
ఇన్నేళ్ల తర్వాత అవి రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి..
తాజాగా మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలను సవరించిన కేంద్రం
క్యాబ్ కనీస చార్జీ,సర్జ్ చార్జీల నిర్ధారణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
బైక్ ట్యాక్సీల కొనసాగింపు
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ సర్వీసులు తొలిసారి రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి రాబోతున్నాయి. ఓలా, ఉబర్, రాపిడో లాంటి క్యాబ్ అగ్రిగేటర్లు రాష్ట్రంలో దాదాపు 11 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాయి. కానీ, వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తన నియంత్రణలోకి తీసుకోలేదు. ఫలితంగా ఇన్నేళ్లుగా అవే సొంతంగా చార్జీలను నిర్ధారించుకుంటూ, ఓ పద్ధతి అంటూ లేకుండా పీక్ డిమాండ్ పేరుతో తోచినంత చార్జీ పెంచుతూ ప్రయాణికుల జేబు లను కొల్లగొడుతున్నాయి. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వాటిని రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకోబోతోంది.
దీంతో వాటి బేస్ చార్జీ, పెరుగుదల, పీక్ అవర్ సర్జ్‌లాంటివి రాష్ట్ర రవాణాశాఖ నిర్ధారించబోతోంది. క్యాబ్ సేవలపై వచ్చే ఫిర్యాదులను కూడా రవాణాశాఖ పరిశీలించి చర్యలు తీసుకోనుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికిల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు–2025ను విడుదల చేసిన విషయం తెలిసిందే. పీక్ అవర్స్‌లో క్యాబ్ బేస్ ఫేర్‌ను రెట్టింపు మేర పెంచుకోవటం, డిమాండ్ లేని వేళ, బేస్ ఫేర్‌లో 50 శాతానికి చార్జీ వసూలు చేయటం లాంటి కీలక సవరణలు చేసింది. వీటితోపాటు క్యాబ్ డ్రైవర్లకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా, రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్‌ను అగ్రిగేటర్లు కల్పించేలా అందులో పొందుపరిచింది.
బుక్ చేసుకున్న క్యాబ్ ప్రయాణికుడి వరకు రావటానికి 3 కి.మీ. దూరం మించితే ఆ దూరానికి కూడా అదనపు చార్జీని లెక్కగట్టడం, సహేతుక కారణం చూపకుండా డ్రైవర్‌గాని, ప్రయాణికుడు గాని రైడ్ క్యాన్సిల్ చేసుకుంటే అపరాధ రుసుము చెల్లించాల్సి రావటం లాంటి అంశాలను కూడా అందులో చేర్చింది. ఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవటంతోపాటు వాటి అమలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ దిశగా చర్యలు తీసుకోగా, ఇప్పుడు తెలంగాణ కూడా కసరత్తు ప్రారంభించింది.
ఏంటీ ఉపయోగం..
గతంలో ఆటోరిక్షా వాలాలు ఎక్కువ చార్జీలు వసూలు చేస్తే ప్రయాణికులు రవాణాశాఖకు ఫిర్యాదు చేసే వీలుండేది, ఆ ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ, ప్రస్తుతం 90 శాతం మంది ఆటోవాలాలు క్యాబ్ అగ్రిగేటర్ల యాప్‌లతో అనుసంధానమయ్యారు. దీంతో వారు రవాణాశాఖ నిర్ధారించిన చార్జీలను పరిగణనలోకి తీసుకోవటం లేదు. పీక్ డిమాండ్ పేరుతో ఇష్టం వచ్చిన చార్జీలు వసూలు చేస్తున్నా ప్రయాణికులు రవాణాశాఖకు ఫిర్యాదు చేసే వీలు లేకుండా పోయింది. ఇప్పుడు అలాంటి ఆటోలతో పాటు క్యాబ్‌లపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది.
పీక్ అవర్ ఓ బ్రహ్మపదార్థం..
గతంలో ఆటోరిక్షాలకు ఉదయం, రాత్రి వేళలను పీక్ అవర్స్‌గా పేర్కొంటూ 1.5 శాతం ఎక్కువ చార్జీ వసూలు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. కానీ, క్యాబ్ సరీ్వసులు 24 గంటలు పీక్ అవర్‌గా పేర్కొంటూ ఇష్టం వచ్చిన రీతిలో చార్జీలు వసూలు చేస్తున్నాయి. డిమాండ్ కాస్త ఎక్కువ ఉందని తెలియగానే, వాన కురవగానే, ట్రాఫిక్ జామ్ పెరగగానే, రోడ్డుమీద క్యాబ్‌ల సంఖ్య తక్కువ ఉన్నాయనగానే.. రెండుమూడు రెట్టు చార్జీలు పెరిగిపోతాయి. ఇప్పుడు దీన్ని నియంత్రించే వీలుంటుంది. బుక్ అయిన రైడ్‌ను డ్రైవర్ రద్దు చేసుకునే వీలు కూడా ఉండదు.
ప్రభుత్వానికీ ఆదాయం..
ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఓలా, ఉబర్, రాపిడో లాంటి అగ్రిగేటర్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్యాబ్ లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రతి క్యాబ్ నుంచి రోడ్డు ట్యాక్స్ వసూలవుతుంది. జీఎస్టీ ఆదాయం సమకూరుతుంది.
బైక్ ట్యాక్సీలకు ఓకే..
ప్రస్తుతం నగరంలో 1.30 లక్షల కార్లు క్యాబ్ సర్వీసుల్లో ఉన్నాయి. మరో లక్షన్నర వరకు ఆటోరిక్షాలున్నాయి. ఇవి కాకుండా కొన్నేళ్లుగా బైక్ ట్యాక్సీలు భారీగా రోడ్డెక్కుతున్నాయి. వైట్ ప్లేట్‌తో ఉండే ఈ బైక్ ట్యాక్సీలు చట్టబద్ధం కాదని పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని క్యాబ్, ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ, తాజాగా కేంద్ర ప్రభుత్వం వాటికి అనుమతిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అవి యథావిధిగా నడవనున్నాయి. వాటికి పసుపు రంగు ట్యాక్సీ నంబర్‌ప్లేట్ తప్పనిసరి చేయకపోవటం విశేషం. దీంతో వాటి సంఖ్య మరింత పెరిగే వీలుంది.