‘భారత్ టాక్సీ’ సహకార ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం | Bharat Taxi positioned India first cooperative ride hailing platform | Sakshi
Sakshi News home page

‘భారత్ టాక్సీ’ సహకార ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

Feb 24 2026 1:26 PM | Updated on Feb 24 2026 1:31 PM

Bharat Taxi positioned India first cooperative ride hailing platform

దేశీయ రవాణా రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించుతూ డ్రైవర్లే యజమానులుగా సాగే ప్రక్రియకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీకారం చుట్టారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘భారత్ టాక్సీ’ అనే సహకార రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌ను అధికారికంగా ప్రారంభించారు. కార్పొరేట్ కంపెనీల లాభార్జనే ధ్యేయంగా సాగే ప్రస్తుత వ్యవస్థకు భిన్నంగా ఇది డ్రైవర్ల సంక్షేమం, యాజమాన్య భాగస్వామ్యం ప్రాతిపదికన పనిచేయనుంది.

డ్రైవర్ల చేతికే లాభాలు

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, గుజరాత్‌కు చెందిన క్యాబ్, ఆటో డ్రైవర్లను ఉద్దేశించి ప్రసంగించిన అమిత్ షా ఈ ప్లాట్‌ఫామ్ లాభాల పంపిణీ విధానాన్ని వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. సంస్థ గడించే నికర లాభాల్లో 80 శాతం మొత్తాన్ని కిలోమీటర్ల ప్రయాణం ఆధారంగా నేరుగా డ్రైవర్లకే పంపిణీ చేస్తారు. మిగిలిన 20 శాతం మొత్తాన్ని సహకార సంస్థ బలోపేతానికి, సాంకేతిక అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయిస్తారు. ‘ప్రస్తుత ప్రైవేట్ కంపెనీలు డ్రైవర్లకు కనీస బేస్ రేటును కూడా ఖరారు చేయడం లేదు. కానీ భారత్ టాక్సీ ద్వారా డ్రైవర్ల కనీస ఆదాయానికి భరోసా ఇస్తాం’ అని షా స్పష్టం చేశారు.

రూ.500తో యజమానిగా.. ‘అమూల్’ తరహా మోడల్

భారత్ టాక్సీ నిర్మాణాన్ని ప్రపంచ ప్రఖ్యాత అమూల్ డెయిరీ కోఆపరేటివ్‌తో అమిత్ షా పోల్చారు. 36 లక్షల మంది మహిళలు కేవలం రూ.50 పెట్టుబడితో ప్రారంభించిన అమూల్ నేడు రూ.1.25 లక్షల కోట్ల సామ్రాజ్యంగా ఎదిగిందని ఆయన గుర్తు చేశారు. కేవలం రూ.500 చెల్లించి భారత్‌ ట్యాక్సీలో షేర్ కొనడం ద్వారా ప్రతి డ్రైవర్ ఈ సంస్థలో సహ యజమాని కావచ్చు. సభ్యుల సంఖ్య పెరిగిన తర్వాత డ్రైవర్లే డైరెక్టర్ల బోర్డులో ప్రాతినిధ్యం వహిస్తారు. తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ నిర్ణయం జరిగినా ప్రశ్నించే హక్కు డ్రైవర్ల ప్రతినిధులకు ఉంటుంది.

15 కోట్ల మంది డ్రైవర్లే లక్ష్యం

ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసుకున్న భారత్ టాక్సీ దేశవ్యాప్తంగా విస్తరించేందుకు భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్‌సీఆర్‌, రాజ్‌కోట్ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 2 ఏళ్లలో 15 కోట్ల మంది డ్రైవర్లను చేర్చుకోవడమే స్వల్పకాలిక లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా అంటే 3 ఏళ్లలో దేశంలోని అన్ని మునిసిపల్ కార్పొరేషన్లకు విస్తరించాలని చూస్తోంది.

మార్కెట్ దిగ్గజాలకు పోటీ

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి అగ్రిగేటర్లు డ్రైవర్ల నుంచి 25-30% వరకు కమీషన్ వసూలు చేస్తున్నాయి. దీనికి భిన్నంగా భారత్ టాక్సీ ప్రస్తుతం ఎటువంటి కమీషన్ వసూలు చేయడం లేదు. ఈ లాభాల భాగస్వామ్య వ్యవస్థ పూర్తిస్థాయిలో స్థిరపడటానికి మూడు ఏళ్ల సమయం పడుతుందని అంతవరకు డ్రైవర్లు సహకరించాలని అమిత్ షా కోరారు.

ఇదీ చదవండి: పెరిగిన పసిడి ధరలు.. ఎంతంటే..

Advertisement
 
Advertisement
Advertisement