వెదురు సందడి | The valleys of Mizoram are filled with the music of bamboo flutes in march | Sakshi
Sakshi News home page

వెదురు సందడి

Mar 1 2026 6:01 AM | Updated on Mar 1 2026 6:01 AM

The valleys of Mizoram are filled with the music of bamboo flutes in march

సంహిత నిమ్మన

ప్రకృతి ఒడిలో, ఎత్తయిన కొండల మధ్య ఉన్న మిజోరంలో మార్చి నెల వచ్చిందంటే చాలు సరికొత్త సందడి మొదలవుతుంది. విలక్షణమైన సంస్కృతికి పేరుగాంచిన మిజోరాం లోయల నిండా వెదురు గడల సంగీతం ప్రతిధ్వనిస్తుంది. ఆ ధ్వనులకు తగ్గట్టుగా సంప్రదాయ దుస్తులతో నృత్యం చేసే యువతీ యువకులతో మిజో కొండలు సరికొత్తగా మెరుస్తాయి. కష్టాన్ని వేడుకగా మార్చుకుంటూ ప్రాచీన సంప్రదాయాలను లోకానికి చాటిచెప్పే వేడుకే ఈ చాప్‌చార్‌ కూట్‌. ఇది ఒక పండగ మాత్రమే కాదు, మిజో ప్రజల ఐక్యతకు, వారి అస్తిత్వానికి సజీవ సాక్ష్యం.  

మిజో భాషలో చాప్‌ అంటే నరికిన చెట్లు, చార్‌ అంటే ఎండబెట్టడం, కూట్‌ అంటే పండుగ అని అర్థం. గతంలో మిజోరాంలో పోడు వ్యవసాయం ఎక్కువగా చేసేవారు. ఇందుకోసం చెట్లను నరికి అడవిని శుభ్రం చేసేవారు. నరికిన చెట్లు ఎండేందుకు కొంత సమయం పడుతుంది. ఖాళీ సమయంలో గతంలో పడిన కష్టాన్ని మరచిపోయేందుకు, ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పేందుకు చాప్‌చార్‌ కూట్‌ను జరుపుకునేవారు. కాలక్రమేణా ఏడు రోజులు పండుగ మారింది. ఈ ఏడాది మార్చి 6న ఇది ప్రారంభమవుతుంది.

ఈ చాప్‌చార్‌ కుట్‌లో చెరావ్‌ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. రంగురంగుల సంప్రదాయ దుస్తులు ధరించిన యువతీ యువకులు వెదురు గడల లయబద్ధమైన శబ్దాలకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తుంటారు. వెదురు గడల మధ్య చిక్కుకోకుండా అత్యంత నైపుణ్యంతో చేసే ఈ వెదురు డ్యాన్స్ చూసేందుకు కనువిందుగా ఉంటుంది. ఈ నృత్యం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. 

ఈ నృత్యం మిజో ప్రజల ఐక్యత, క్రమశిక్షణ, ఏకాగ్రతకు నిదర్శనంగా నిలుస్తుంది. చెరావ్‌తో పాటుగా ఖుల్లం, చై వంటి ఇతర జానపద నృత్యాలు కూడా ఈ పండగలో ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయి. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి చాప్‌చార్‌ కూట్‌లో పాల్గొంటారు. పండగ సమయంలో గ్రామాల్లో ప్రజలు సంప్రదాయ దుస్తులైన పువాన్  ధరించి ఈ వేడుకల్లో భాగమవుతారు. 

అందరూ ఒక చోట చేరి భోజనాలు చేస్తారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ జానపద పాటలు పాడుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఈ పండగతో ప్రజలు తమ విలువలు, ఆచారాలు, సంప్రదాయాలను తర్వాతి తరానికి అందిస్తున్నారు.  మారుతున్న కాలానికి అనుగుణంగా పోడు వ్యవసాయం తగ్గినా చాప్‌చార్‌ కూట్‌ జోరు తగ్గలేదు. చాప్‌చార్‌ కూట్‌ వేడుకతో మిజోరాం ప్రజలు తమ సంస్కృతిని, ప్రత్యేకతలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. 

ఈ వేడుకలో మిజో ప్రజల కళలు, హస్తకళలు, స్థానిక వంటలు ప్రధానపాత్ర పోషిస్తాయి. వెదురుతో వివిధ రకాల డిజైన్ లలో అల్లిన బుట్టలు, టోపీలతో స్థానిక ప్రజలు తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తారు. పండగ సమయంలో వెదురు మొలకలు, గుమ్మడి ఆకులతో సంప్రదాయ వంటకాలతో విందులు చేసుకుంటారు. శాంతి, ప్రేమ, సోదరభావాన్ని పెంచే ఈ పండగ మిజోరం పర్యాటక రంగానికి మణిహారంగా నిలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement