్చే దంపతుల సంఖ్య భారీగా ఉంటోంది. ఇందుకు ఆడవారిలో అండాల ఉత్పత్తి కాకపోవడం ప్రధాన సమస్యలని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి దంపతుల బలహీనతలను ఆసరా చేసుకుంటున్న కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు, కొన్ని క్లినిక్‌లు ఫర్టిలిటీని వ్యాపారంగా మలచుకుంటున్నాయి. సంతాన సాఫల్య కేంద్రాలు.. మహిళలు, యువతుల అండాలను సేకరించి చాటుమాటుగా వ్యాపారం చేస్తున్నాయి. వారి నుంచి అండాలు సేకరించి.. వాటి సాయంతో దంపతులకు సంతానం కలిగేలా చేసి, సొమ్ము చేసుకుంటున్నాయి.
అందమైన యువతులే టార్గెట్..
చాలా మంది మహిళలు, యువతులు తమ ఆర్థిక అవసరాల కోసం అండాలు దానం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇందుకోసం సంతాన సాఫల్య కేంద్రాలు ఏజెంట్లను నియమించుకుంటాయి. తెలుపు రంగు, మంచి అందం, ఆకర్షణీయమైన శరీరం, అందమైన కళ్లు, ఎత్తు ఉండే యువతులను అండ దానానికి ఎంచుకుంటున్నారు. పేదరికంలో ఉండే యువతులకు గాలం వేసి.. తమ పని చేసుకుపోతున్నారు. అండాలు దానం చేసినందుకు గాను దాదాపు 20,000-50,000 వరకు వారికి ఇస్తున్నారు.
అయితే, ఫర్టిలిటీ కేంద్రాల నిర్వాహకులు వీరి నుంచి ఎక్కువ అండాలు ఉత్పత్తి అయ్యేలా హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తుంటారు. ఇలా హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల ఒకటి కంటే ఎక్కువ అండాలు విడుదలవుతాయి. క్లోమిఫెన్ ఇంజెక్షన్లు దాత శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావాన్ని అడ్డుకుంటుంది. దీని వలన మరో రెండు హార్మోన్లు పెరుగుతాయి. ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (FSH), లూటినైజింగ్ హార్మోన్ (LH)లు వస్తాయి. FSH అండాశయాలలో గుడ్లు పక్వానికి వచ్చి విడుదలకు సిద్ధంగా ఉండేలా చేస్తుంది. తరువాత LH అండాశయ ఫోలికల్స్ నుండి ఒకటి కంటే ఎక్కువ పరిణతి చెందిన గుడ్లను విడుదల చేయడానికి ప్రేరేపిస్తుంది. గోనాడోట్రో-ఫిన్స్, బ్రోమోక్రిప్టిన్ వంటి మందులు ఒకే ఫలితం కోసం ఉపయోగించబడతాయి. ఇలా ఇంజెక్షన్లు తీసుకోవడం వల్ల అండ దాతలు భవిష్యత్‌లో సంతానానికి దూరం అయ్యే ప్రమాదాలుంటాయని గైనకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హార్మోన్ ఇంజెక్షన్లను అతిగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలతో హైపర్ సిమ్యులేషన్ సిండ్రోమ్, ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు.
బాధితుల పరిస్థితి ఇది..
తాజాగా కొన్ని నివేదికల ప్రకారం.. భారత్‌లో అండం అమ్మకాలను నియంత్రించడానికి 2021లో కొన్ని కఠినమైన చట్టాలను తీసుకువచ్చారు. వాటిని ఆమోదించినప్పటికీ బ్లాక్ మార్కెట్ దందా మాత్రం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా మహిళలు తమ మనుగడ కోసం చట్టవిరుద్ధంగా అండాలను అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలోనే ముంబై చెందిన ఓ మహిళ ఐదు సంవత్సరాలలో కనీసం 30 సార్లు తన అండాలను విక్రయించినట్టు తెలిసింది. దీంతో, ఆమెకు అనారోగ్యానికి గురైంది. భవిష్యత్‌లో ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు నిర్ధారించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. సెల్ ఫోన్ కోసం ఓ 13 ఏళ్ల బాలిక తన అండాన్ని అమ్మడానికి సిద్దమైంది. ఇలాంటి బాధితులు వేలల్లో ఉన్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చీకటి దందా కొనసాగుతోంది. ఏజెంట్ల ఆకర్షితులవుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలకు వెళ్లే బాలికలు ఆరోగ్యపరమైన చిక్కులను గ్రహించకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంతానోత్పత్తి కేంద్రాలకు అండాలను దానం చేస్తున్నారు. గతంలో నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్‌లోని గిరిజన ప్రాంతాల నుండి విద్యార్థులు ఈ ఏజెంట్ల ఉచ్చులలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కూడా ఈ దందా నడుస్తోంది.
లక్షల రూపాయల్లో ఫీజు
సంతానం లేని దంపతులకు పిల్లలు కలిగించే పూచీ మాది అని చెప్పుకొనే సాఫల్య కేంద్రాలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుంటాయనే ఆరోపణలున్నాయి. మరికొన్ని కేంద్రాలైతే.. లక్షలు వసూలు చేసి, చేతులెత్తేస్తుంటాయి. ఇంకొన్ని ఏకంగా అనైతిక వ్యాపారానికి పాల్పడుతుంటాయి. సంతానం సాఫల్య కేంద్రాలు తప్పనిసరిగా వైద్య ఆరోగ్య శాఖ వద్ద రిజిస్ట్రర్ చేసుకుని ఉండాలి. నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలి. మార్గదర్శకాలకు లోబడి వ్యవహరించాలి. కానీ, క్షేత్రస్థాయిలో చాలా కేంద్రాలు ఈ నియమాలను తుంగలో తొక్కుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు కూడా ఈ వ్యవహారాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు.


