ర్యాపిడో, ఓలా, ఉబెర్ అగ్రిగేటర్లకు భారీ ఊరట లభించింది. కర్ణాటకలో కొనసాగుతున్న బైక్ ట్యాక్సీలపై నిషేధాన్ని బుధవారం హైకోర్టు ఎత్తేసింది. ఈ క్రమంలో గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ.. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. దీంతో ఆరు నెలలుగా కొనసాగుతున్న బ్యాన్‌కు తెరపడినట్లయ్యింది.
మోటార్ వెహికల్ చట్టంలో బైక్ ట్యాక్సీల ప్రస్తావన లేకపోవడంతో ఈ సేవలను నిలిపివేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కిందటి ఏడాది ఈ అంశంపై అగ్రిగేటర్లు(ఓలా, ర్యాపిడో, ఉబెర్) ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ వాటికి చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలనుసారం కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ నుంచి బైక్ ట్యాక్సీలపై నిషేధం అమల్లోకి తెచ్చింది. అయితే సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ కంపెనీలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాయి. దీంతో.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభు బఖ్రు, జస్టిస్ సీఎం జోషి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ జరిపింది.
విచారణ సమయంలోనూ.. రాష్ట్ర ప్రభుత్వం బైక్ ట్యాక్సీ (Bike taxi)లపై నిషేధం విధించడాన్ని చీఫ్ జస్టిస్ బెంచ్ తప్పుబట్టింది. బైక్ ట్యాక్సీ లగ్జరీ కాదని.. నగర ప్రజలకు అది అవసరమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభు బఖ్రు అభిప్రాయపడ్డారు. మధ్యతరగతి ప్రజలకు బైక్‌ట్యాక్సీలు ఎంతో ఉపయోగకరమైనవని.. దేశంలోని దాదాపు 13 రాష్ట్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉందని వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో.. మోటారు వాహనాల చట్టం బైక్ ట్యాక్సీలను నిషేధిస్తుందనే రాష్ట్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చారు కూడా. బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించడం వల్ల వాటిపైనే ఆధారపడిన ఎన్నో కుటుంబాలు రోడ్డునపడతాయని.. ప్రజల జీవనోపాధి హక్కును పూర్తిగా హరించే అధికారం ఎవరికీ ఉండదని ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం.
ఆ సమయంలో.. కోర్టు వ్యాఖ్యలను బైక్స్ ట్యాక్సీ వెల్ఫేర్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. చట్టబద్ధమైన, సురక్షిత కార్యకలాపాలను కొనసాగించడానికి తాము ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల వాదనలను ద్విసభ్య ధర్మాసనం పూర్తిగా వింది.
ఇవాళ్టి తీర్పులో.. కర్ణాటక హైకోర్టు ఇవాళ బైక్ ట్యాక్సీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. మోటార్‌సైకిళ్లను ట్రాన్స్‌పోర్ట్ వాహనాలుగా ఉపయోగించవచ్చని.. కానీ యజమానులు, అగ్రిగేటర్లు తప్పనిసరిగా లైసెన్స్‌లు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే.. ప్రభుత్వం కూడా చట్టం ప్రకారం అనుమతులు ఇవ్వాలి.. మోటార్‌సైకిళ్లు సాధారణంగా ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు కావు అనే కారణం చూపిస్తూ తిరస్కరిస్తే ఊరుకునేది లేదు అని స్పష్టం చేసింది.


