సువర్ణ రేఖలు! | Five daughters of Suvarna struggle life story | Sakshi
Sakshi News home page

సువర్ణ రేఖలు!

Mar 1 2026 5:34 AM | Updated on Mar 1 2026 5:34 AM

Five daughters of Suvarna struggle life story

మహిళా దినోత్సవం

సామాన్యుల్లా కనిపిస్తారు గాని అసామాన్య స్త్రీలు వారు. రాక్షస సంహారం చేయరు గాని జీవితంలో ఎదురైన  సమస్యల పెను భూతాన్ని తుదముట్టిస్తారు. ఎనిమిది చేతులుండవు గాని ఇంటి పని, పిల్లల పని, చిన్న ఉద్యోగం, అతి చిన్న ఉపాధి... అవలీలగా చేసి బతుకును నిలబెట్టుకుంటారు. గుంపులో ఒకరుగా కనిపిస్తారుగాని వారి పోరాట బలానికి ఎదురు నిలవాలంటే ఒక దేశ సైన్యం సరిపోదు.

ఎల్లమ్మ, మల్లమ్మ, లక్ష్మి, సుజాత, మేరి, మస్తానమ్మ... మామూలు పేర్లుగా కనిపిస్తాయి గాని వీరంతా పిడుగుల దారుల్లో వడగండ్ల దాడుల్లో సాగుతున్న తెగువ చిరునామాలు. ఎవ్వరి తోడు లేకపోయినా వీరు ముందుకు నడుస్తారు. ఓడించాలని చూసే కొద్దీ గెలుస్తూ ఉంటారు. కష్టాలను లెక్క చేయరు. బాధల్లో కూడా నవ్వడం మానరు. మన ఇరుగూ పొరుగే ఉంటారు. కాని ఝాన్సీ లక్ష్మీబాయిని మించి ఉంటారు. కామన్  విమెన్  అన్ కామన్  జీవన పోరాటాలను తెలుసుకుందాం రండి.

బిడ్డలకు ప్రోత్సాహమిస్తే చక్కగా ఎదుగుతారనే నమ్మకమే ఆమె బలం.. బలగం. చదువు, ఉద్యోగం, సొంత ఇల్లు, కుటుంబ అండ ఏమీ లేకున్నా... ఒంటరిగా ఐదుగురు కూతుళ్లను పోషిస్తూ, వారిని చేతనైనంతగా చదివిస్తోంది హైదరాబాద్‌ లాలాగూడలో ఉంటున్న సువర్ణ. భర్త మద్యానికి బానిసై ఎప్పుడో చనిపోయాడు. ఆదుకునే వారెవరూ లేకున్నా... పాచిపనిచేస్తూ, రెక్కల కష్టంతో సంసారాన్ని లాక్కొస్తోంది. కొండంత ఆత్మవిశ్వాసంతో జీవన పోరాటం చేస్తున్న సువర్ణను పలకరిస్తే.. ‘ మంచిగ సదువుకుంటేనే పిల్లలకు మంచి భవిష్యత్తు. అందుకే, ఎంత కష్టమైనా భరిస్తనమ్మ’ అని చెప్పింది... 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ సువర్ణ పాఠాలకు శ్రీకారం.

‘‘నా అసలు పేరు సుహాసిని. పెళ్లయ్యాక సువర్ణ అని మార్చారు. ఇంకో రెండేళ్లు దాటితే నలభై ఏళ్లు వస్తాయి. మా చుట్టుపక్కల వాళ్లు ‘పిల్లల్ని కూడా పనిలో పెట్టరాదూ... ఎందుకంత కష్టపడతావు’ అని చెబుతుంటారు. కానీ, నాలాగా ఇళ్లలో పనులు చేసుకుంటే ఈ రోజు రూపాయి సంపాదించుకుంటారేమో... కానీ, చదువుకుంటే రేపు పది రూపాయలు సంపాదించుకుంటరు. అంతేకాదు, బయట ఎట్ల బతకాలో తెలుసుకుంటరు. మంచిగ బతుకతరు. అందుకే ‘కష్టమైనా పర్లేదు, నేనే ఇంకో నాలుగిండ్లలో పనిచేసి, బిడ్డల్ని చదివిస్తా’ అని చెబుతుంటా. ఐదుగురు కూతుళ్లలో పెద్దమ్మాయి పెండ్లి చేసిన. మిగతా నలుగురిలో ఇద్దరు ఇంటర్మీడియెట్, మరో ఇద్దరు స్కూల్లో చదువుకుంటున్నరు.

ఎవరి అండా లేదు...
నా చిన్నప్పుడే అమ్మానాయినలు చనిపోయారు. మా తాతనే నన్ను, మా చెల్లెల్ని సాదిండు. మా ఊరు తెలంగాణలోని గజ్వేల దగ్గర ధవలాపురం. అమ్మనాన్నలు లేరని హాస్టల్‌లో పెడితే ఐదవ తరగతి వరకు చదువుకున్నాం. ఆ తర్వాత మళ్లా తాత దగ్గరకు వచ్చేసినం. అప్పటినుంచి ఊళ్లనే. తాత ఏదో చేతనైన పని ఏదో చేసేవాడు. పదిహేనేళ్ల వయసులో మా ఊరి అబ్బాయితోనే పెళ్లయ్యింది. హైదరాబాద్‌కు వచ్చి, ఓ రూమ్‌ అద్దెకు తీసుకుని బతుకుతుండేవాళ్లం. కూతురు పుట్టిన రెండేళ్లకు అత్తింటివాళ్లతో గొడవలయ్యాయి. అవి పెద్దగై విడిపోవాల్సి వచ్చింది. ఎట్ల బతకాలో అర్థం కాలేదు. ఇళ్లలో పనికి కుదిరా. నా భర్త మరో పెళ్లి చేసుకున్నాడని తెలిసి, బాధతో కిరోసిన్‌ పోసుకుని, నిప్పు పెట్టుకున్న. గాంధీ ఆసుపత్రిలో నెల రోజుల పాటు చికిత్స కోసం ఉన్నా. బిడ్డ మొఖం చూసి, బతకాలని నిర్ణయించుకున్న. తిరిగి ఇళ్లలో పనిచేసుకుంటూ, బిడ్డను సాదుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటే మంచిదని, మా కాలనీ వాళ్లే చెప్పడంతో మా దోస్త్‌ బంధువుతో రెండో పెళ్లి చేసుకున్న. మొదట జీవితం సాఫీగానే సాగిపోయింది. కానీ తర్వాత కొట్టడం, హింసించడం చేసేవాడు. తాగీతాగీ చనిపోయాడు.

కష్టాలే మార్చాయి...
పెద్ద బిడ్డ గర్భవతిగా ఉందని తెలిసి, డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లా. ‘గుండెకు రంధ్రం ఉంది, పిల్లలు పుడితే ఆమె బతకదు’ అన్నారు. చూస్తూ చూస్తూ బిడ్డను అలా వదిలేయలేక, గుండె ఆపరేషన్‌ చేయించిన. ఉండటానికి సొంత ఇల్లు లేదు. ఆఫీసుల చుట్టూ తిరగగా తిరగగా మొన్నటి నెలనే రేషన్‌ కార్డు వచ్చింది. వితంతు పింఛను లేదు. ఏ ఆస్తులూ లేవు. కానీ, పిల్లలు నా కష్టాన్ని అర్ధం చేసుకున్నరు. మంచిగ చదువుకుంటున్నరు. నా పిల్లలకు నేను అండ. పిల్లలు నాకు ఆసర అవుతున్నరు.  
    
రెక్కల కష్టమ్మీదనే బిడ్డలను సాకుతున్నాను అని, తెలిసినవాళ్లు ‘ఎన్నాళ్లు ఇట్లా కష్టపడతావు..’ అంటుంటారు. నా చిన్నప్పుడు అలాగే హాస్టల్‌లో ఉండి చదువుకునుంటే, ఏదైనా ఉద్యోగం చేసుకుని బతికేదాన్ని. కానీ, అప్పడు అమ్మనాన్నలేక, పరిస్థితులు బాగోలేక చదువుకోలేకపోయిన. నాలాగా నా పిల్లలు పనిమనుషులు కావద్దు. వాళ్ల జీవితాలు బాగుపడితే నా అన్ని కష్టాలూ చిన్నవే అయిపోతాయి’’ అని వివరించింది సువర్ణ కూతుళ్లను దగ్గరకు తీసుకుంటూ. అచంచలమైన ఆమె ఆత్మవిశ్వాసానికి  చేతులెత్తి మొక్కాలనిపించింది. 
 

సారా ముంచింది...
పిల్లలంతా ఏడాది, రెండేళ్ల తేడాతో పుట్టారు. కొడుకు కావాలని, ఆపరేషన్‌ చేయించుకోవద్దని బెదిరింపులు, చేయిచేసుకోవడం... సారాకు అలవాటు పడిన ఆయన పైసా సంపాదించకపోగా నా దగ్గరే పైసలు తీసుకునెటోడు. రోజంతా తాగుతూ పిల్లలను కూడ చూసుకునేవాడు కాదు. తాత చూస్తే బాగా ముసలాయన అయిపోయాడు. అప్పటికే చెల్లెలు పెళ్లయి వెళ్లిపోయింది. అయినా పిల్లలను తాత దగ్గరే వదిలేసి, పనికి పోయేదాన్ని. మా చిన్న బిడ్డ ఐదో ఏటన మా ఆయన చనిపోయాడు. ఇప్పటికి ఎనిమిదేళ్లు అయ్యాయి. ఆ తర్వాత తాత కూడా చనిపోయాడు. పిల్లలను స్కూల్‌లో వేసి, ఇళ్లలో పనిచేస్తూ ఇన్నేళ్లుగా గడుపుతున్నాను.

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement