కదిరి: అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న కదిరి నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం నేడు మంగళవారం ఉదయం 8:25 నుంచి 8:45 గంటల మధ్య శుభ మేష లగ్నంలో జరగనుందని ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్సవం ఇది. ఇప్పటికే ఆలయ ప్రాంగణంతో పాటు తిరు వీధులలోని భవనాలు భక్తులతో కిట కిటలాడుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో కాలు మోపేందుకు చోటు లేకుండా భక్తజనం రద్దీ నెలకొంది. రథోత్సవంలో 3 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం పట్టణంలో దాతలు అన్నదాన శిబిరాలను ఏర్పాటు చేశాయి. రథోత్సవం ప్రశాంతంగా జరిగేలా వందలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటైంది.
ఐరావతంపై నారసింహుడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి తెల్లని ఐరావతంపై నరసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. హిరణ్యకశిపుని సంహరించిన నారసింహుడి ఉగ్ర రూపాన్ని చూడలేని దేవతాగణం మొర మేరకు ఆయన తెల్లని ఐరావతంపై దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఐరావతంపై ఊరేగిన అనంతరం శ్రీవారు తిరిగి ఆలయంలోకి వెళ్లారు. పూజల అనంతరం తెల్లవారుజామున రథంపైకి ప్రవేశిస్తారు.
ఆలయ ప్రాంగణంలో భక్తజనం
నేడు కదిరిలో మహా వేడుక


