హార్మూజ్‌ను దాటుకుని వస్తున్న భారత నౌక | Representative of Irans Supreme Leader on Indian ships | Sakshi
Sakshi News home page

హార్మూజ్‌ను దాటుకుని వస్తున్న భారత నౌక

May 3 2026 1:50 AM | Updated on May 3 2026 1:50 AM

Representative of Irans Supreme Leader on Indian ships

బెంగళూరు: హార్మూజ్ జలసంధి వద్ద ఇతర దేశాల నౌకలకు అనుమతి నిరాకరిస్తూ భారత నౌకలకు మాత్రం అనుమతి ఇచ్చామని ఇండియాలోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ అన్నారు. దీనిబట్టే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో తెలుస్తోందని తెలిపారు.  

మార్షల్ ఐలాండ్స్ జెండా ఉన్న ఎల్‌పీజీ క్యారియర్ ఎంఠీ సర్వ్ శక్తి భారత సరుకు తీసుకుని మే 2న హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. మే 13న విశాఖపట్నానికి చేరే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 46,313 మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ తీసుకెళ్తున్న ఈ నౌకలో 20 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 18 మంది భారతీయులు ఉన్నారు. 
 
బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇలాహీ మాట్లాడుతూ.. భారత్-ఇరాన్ మధ్య శతాబ్దాల చరిత్ర, సంస్కృతి ఆధారంగా బంధం నిలిచిందని తెలిపారు. వివిధ రంగాల్లో దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. “భారత్ ఒక గొప్ప దేశం. మేము భారత ప్రజలను గౌరవిస్తాము. మాకు ఇరాన్‌తో 5,000 సంవత్సరాల సంబంధం, స్నేహం ఉంది. విద్య, తత్వశాస్త్రం, సంస్కృతి, నాగరికత, ఆర్థిక రంగాల ద్వారా ఇరాన్ భారత్‌తో అనుసంధానమై ఉంది. ఇరానీయులు భారతీయులను చాలా ఇష్టపడతారు. మన సంస్కృతి కూడా ఒకటే. మన ప్రవర్తన ఒకటే. మన ముఖాలు, ఆకృతులు కూడా ఒకటే” అని అన్నారు.

“భారత్-ఇరాన్ మధ్య సంబంధం, స్నేహం చాలా బలంగా, లోతుగా ఉంది. ప్రస్తుతం భారత్‌తో మా సంబంధం, సహకారం చాలా బాగుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌తో మూడుసార్లు చర్చించారు. భారత్ విదేశాంగ మంత్రి కూడా ఇరాన్ విదేశాంగ మంత్రితో అనేక సార్లు చర్చలు జరిపారు. అనేక దేశాలకు అనుమతి లభించని సమయంలో ఇరాన్ భారత నౌకలు హార్మూజ్ జలసంధిని దాటేందుకు అనుమతించింది” అని ఆయన తెలిపారు.

గత శతాబ్దాల్లో అనేకమంది ఇరానీయులు భారత్‌లో స్థిరపడ్డారని, ఇది సామాజిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలపరిచిందని చెప్పారు. భవిష్యత్ సంబంధాలపై ఆశాభావం వ్యక్తం చేస్తూ.. సత్సంబంధాలు మరింత బలపడతాయని అన్నారు. ఇరాన్ నాయకత్వం భారత్‌తో సన్నిహిత సంబంధాలను ప్రోత్సహించిందని, ద్వైపాక్షిక సహకారంలో అడ్డంకులను తొలగించేందుకు మద్దతు ఇచ్చిందని తెలిపారు.

ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ.. దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ గతంలో పలుసార్లు భారత్‌తో బలమైన సంబంధాలను ప్రోత్సహించారని, అడ్డంకులు ఉండకూడదని అన్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సుప్రీం లీడర్ అయతొల్లా సయ్యద్ మొజ్తబా ఖమేనీ కూడా భారత్‌ను ఇష్టపడతారని, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, స్నేహపూర్వక సంబంధాలను మరింత బలపరచాలని భావిస్తున్నారని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement