న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రస్తుతం జరుగుతున్న పది, పన్నెండో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో పాఠశాల యాజమాన్యాలకు, సబ్జెక్ట్ నిపుణులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ప్రచారం కోసం కొన్ని విద్యాసంస్థలు పరీక్ష జరుగుతుండగానే లేదా ముగిసిన మరుక్షణమే ‘ప్రశ్నాపత్రం విశ్లేషణ’ పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న తీరుపై బోర్డు మండిపడింది.
పరీక్ష కొనసాగుతున్న సమయంలో ప్రశ్నాపత్రం బయటకు రావడం అసాధ్యమని, ఒకవేళ ఎవరైనా విశ్లేషణలు జరిపితే దానిని ‘స్కామ్’ లేదా ‘ఫేక్ అనాలసిస్’గా పరిగణిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఇటువంటి తప్పుడు పద్ధతులకు పాల్పడే పాఠశాలలు, నిపుణులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని బోర్డు ఉన్నతాధికారులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో వ్యాపించే తప్పుడు వార్తలు, ప్రశ్నాపత్రాల లీకేజీ పుకార్ల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సీబీఎస్ఈ సూచించింది.
పరీక్షల సమయంలో కొంతమంది అక్రమార్కులు నకిలీ ప్రశ్నాపత్రాలను చలామణి చేస్తున్నారని బోర్డు పేర్కొంది. పరీక్షల నిర్వహణకు విఘాతం కలిగించేలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై నిబంధనల ప్రకారం కఠినమైన శిక్షలు ఉంటాయని బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. పదో తరగతి విద్యార్థులకు సంబంధించి ‘ఎసెన్షియల్ రిపీట్’ నిబంధనపై కూడా బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమైన బోర్డు పరీక్షల్లో మొదటి విడతలో హాజరుకావడం ప్రతి విద్యార్థికి తప్పనిసరి. కనీసం మూడు సబ్జెక్టుల పరీక్షలకు హాజరుకాని పక్షంలో వారిని ‘ఎసెన్షియల్ రిపీట్’ కేటగిరీ కింద పరిగణిస్తారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మొదటి విడత పరీక్షలు రాయలేమని, నేరుగా రెండో విడతకు అనుమతించాలని విద్యార్థుల నుంచి వచ్చిన విన్నపాలను బోర్డు తోసిపుచ్చింది.
ఇది కూడా చదవండి: ఏఐ విప్లవం: భారత్ ముందున్న అతిపెద్ద సవాల్


