● మండ్య జిల్లాలో విషాదం
మండ్య: కలిసి ఏడడుగులు వేశారు, ఎంత కష్టం వచ్చిందో గానీ కలిసే తనువు చాలించారు. జిల్లాలోని కెఆర్ పేట పట్టణంలోని జయనగర బ్లాక్‌లో యువ దంపతులు ఒకే తాడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. హోస్కోటే గ్రామానికి చెందిన దర్శన్ (29), నతనహళ్లికి చెందిన భార్య ఎన్.ఎల్. దివ్య (25) మృతులు. వీరికి 3 ఏళ్ల కిందట పెళ్లయింది, ఏడాదిగా ఇక్కడ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. దర్శన్ క్యాబ్ డ్రైవర్ కాగా, దివ్య ఓ నర్సింగ్ హోంలో పనిచేస్తున్నారు. వీరికి రక్ష అనే రెండేళ్ల కుమార్తె ఉంది. ఏం సమస్యలు వచ్చాయోగానీ.. ఆదివారం రాత్రి వారితో పాటు పాపకు ఉరి బిగించి ప్రాణాలు తీసుకున్నారు. అయితే ఉరి జారిపోవడంతో పాప క్షేమంగా తప్పించుకుంది. చిన్నారి ఏడుస్తూ ఉండడంతో ఇరుగు పొరుగు వచ్చి చూడగా దంపతులు ఉరికి వేలాడుతూ కనిపించారు. దర్శన్ తండ్రి గణేష్ గౌడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు కుటుంబాలవారు చేరుకుని మీరంటే మీరు కారణమని ఆరోపణలు చేసుకున్నారు. తల్లిదండ్రులు కానరాని లోకాలకు చేరడంతో కూతురు అనాథగా మారింది.
చెరువులపై
సోలార్ విద్యుత్ ప్లాంట్లు
బనశంకరి: చెరువులపై తేలియాడే సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు మీద దృష్టి సారించాలని చిన్ననీటిపారుదల శాఖమంత్రి ఎన్‌ఎస్.బోసురాజు అధికారులకు సూచించారు. సోమవారం వికాససౌధలో నీటిపారుదల, విద్యుత్ అధికారులతో భేటీ జరిపారు. ఎత్తిపోతల పథకాలకు అయ్యే భారీ ఖర్చు, విద్యుత్ వ్యయాన్ని తగ్గించాలని, అందుకు గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో చెరువులలో తేలియాడే సౌరవిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు గురించి బీహెచ్‌ఈఎల్ ను అధ్యయన నివేదిక ఇచ్చిందన్నారు. కోలారు జిల్లా సోమాంబుధి అగ్రహార చెరువులో ప్రయోగాత్మకంగా తేలియాడే సౌరవిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన గురించి బీహెచ్‌ఈఎల్ నివేదిక సిద్ధం చేసిందని తెలిపారు. ఆ నివేదికను పరిశీలించి పథకం అమలుపై కసరత్తు చేయాలని ఆదేశించారు.
గజ దాడిలో మహిళ మృతి
యశవంతపుర: ఓ మహిళను అడవి ఏనుగు దాడి చేసి చంపిన ఘటన కొడగు జిల్లాలో జరిగింది. వివరాలు.. కుశాలనగర తాలూకా నంజరాయపట్టణ గ్రామం బాళెగుండి గిరిజన వాడలో గ్రామ పంచాయతి మాజీ సభ్యురాలు జలజాక్షి (51) నివసించేది. ఆమె సోమవారం ఉదయం 10 గంటల సమయంలో దగ్గరిలోని అడవిలోకి వెళ్లి అటవీ ఉత్పత్తుల కోసం వెతుకుతుండగా, ఓ ఏనుగు దాడి చేసింది. కాళ్లతో తొక్కి అక్కడే ఆమె ప్రాణాలు తీసింది. విషయం తెలుసుకుని గ్రామస్తులు, కుశాలనగర అటవీశాఖ అధికారులు అక్కడికి వచ్చి మృతదేహాన్ని కుశాలనగర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఊరు చుట్టుపక్కల సంచరిస్తున్న ఏనుగులను తరిమివేయాలని కోరారు. కాగా, రాష్ట్రంలో గజదాడులు పెరిగిపోయాయి. తరచూ కూలీలు, రైతులు బలవుతున్నారు.


