ఎవరిని కలిశానో చెప్పను: డీసీఎం | - | Sakshi
Sakshi News home page

ఎవరిని కలిశానో చెప్పను: డీసీఎం

Mar 10 2026 12:53 PM | Updated on Mar 10 2026 12:53 PM

శివాజీనగర: ముఖ్యమంత్రి మార్పిడిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమించిన తనకు కూడా ఒక అవకాశం కల్పించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలను కోరినట్లు తెలిసింది. ఇదే డిమాండ్‌తో గత కొన్ని వారాలుగా హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకొస్తున్న ఆయన ఆదివారం హఠాత్తుగా హస్తినకు వెళ్లారు. అయితే వెంటనే పార్టీ అగ్రనేతల అపాయింట్‌మెంట్లు దొరకకపోవడంతో రాత్రికి అక్కడే మకాం వేశారు. సోమవారం ఉదయం నుంచి రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా పలువురు నాయకులతో సమావేశం కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. తనకు సీఎం పదవి కావాలనే ఏకవాక్య అజెండాతో పర్యటన సాగించారు.

కొలిక్కిరాని పోరాటం

రాష్ట్రంలో సీఎం కుర్చీ కోసం సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే మధ్య గత 4, 5 నెలలుగా పోరాటం సాగుతోంది. ఇది శీతల యుద్ధం నుంచి వీధి పోరాటాల వరకూ వ్యాపించింది. కొందరు మంత్రులు, ఇరువర్గాల ఎమ్మెల్యేలు జంతువులతో పోల్చుతూ ఆరోపణలు చేసుకుంటున్నారు. హైకమాండ్‌ మాత్రం గట్టి నిర్ణయం తీసుకోవడం లేదు. సీఎం సీటు గురించి ఎవరూ బయట మాట్లాడరాదని ఢిల్లీ పెద్దలు ఆదేశించినా, అనుకూల–వ్యతిరేక వ్యాఖ్యలు అడపాదడపా వెలువడుతున్నాయి. పైగా ఈ వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని హైకమాండ్‌కే సలహాలు ఇవ్వడం గమనార్హం.

విందుకు వేళాయె

డీకే మంగళవారం బెంగళూరుకు తిరిగి వస్తున్నారు. అదే రోజు బెంగళూరులో పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఆయన భారీ విందు ఇవ్వబోతున్నారు. దీంతో అందరి చర్చ విందు మీదే సాగుతోంది. సీఎం సిద్దరామయ్యను, మంత్రులను కూడా ఆహ్వానించారు. ఎంతమంది వస్తారు, ఎంతమంది ముఖం చాటేస్తారు, ఏం జరుగుతుందీ అన్నది కుతూహలం రేపుతోంది.

సీఎం పదవినిప్పించాలని

హైకమాండ్‌కు వినతి

అగ్రనేతలతో భేటీలు?

నేడు బెంగళూరులో ఎమ్మెల్యేలు,

ఎమ్మెల్సీలకు భారీ విందు

డిన్నర్‌ మీటింగ్‌పై కుతూహలం

బనశంకరి: నేను ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తాను అనేది బహిరంగంగా చెప్పడం కుదరదని డీసీఎం డీకే శివకుమార్‌ అన్నారు. సోమవారం ఢిల్లీలో కర్ణాటక భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీకి వచ్చిన తరువాత నేను అందరినీ కలుస్తాను. కానీ హైకమాండ్‌ నేతలు అపాయింట్‌మెంట్‌ ఇవ్వక పోవడంతో నేను వేచి చూస్తున్నాను అని మీడియాలో ప్రసారం చేస్తారు. అందుకే వేచిచూస్తున్నాను. పూణేలో నా స్నేహితుని ఇంట్లో పెళ్లి ఉంటే ఆదివారం బయల్దేరాను. సోమవారం అసోం పీసీసీ అధ్యక్షునితో భేటీతో పాటు అనేక సమావేశాల్లో పాల్గొన్నాను’ అని తెలిపారు. మంగళవారంతో కేపీసీసీ అధ్యక్షునిగా 6 ఏళ్లు పూర్తి అవుతుంది, ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బెంగళూరులో విందు ఏర్పాటు చేశానని చెప్పారు. ఓడిన అభ్యర్థులు, జిల్లా, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులకు మరోసారి డిన్నర్‌ ఇస్తానని చెప్పారు. ఢిల్లీ భేటీపై ఎలాంటి ప్రత్యేక చర్చ వద్దన్నారు. ఇక బుధవారం కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశం ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement