ఇటీవలి కాలంలో చిన్న పిల్లల్లో, ఇంకా చెప్పాలంటే చివరకు నవజాత శిశువుల్లో కూడా కిడ్నీ రాళ్ల సమస్య కనిపిస్తోంది. ప్రధానంగా కొంత పెద్ద పిల్లలు తగినంత నీళ్లు తాగకపోవడం, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు తీసుకోవడం లాంటివి ఇందుకు కారణాలవుతున్నాయి. మరీ చిన్నపిల్లల్లో అయితే మెటబాలిక్ కారణాల వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, ఊబకాయం, పర్యావరణ కారణాల వల్ల కూడా ఇవి ఏర్పడుతున్నాయి. ఆహారంలో ఉప్పు వాడకం, తీపి పానీయాలు తగ్గించాలి.
తాజాగా వరంగల్ ప్రాంతానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడికి ఎడమవైపు కిడ్నీ నిండా రాళ్లు ఏర్పడడంతో అతడిని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ)కు ఆ బాలుడిని తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యులు విజయవంతంగా మొత్తం రాళ్లన్నింటినీ తొలగించి, బాలుడికి ఊరట కల్పించారు. తొలుత ఆ అబ్బాయికి విపరీతమైన కడుపునొప్పి, జ్వరం ఉండడంతో అది కిడ్నీలో రాళ్ల సమస్యేనని గుర్తించి ఈ చికిత్స చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు, పిల్లల్లో కిడ్నీ రాళ్ల సమస్యల గురించి ఏఐఎన్‌యూకు చెందిన కన్సల్టెంట్ పీడియాట్రిక్, ట్రాన్సిషనల్ యూరాలజిస్ట్ డాక్టర్ పి.అశ్విన్ శేఖర్ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.
“బాలుడిని ఇక్కడకు తీసుకురాగానే సమస్యను గుర్తించి, పెర్‌క్యుటేనియస్ నెఫ్రో లితోటమీ (పీసీఎన్ఎల్) చేయాలని నిర్ణయించాం. ఇందులోభాగంగా వీపు భాగంలో చిన్న రంధ్రం చేసి, నెఫ్రోస్కోప్ ద్వారా కిడ్నీలోకి వెళ్లి ఎక్కువ నొప్పి లేకుండా రాళ్లను తొలగించాం. సంప్రదాయ శస్త్రచికిత్సల కంటే ఇందులో త్వరగా కోలుకుంటారు. దీనివల్ల ఆస్పత్రిలో ఉండాల్సిన సమయం తగ్గుతుంది.
కిడ్నీలో రాళ్ల సమస్య ఇంతకుముందు పెద్దవారిలోనే కనిపించేది. ఇప్పుడు పిల్లల్లో కూడా ఎక్కువగా వస్తోంది. ఎవరైనా సరే రోజూ తగినంత నీళ్లు తాగాలి. ఎన్ని తాగాం అన్నదాని కంటే, ఎంత మూత్రం వస్తోందన్నది ముఖ్యం. రోజుకు కనీసం లీటరున్నర మూత్రం పోయేలా నీళ్లు తాగాలి. అలా తాగకపోతే మూత్రం చిక్కబడుతుంది. అదే కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి సూచిక. పిల్లల్లో కిడ్నీరాళ్ల తొలగింపు చాలా జాగ్రత్తగా, కచ్చితత్వంతో చేయాలి. అత్యాధునిక టెక్నిక్‌లు ఉపయోగించడం ద్వారా ఈ కేసులో విజయం సాధించాం. ఇందులో ఒక పెద్దరాయి, మరికొన్ని చిన్నరాళ్లు అన్నింటినీ ఒకే సిటింగ్‌లో తొలగించాం. సాధారణంగా పెద్దరాళ్ల తొలగింపునకు 2-3 సిటింగ్‌లు అవసరం అవుతాయి. కానీ పీసీఎన్ఎల్ తరహాలో అయితే పెద్ద, సంక్లిష్టమైన రాళ్లనూ తొలగించగలం.
తెలంగాణలో కిడ్నీ రాళ్లు, కిడ్నీ వ్యాధులు ఎక్కువవుతున్నాయి. ఇది ప్రమాదకరంగా పెరుగుతోంది. ముఖ్యంగా వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం, నీళ్లు తాగినా చెమటరూపంలో పోవడంతో తగినంత మూత్రం విడుదల కాక ఈ సమస్య వస్తోంది. మన దేశంలోనే అత్యధికంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) కేసులు తెలంగాణలో 6.2% ఉన్నాయి. గడిచిన 15-20 ఏళ్లలో పిల్లలకు కిడ్నీల్లో రాళ్ల సమస్య రెట్టింపు నుంచి నాలుగు రెట్లు అయ్యింది.
పిల్లల్లో కిడ్నీ రాళ్లు ఏర్పడినప్పుడు.. నెల, రెండు నెలల తర్వాత మెటబాలిక్ సమస్యలేమైనా ఉన్నాయేమో పరీక్షించాలి. ఇందుకు 24 గంటల యూరిన్ మెటబాలిక్ పరీక్షలు, సీరం కెమిస్ట్రీలు చూసుకోవాలి. కొన్ని కేసుల్లో జన్యుపరమైన సమస్యల వల్ల ఇవి వస్తున్నాయి. చాలా వరకు మాత్రం నివారించదగ్గ కారణాలే ఉంటున్నందున మన జాగ్రత్తలు చాలాముఖ్యం” అని డాక్టర్ అశ్విన్ శేఖర్ వివరించారు.
(చదవండి: తక్కువ వ్యర్థాలతో హెల్దీ లైఫ్ ..! మాజీ ఇస్రో శాస్త్రవేత్త జీరో వేస్ట్ పాఠాలు)


