breaking news
struggle succes
-
సువర్ణ రేఖలు!
సామాన్యుల్లా కనిపిస్తారు గాని అసామాన్య స్త్రీలు వారు. రాక్షస సంహారం చేయరు గాని జీవితంలో ఎదురైన సమస్యల పెను భూతాన్ని తుదముట్టిస్తారు. ఎనిమిది చేతులుండవు గాని ఇంటి పని, పిల్లల పని, చిన్న ఉద్యోగం, అతి చిన్న ఉపాధి... అవలీలగా చేసి బతుకును నిలబెట్టుకుంటారు. గుంపులో ఒకరుగా కనిపిస్తారుగాని వారి పోరాట బలానికి ఎదురు నిలవాలంటే ఒక దేశ సైన్యం సరిపోదు.ఎల్లమ్మ, మల్లమ్మ, లక్ష్మి, సుజాత, మేరి, మస్తానమ్మ... మామూలు పేర్లుగా కనిపిస్తాయి గాని వీరంతా పిడుగుల దారుల్లో వడగండ్ల దాడుల్లో సాగుతున్న తెగువ చిరునామాలు. ఎవ్వరి తోడు లేకపోయినా వీరు ముందుకు నడుస్తారు. ఓడించాలని చూసే కొద్దీ గెలుస్తూ ఉంటారు. కష్టాలను లెక్క చేయరు. బాధల్లో కూడా నవ్వడం మానరు. మన ఇరుగూ పొరుగే ఉంటారు. కాని ఝాన్సీ లక్ష్మీబాయిని మించి ఉంటారు. కామన్ విమెన్ అన్ కామన్ జీవన పోరాటాలను తెలుసుకుందాం రండి.బిడ్డలకు ప్రోత్సాహమిస్తే చక్కగా ఎదుగుతారనే నమ్మకమే ఆమె బలం.. బలగం. చదువు, ఉద్యోగం, సొంత ఇల్లు, కుటుంబ అండ ఏమీ లేకున్నా... ఒంటరిగా ఐదుగురు కూతుళ్లను పోషిస్తూ, వారిని చేతనైనంతగా చదివిస్తోంది హైదరాబాద్ లాలాగూడలో ఉంటున్న సువర్ణ. భర్త మద్యానికి బానిసై ఎప్పుడో చనిపోయాడు. ఆదుకునే వారెవరూ లేకున్నా... పాచిపనిచేస్తూ, రెక్కల కష్టంతో సంసారాన్ని లాక్కొస్తోంది. కొండంత ఆత్మవిశ్వాసంతో జీవన పోరాటం చేస్తున్న సువర్ణను పలకరిస్తే.. ‘ మంచిగ సదువుకుంటేనే పిల్లలకు మంచి భవిష్యత్తు. అందుకే, ఎంత కష్టమైనా భరిస్తనమ్మ’ అని చెప్పింది... 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ సువర్ణ పాఠాలకు శ్రీకారం.‘‘నా అసలు పేరు సుహాసిని. పెళ్లయ్యాక సువర్ణ అని మార్చారు. ఇంకో రెండేళ్లు దాటితే నలభై ఏళ్లు వస్తాయి. మా చుట్టుపక్కల వాళ్లు ‘పిల్లల్ని కూడా పనిలో పెట్టరాదూ... ఎందుకంత కష్టపడతావు’ అని చెబుతుంటారు. కానీ, నాలాగా ఇళ్లలో పనులు చేసుకుంటే ఈ రోజు రూపాయి సంపాదించుకుంటారేమో... కానీ, చదువుకుంటే రేపు పది రూపాయలు సంపాదించుకుంటరు. అంతేకాదు, బయట ఎట్ల బతకాలో తెలుసుకుంటరు. మంచిగ బతుకతరు. అందుకే ‘కష్టమైనా పర్లేదు, నేనే ఇంకో నాలుగిండ్లలో పనిచేసి, బిడ్డల్ని చదివిస్తా’ అని చెబుతుంటా. ఐదుగురు కూతుళ్లలో పెద్దమ్మాయి పెండ్లి చేసిన. మిగతా నలుగురిలో ఇద్దరు ఇంటర్మీడియెట్, మరో ఇద్దరు స్కూల్లో చదువుకుంటున్నరు.ఎవరి అండా లేదు...నా చిన్నప్పుడే అమ్మానాయినలు చనిపోయారు. మా తాతనే నన్ను, మా చెల్లెల్ని సాదిండు. మా ఊరు తెలంగాణలోని గజ్వేల దగ్గర ధవలాపురం. అమ్మనాన్నలు లేరని హాస్టల్లో పెడితే ఐదవ తరగతి వరకు చదువుకున్నాం. ఆ తర్వాత మళ్లా తాత దగ్గరకు వచ్చేసినం. అప్పటినుంచి ఊళ్లనే. తాత ఏదో చేతనైన పని ఏదో చేసేవాడు. పదిహేనేళ్ల వయసులో మా ఊరి అబ్బాయితోనే పెళ్లయ్యింది. హైదరాబాద్‌కు వచ్చి, ఓ రూమ్ అద్దెకు తీసుకుని బతుకుతుండేవాళ్లం. కూతురు పుట్టిన రెండేళ్లకు అత్తింటివాళ్లతో గొడవలయ్యాయి. అవి పెద్దగై విడిపోవాల్సి వచ్చింది. ఎట్ల బతకాలో అర్థం కాలేదు. ఇళ్లలో పనికి కుదిరా. నా భర్త మరో పెళ్లి చేసుకున్నాడని తెలిసి, బాధతో కిరోసిన్ పోసుకుని, నిప్పు పెట్టుకున్న. గాంధీ ఆసుపత్రిలో నెల రోజుల పాటు చికిత్స కోసం ఉన్నా. బిడ్డ మొఖం చూసి, బతకాలని నిర్ణయించుకున్న. తిరిగి ఇళ్లలో పనిచేసుకుంటూ, బిడ్డను సాదుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటే మంచిదని, మా కాలనీ వాళ్లే చెప్పడంతో మా దోస్త్ బంధువుతో రెండో పెళ్లి చేసుకున్న. మొదట జీవితం సాఫీగానే సాగిపోయింది. కానీ తర్వాత కొట్టడం, హింసించడం చేసేవాడు. తాగీతాగీ చనిపోయాడు.కష్టాలే మార్చాయి...పెద్ద బిడ్డ గర్భవతిగా ఉందని తెలిసి, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లా. ‘గుండెకు రంధ్రం ఉంది, పిల్లలు పుడితే ఆమె బతకదు’ అన్నారు. చూస్తూ చూస్తూ బిడ్డను అలా వదిలేయలేక, గుండె ఆపరేషన్ చేయించిన. ఉండటానికి సొంత ఇల్లు లేదు. ఆఫీసుల చుట్టూ తిరగగా తిరగగా మొన్నటి నెలనే రేషన్ కార్డు వచ్చింది. వితంతు పింఛను లేదు. ఏ ఆస్తులూ లేవు. కానీ, పిల్లలు నా కష్టాన్ని అర్ధం చేసుకున్నరు. మంచిగ చదువుకుంటున్నరు. నా పిల్లలకు నేను అండ. పిల్లలు నాకు ఆసర అవుతున్నరు. రెక్కల కష్టమ్మీదనే బిడ్డలను సాకుతున్నాను అని, తెలిసినవాళ్లు ‘ఎన్నాళ్లు ఇట్లా కష్టపడతావు..’ అంటుంటారు. నా చిన్నప్పుడు అలాగే హాస్టల్లో ఉండి చదువుకునుంటే, ఏదైనా ఉద్యోగం చేసుకుని బతికేదాన్ని. కానీ, అప్పడు అమ్మనాన్నలేక, పరిస్థితులు బాగోలేక చదువుకోలేకపోయిన. నాలాగా నా పిల్లలు పనిమనుషులు కావద్దు. వాళ్ల జీవితాలు బాగుపడితే నా అన్ని కష్టాలూ చిన్నవే అయిపోతాయి’’ అని వివరించింది సువర్ణ కూతుళ్లను దగ్గరకు తీసుకుంటూ. అచంచలమైన ఆమె ఆత్మవిశ్వాసానికి చేతులెత్తి మొక్కాలనిపించింది. సారా ముంచింది...పిల్లలంతా ఏడాది, రెండేళ్ల తేడాతో పుట్టారు. కొడుకు కావాలని, ఆపరేషన్ చేయించుకోవద్దని బెదిరింపులు, చేయిచేసుకోవడం... సారాకు అలవాటు పడిన ఆయన పైసా సంపాదించకపోగా నా దగ్గరే పైసలు తీసుకునెటోడు. రోజంతా తాగుతూ పిల్లలను కూడ చూసుకునేవాడు కాదు. తాత చూస్తే బాగా ముసలాయన అయిపోయాడు. అప్పటికే చెల్లెలు పెళ్లయి వెళ్లిపోయింది. అయినా పిల్లలను తాత దగ్గరే వదిలేసి, పనికి పోయేదాన్ని. మా చిన్న బిడ్డ ఐదో ఏటన మా ఆయన చనిపోయాడు. ఇప్పటికి ఎనిమిదేళ్లు అయ్యాయి. ఆ తర్వాత తాత కూడా చనిపోయాడు. పిల్లలను స్కూల్లో వేసి, ఇళ్లలో పనిచేస్తూ ఇన్నేళ్లుగా గడుపుతున్నాను.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
TATTOO: పచ్చని ప్రేమ బొట్టు
‘‘పచ్చబొట్టు ఆదివాసీలకే అబ్బిన విద్య. మన దగ్గర మా బిరుద్ గోందులు మాత్రమే పచ్చబొట్టు వేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మా తెగ ఆడవాళ్లు మాత్రమే పచ్చబొట్టు వేస్తారు’’ అని చెప్పింది సుగుణాబాయ్. ఆమెది ఆదిలాబాద్ జిల్లా, తోషం గ్రామం. పచ్చబొట్టు వేయడానికి ఉపయోగించే కిట్ ఈ మహిళల దగ్గర ఎప్పుడూ ఉంటుంది. పచ్చబొట్టు వేయడానికి ఉపయోగించే సూదులు, అడవిలో సేకరించిన మూలికలతో చేసిన పసర్లు కూడా చిన్న సీసాల్లో ఉంటాయి. బిరుద్ గోందు మహిళల నుదుటి మీద కూడా పచ్చబొట్టు ఉంటుంది. అన్నిరకాల బొట్టుల కంటే ఇది తొలి బొట్టు అని చెబుతారు. పెళ్లికి ముందే పచ్చబొట్టు వేయాలని చెబుతారు. ఇందుకు వాళ్లు చెప్పే కారణం వింతగా ఉన్నప్పటికీ కొంత తార్కికత ఉందనే అనిపిస్తుంది. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సిన యువతికి మానసిక దారుఢ్యం ఉండాలి. నొప్పిని భరించేది దేహమే అయినప్పటికీ మనసు గట్టిగా ఉంటేనే శారీరక బాధను తట్టుకోగలుగుతారని, పచ్చబొట్టు నొప్పి ని భరించిన తరవాత ధైర్యం వస్తుందని, ఆ తర్వాత అడవుల్లో సంచరించేటప్పుడు ఏ గాయం తగిలినా అధైర్యపడరని చెప్పిందామె. బంగారు నగల్లో ఉండే నైపుణ్యం పచ్చబొట్టును అందంగా వేయడం ఒక కళ. ఆ కళలో ప్రతి బిరుద్ గోంద్ మహిళా ఆరితేరి ఉంటుంది. అరచేతి నుంచి మోచేతుల వరకు మెహందీ పెట్టుకున్నట్లు సన్నటి లతలు తీగల డిజైన్‌ను సూదులతో వేస్తారు. మెడ చుట్టూ కంఠాభరణం, ముక్కుపుడక, కాళ్ల పట్టీలు, వంకీలు... అన్నిరకాల ఆభరణాలూ పచ్చబొట్టు వేసుకుంటారు. బంగారు ఆభరణాలలో ఉండే నైపుణ్యం పచ్చబొట్టులోనూ ఉంటుంది’’ అంటోంది సుగుణాబాయి. పచ్చని బంధానికి బొట్టు మన కవులకు పచ్చబొట్టు చక్కటి కథాంశం. ప్రేమికుల మధ్య బంధానికి చెరగని ముద్రగా పచ్చబొట్టు చుట్టూనే కథను అల్లేయడం మన చిత్రసీమ నైపుణ్యం. అయితే, పచ్చబొట్టు ప్రేమికులకు మాత్రమే కాదు, దంపతుల మధ్య ప్రేమను కూడా పెంచుతుందని చెబుతుంది సుగుణాబాయి. ఆడవాళ్లు ఎక్కువగా కృష్ణుడి పింఛాన్ని పచ్చబొట్టుగా వేసుకోవడానికి ఇష్టపడతారని చెప్పింది సుగుణాబాయ్. ఆమె పచ్చబొట్టు వేయడం కోసమే ఆదివాసీల నివాస ప్రదేశాలు, మైదాన ప్రాంతాలు, నగరాల్లోనూ పర్యటించింది. పచ్చబొట్టుమనిషికి – మనసుకు మధ్య ముడివడే అందమైన బంధం అంటుందామె. భార్య పట్ల ప్రేమ ఉన్న మగవాళ్లు భార్య ఎప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటూ చందమామ బొమ్మ వేసుకుంటారని, భర్తకు ఏ ఆపదా రాకూడదని ఆడవాళ్లు సుదర్శన చక్రాన్ని, కలువ పువ్వు వేయించుకుంటారని చెప్పింది. కానీ, నిజానికి పచ్చబొట్టు వేయించుకునే వాళ్ల మైండ్‌ను ఆ రకంగా మలిచేది పచ్చబొట్టు వేసే మహిళల మాటల చాతుర్యమే. ఈ బాడీ ఆర్డ్ని అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, జార్ఖండ్, ఒడిషాల్లో స్థానిక ఆదివాసీలు వేస్తారు. మన తెలుగు రాష్ట్రాలకు మాత్రం చత్తీస్‌గఢ్, కచ్చర్ గఢ్ నుంచి విస్తరించింది. మాఘ పున్నమి జాతర సుగుణాబాయ్... తమ మూలాలను వివరిస్తూ ‘‘కచ్చర్‌గఢ్ గుహలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ సరిహద్దులో విస్తరించాయి. ఇది మాకే కాదు, అనేక ఆదివాసీ తెగలకు పవిత్రమైన ప్రదేశం. ఏటా ఇక్కడ మాఘపౌర్ణమి నుంచి నాలుగు రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. జంగుబాయి, లింగుబాబా జాతర చేసుకుంటాం. జంగుబాయి కచ్చర్‌గఢ్ లో సంచరించిన కథను పాటలుగా పాడుకుంటాం. పచ్చబొట్టు పసరు ఔషధం కూడా అక్కడే దొరుకుతుంది. మాకు రాయడం రాదు. మా పిల్లలకు మా పూర్వికుల గురించి చెప్పుకునేది పాటలతోనే. పచ్చబొట్టు వేయడానికి వెళ్లిన ప్రతి తావునా మా పాట పాడి వినిపిస్తాం. మా పాటలను మేము రికార్డు చేసుకుని దాచుకుంటున్నాం’’ అని పచ్చబొట్టు అందమైన చరిత్ర చెప్పింది సుగుణాబాయి. – వాకా మంజులారెడ్డి -
ఫలించిన రెండేళ్ల పోరాటం
పలమనేరు: మండంలోని దేవళంపేట వాసులు రెండేళ్ల పోరాటం సాకారమైంది. అక్షరాభ్యాసం లేని గిరిజనం పిల్లలకు అక్షరజ్ఞానం లభించే అవకాశం కలిగింది. అడవిలోని తమ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభించాలని గ్రామస్తులు కలెక్టర్‌ను కోరుతున్నారు. దీంతో స్పందించిన కలెక్టర్ గ్రామంలో బడి తెరవాలని స్థానిక ఎంఈవోకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో నేటి నుంచి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు ఓ ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై పంపి తరగతులు నిర్వహిస్తామని ఎంఈవో ఆగ్నెస్ తెలిపారు. పలమనేరు మండలం జగమర్ల పంచాయతీ దేవళంపేట గ్రామంలో 60 కుటుంబాలు ఉన్నాయి. గ్రామానికి నాలుగువైపులా దట్టమైన అడవి ఉంది. ఈ గ్రామానికి దారిసౌకర్యం కూడా అంతంతమాత్రమే. అడవిలో లభించే ఫలసాయం, మేకల పెంపకంతోనే గిరిజనులు జీవిస్తున్నారు. 20 మంది విద్యార్థులు ఉన్న ఇక్కడి పాఠశాలకు టీచర్లు వెళ్లడం కష్టంగా ఉండడంతో అప్పటి ఎంఈవో వాసుదేవనాయడు ఓ విద్యా వలంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా రెండేళ్ల క్రితం రేషనలైజేషన్‌లో ఈ పాఠశాలను రద్దు చేశారు. దీంతో గ్రామంలోని పిల్లలు చదువుకు దూరం అయ్యారు. కొందరు మాత్రం నాలుగు కిలోమీటర్ల దూరంలోని జగమర్ల పాఠశాలకు పిల్లలను పంపేవారు. అడవిలో ప్రమాదకర పరిస్థితులు ఉండడంతో ఆపేశారు. దీంతో గ్రామస్త్థులు పలుమార్లు జిల్లా కలెక్టర్‌ను కలసి తమగోడు చెప్పుకున్నారు. స్పందించిన కలెక్టర్ సిద్ధార్థజైన్ బడిని వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


