కమర్షియల్ మొబిలిటీ విభాగంలోకి ఎంట్రీ
2 కార్ల ఆవిష్కరణ ధర రూ. 5,99,900 నుంచి ప్రారంభం
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం హుందాయ్ తాజాగా కమర్షియల్ మొబిలిటీ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ’ప్రైమ్ ట్యాక్సీ’ శ్రేణి కార్లను ఆవిష్కరించింది. ఫ్లీట్ ఆపరేటర్లు, ట్యాక్సీ ఎంట్రప్రెన్యూర్లకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొంది. ఇందులో ప్రైమ్ హెచ్‌బీ (హ్యాచ్‌బ్యాక్), ప్రైమ్ ఎస్‌డీ (సెడాన్) కార్లు ఉన్నాయి. ఇవి అందుబాటు ధరలో లభించే, సౌకర్యవంతమైన, అధిక ఆదాయార్జన అవకాశాలు కల్పించే వాహనాలుగా కంపెనీ పేర్కొంది.
వీటి ధరలు వరుసగా రూ. 5,99,900, రూ. 6,89,900 నుంచి (ఎక్స్ షోరూం) ప్రారంభమవుతాయని హుందాయ్ మోటార్ ఇండియా (హెచ్‌ఎంఐఎల్) నూతన ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న తరుణ్ గర్గ్ తెలిపారు. 72 నెలల వరకు చెల్లింపు కాలవ్యవధితో సరళతర రుణ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.


