శివమొగ్గ: ఓమ్ని కారు కదులుతుండగా మంటలు చెలరేగి దగ్ధమైంది. శివమొగ్గ జిల్లా హోసనగర తాలూకాలోని రిప్పన్‌పేట దగ్గర బెల్లూర్ గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుడు శ్రీకాంత్ బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తన సోదరి పెళ్లి పత్రికలను పంచడానికి బంధువుతో కలిసి కారులో శివమొగ్గకు వెళ్లాడు. అక్కడి నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. కారు ఇంజిన్‌లో నుంచి పొగ మంటలు రావడంతో అందులో ఉన్నవారు దిగిపోయారు. కారులోని కూరగాయలు, కొత్త బట్టలు, ఇతర పెళ్లి వస్తువులు కూడా కాలిపోయాయి. ఇంజన్ హీటెక్కడం, లేక షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరిగి ఉంటుందని అనుమానాలున్నాయి.
ఘనంగా కుంభాభిషేకం
మైసూరు: జిల్లాలోని నంజన్‌గూడు తాలూకాలోని కసువినహళ్లి గ్రామంలో పురాతన నారాయణస్వామి ఆలయ పునరుద్ధరణ ఉత్సవం ఘనంగా జరిగింది. కొత్త విమాన గోపురానికి కుంభాభిషేకం, కలశారోహణం, యజ్ఞ యాగాదులను వేదపండితుల ఆధ్వర్యంలో పూర్తి చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.
కాలిన కారులో వ్యక్తి మృతి
బాగేపల్లి: బాగేపల్లి తాలూకాలోని బాలారెడ్డిపల్లి సమీపంలో మారుతి–800 కారు, అందులో ఓ వ్యక్తి కాలిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కారు కాలిపోతున్నట్లు గ్రామస్తులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి నీళ్లు చల్లి మంటలను ఆర్పివేసి లోపల పరిశీలించగా ఒక వ్యక్తి కాలిపోయి ఉన్నాడు. మృతుడు ఉదయ్‌కుమార్ (65) బాగేపల్లి తాలూకాలోని పెనుమాల్ గ్రామవాసిగా గుర్తించారు. ఈయన చాలాఏళ్ల నుంచీ కుటుంబంతో కలిసి బెంగళూరులో నివసిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తన తల్లిని చూడటానికి సొంతూరికి వచ్చి బెంగళూరుకు తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతదేహాన్ని బాగేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది ప్రమాదమా.. లేక మరేదైనా అనేది ముమ్మరంగా విచారణ చేపట్టారు. ఈ సంఘటన స్థానికుల్లో భయాందోళన కలిగించింది.
21 విమానాల రద్దు
యశవంతపుర: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయానికి రావలసిన అనేక విమానాల సర్వీసులు రద్దయ్యాయి. అరబ్ దేశాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే 21 విమానాలు బందయ్యాయి. దీంతో బెంగళూరు ఎయిర్‌పోర్టులో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధం బెంగళూరు మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మార్చి 1 నుంచి 9 వరకు అనేక దేశాలకు విమానాల రాకపోకలు అస్తవ్యస్తమయ్యాయి. 200లకు పైగా విమాన సేవలు రద్దయ్యాయి.
కారుపై పడిన కంటైనర్ లారీ
● బాలిక దుర్మరణం
యశవంతపుర: ఉత్తరకన్నడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ అదుపుతప్పి కారుపై పడటంతో ఐదేళ్ల బాలిక మృతి చెందింది. వివరాలు.. సోమవారం కార్వార నుంచి అంకోలా వైపు కారు, కంటైనర్ లారీ వెళ్తున్నాయి. కంటైనర్ డ్రైవరు నిర్లక్ష్యంగా నడుపుతూ కొండ అంచును తాకడంతో అది పక్కనే వెళ్తున్న కారు మీద బోల్తా పడింది. దీంతో కారు నుజ్జయింది, ఐదేళ్ల బాలిక చనిపోయింది. ఆమె తల్లిదండ్రులు, మరో చిన్నారి చిన్న చిన్న గాయాలతో బయటపడి చికిత్స పొందుతున్నారు. ఈ దంపతులు వైద్యులని తెలిసింది. కంటైనర్ డ్రైవర్ బాగా తాగి ఉన్నాడు, లారీ నుంచి బయటకు వచ్చి రోడ్డుపై కేకలు వేయసాగాడు. ఈ రభసతో హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. కార్వార పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు.


