బెంగాల్‌ చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ సహా ఉన్నతాధికారులపై వేటు | EC sacks top bureaucrats and senior cops in poll-bound Bengal | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ సహా ఉన్నతాధికారులపై వేటు

Mar 17 2026 5:10 AM | Updated on Mar 17 2026 5:10 AM

EC sacks top bureaucrats and senior cops in poll-bound Bengal

అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ అనూహ్య నిర్ణయం 

కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్‌(ఈసీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఉన్నత స్థాయి అధికార, పోలీసు యంత్రాంగాన్ని బాధ్యతల నుంచి తొలగించింది. ఆదివారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ, కొద్ది గంటల్లోనే ఈ మేరకు సమూల ప్రక్షాళన చర్యలను చేపట్టడం గమనార్హం. ఆదివారం సాయంత్రం వెలువరించిన మొదటి ఉత్తర్వులతో రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ నందినీ చక్రవర్తి, హోం శాఖ కార్యదర్శి జగదీశ్‌ ప్రసాద్‌ మీనాలపై వేటు వేసింది.

అనంతరం, 16వ తేదీతో వెలువరించిన మరో ఆదేశంలో రాష్ట్ర డీజీపీ పియూశ్‌ పాండే, కోల్‌కతా సీపీ సుప్రతీమ్‌ సర్కార్‌ తదితర నలుగురు ఉన్నతస్థాయి ఐపీఎస్‌లను తొలగిస్తున్నట్లు తెలిపింది. నందినీ చక్రవర్తి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1993 బ్యాచ్‌ సీనియర్‌ ఐఏఎస్‌ దుష్యంత్‌ నరియాలాను నియమిస్తున్నట్లు ప్రకటించింది. దుష్యంత్‌ ప్రస్తుతం ఉత్తర బెంగాల్‌ అభివృద్ధి శాఖ అదనపు చీఫ్‌ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.

అదేవిధంగా, జగదీశ్‌ ప్రసాద్‌ మీనా స్థానంలో హోంశాఖ కార్యదర్శిగా సంఘమిత్రా ఘోష్‌కు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపింది. డీజీపీగా 1992 బ్యాచ్‌ అధికారి సిద్‌్ధనాథ్‌ గుప్తాను నియమించింది. అజయ్‌ కుమార్‌ నంద్‌ను కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌గా నియమిస్తున్నట్లు ఈసీ తెలిపింది. శాంతి భద్రతల ఏడీజీ వినీత్‌ గోయల్‌ స్థానంలో అజయ్‌ ముకుంద్‌ పాండేను, సిద్‌్ధనాథ్‌ గుప్తా స్థానంలో డీజీగా నటరాజన్‌ రమేశ్‌ బాబును నియమించింది.

ఈసీ బెంగాల్‌ వ్యతిరేకి: సీఎం మమత 
ఎన్నికల వేళ ఉన్నతాధికారులను బాధ్యతల నుంచి తొలగించడంపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈసీ, బీజేపీలు మహిళలకు, బెంగాల్‌కు వ్యతిరేకులన్న విషయం మరోసారి రుజువైందన్నారు. ఎల్పీజీ సంక్షోభంపై కోల్‌కతాలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బీజేపీ ఎందరు అధికారులను మార్చినా తమ ప్రభుత్వాన్ని మాత్రం మార్చలేదని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement