మూలధార చక్రం..కార్తికేయ స్థానం..! | Benefits of Worshiping Lord Kartikeya | Sakshi
Sakshi News home page

మూలధార చక్రం..కార్తికేయ స్థానం..!

Nov 27 2025 12:28 PM | Updated on Nov 27 2025 12:48 PM

Benefits of Worshiping Lord Kartikeya

మన సూక్ష్మ శరీరంలో శ్రీ కార్తికేయుని స్థానం కుడివైపు మూలాధార చక్రంలో ఉంటుంది. మన లోపల కుండలినీ శక్తి కుడివైపు మూలాధార చక్రాన్ని దాటి పైకి రావాలంటే, మనలో శ్రీ కార్తికేయుని గుణగణాలు ఉండాలి. ఆ గుణగణాలు ఏమిటో, కుడివైపు మూలాధార చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ శ్రీ కార్తికేయుని ఆశీస్సులను పొందడమెలానో శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల నుంచి తెలుసుకుందాం.శ్రీ గణేశుడు గణాలన్నింటికీ రాజు అయితే శ్రీ కార్తికేయుడు సర్వ సైన్యాధ్యక్షుడు. అతను మన కుడివైపు ఉండే పింగళా నాడిని ప్రభావితం చేసే శక్తికి ప్రతీకగా ఉంటాడు. 

ఈ శక్తి మన ప్రాణ శక్తితో అనుసంధానింపబడి ఉంటుంది. శ్రీ కార్తికేయుని అనుగ్రహం దడం వలన మానవులకు పసిపిల్లల అమాయకత్వంతో కూడిన తేజస్సు, చక్కటి క్రియాశీలత, చెడును అంతమొందించ గల అంతర్గత దైవ శక్తి లభిస్తాయి. భగవంతుని పట్ల వినయ విధేయతలు, నాయకత్వ లక్షణాలు, అందరికీ మార్గ దర్శకత్వం చేయగల శక్తి, దైవికమైన జ్ఞానం, వివేకం లభిస్తాయి.శ్రీ కార్తికేయుని నివాసం కుడివైపు మూలాధార చక్రమే అయినా కుడివైపు నాడి అయిన పింగళా నాడి మొత్తంపై అతని ప్రభావం ఉంటుంది. అందువలనే అతనికి ‘సుపింగళా’ అనే నామం ఏర్పడింది. 

మన కుడివైపు మూలాధార చక్రం శుభ్రమైనప్పుడు, కుడివైపు ఉండే పింగళా నాడి మొత్తం శుభ్రమవుతుంది. మన లోపల మూలాధార చక్రం, ఆజ్ఞా చక్రం ఒకదానితో మరొకటి పరిపూర్ణ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందువల్లే కుడివైపు మూలాధార చక్రం శుభ్రమైనప్పుడు కుడివైపు ఆజ్ఞా చక్రం కూడా శుభ్రపడి మనలో అహంకారాన్ని నియంత్రించే శక్తిని మెరుగుపరుస్తుంది. ‘అహం కరోతి ఇతి అహంకారః’ అన్నారు మన పెద్దలు. అంటే ‘నేను చేస్తున్నాను అనుకుంటే అది అహంకారం‘. నిజానికి మన ద్వారా జరిగే ప్రతీ పనినీ మన లోపల ఉండే భగవంతుని శక్తి జరిపిస్తుంది. 

ఆ నిజాన్ని విస్మరించి మన ద్వారా ఏదైనా గొప్ప పని జరిగినప్పుడు అది మనమే చేశామనుకొని భ్రమ పడితే, అప్పుడు అది మన సూక్ష్మ శరీరంలో అహంకారమనే బుడగను ఏర్పరుస్తుంది. ఈ అహంకారమనే బుడగ మన ఆజ్ఞా చక్రం ఎడమవైపు అవరోధంగా నిలిచి మన కుండలినీ శక్తి ఆజ్ఞా చక్రమును దాటకుండా అడ్డుకుంటుంది. శ్రీ కార్తికేయుని ధ్యానము వలన అహంకారము తగ్గి మన లోపల శ్రద్ధ నెలకొంటుంది. మన మెదడులో దైవికమైన విచక్షణా శక్తి ఏర్పడి జ్ఞానంతో ప్రకాశిస్తుంది. 

భగవంతుని సంహారక శక్తి శ్రీ కార్తికేయుడు నరకలోక ద్వారాన్ని నియంత్రిస్తూ ఉంటాడు. శ్రీ భైరవనాథుడు మన ఎడమ వైపు ఉండే ఇడా నాడి మొత్తం సంచరిస్తూ, అక్కడ ఏమైనా దుష్ట శక్తులు ఉంటే వాటిని నరకానికి తరిమేస్తారు. అవి తిరిగి మన మీద దాడి చేయకుండా ఉండడానికి శ్రీ కార్తికేయుడు నరకలోక ద్వారాన్ని మూసివేస్తాడు.  

కావున కుడివైపు మూలాధార చక్రం ఎవరిలో అయితే బలంగా ఉంటుందో, వారు ఎడమవైపు దుష్ట శక్తుల బారిన పడకుండా ఉంటారు. ఆ విధంగా శ్రీ కార్తికేయుని ప్రభావం ఎడమవైపు ఇడా నాడి మీద కూడా ఉంటుంది. మానవులలో ఉండే మొండితనం, మూర్ఖత్వం, క్రూరత్వం, రాక్షసత్వం వంటి గుణాలు కుడివైపు మూలాధార చక్రాన్ని బలహీన పరుస్తాయి. మనలోని రాక్షస గుణాలు అంతం కావాలంటే మన అంతర్గత సూక్ష్మ శరీరంలో కార్తికేయుని స్థానమైన కుడి మూలాధార చక్రం బలంగా ఉండాలి.  
– డా. పి. రాకేశ్‌
(పరమపూజ్య మాతాజీ నిర్మలాదేవి ప్రసంగాలు, ప్రవచనాల ఆధారంగా...) 

(చదవండి: ఐదువారాల ఐశ్వర్య వ్రతం..మార్గశిర లక్ష్మీవార వ్రతం..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement