స్త్రీశక్తి అపారం.. సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి.. సూర్యాస్తమయం తర్వాత కూడా పనిచేస్తూ దేశాభివృద్ధి.. కుటుంబ సంక్షేమంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. పారిశుధ్య కార్మికురాలిగా.. ఉపాధికూలీగా.. ఉద్యోగిగా.. డాక్టర్‌గా.. అధికారిణిగా నిరంతరం శ్రమిస్తున్నారు. అమ్మగా.. భార్యగా.. బిడ్డగా ఇంటిని తీర్చిదిద్ది.. విధుల్లో అలుపన్నదే లేకుండా కష్టపడుతున్నారు. కాలంతో పోటీ పడుతూ అన్ని పాత్రలకు వన్నె తెస్తున్నారు. వేకువజాము మొదలు రాత్రి పడుకునే వరకు ఆమె కష్టపడుతున్న తీరుపై ఈ వారం సండే స్పెషల్..!!

పెద్దపల్లిలో కొడుకును పాఠశాలకు తీసుకెళ్తున్న తల్లి ప్రిన్సీ
తాముపడుతున్న కష్టం పిల్లలకు రావొద్దనుకుంటారు తల్లులు. ఉదయం 8 గంటలకు చిన్నపిల్లలైతే ఉగ్గుతినిపించి కడుపునింపుతున్నారు. స్కూల్‌కు వెళ్లే పిల్లలను తీసుకుని బడి‘బాట’పడుతున్నారు. అన్ని జాగ్రత్తలు చెప్పి వస్తున్నా రు. భర్తను ఆఫీసుకు పంపడం, అత్తమామలు, తల్లిదండ్రులకు సపర్యలు, ఇంటి పనుల్లో నిమగ్నమవుతున్నారు.

పెద్దపల్లిలో పారిశుధ్య పనులు చేస్తున్న చింతల రాజేశ్వరి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో నాలుగువేలకు పైగా మహిళా పారిశుధ్య కార్మికులున్నారు. నిత్యం ఉదయం 4 గంటల నుంచే విధుల్లో నిమగ్నమవుతున్నారు. విడతలవారీగా రహదారులు, వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు. మురికి కాలువలు శుభ్రం చేస్తున్నారు. చలికి, ఎండకు, వానకు తట్టుకుంటూ.. నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగాఉంచుతున్నారు.

పెద్దపల్లి శాంతినగర్‌లో పాలు పితికిన కనకలక్ష్మి
గ్రామాల్లో పాడిపరిశ్రమ, వ్యవ‘సాయం’లో మహిళలు ఎక్కువ భాగస్వాములవుతున్నారు. ఉదయం 5 గంటలకే పాడిపశువుల నుంచి పాలుపితకడం.. వ్యవసాయం చేసే మహిళలు తమ చేలలో పండిన కూరగాయలను మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. చిరువ్యాపారం చేసే వారు ఉదయాన్నే మార్కెట్‌కు వచ్చి విక్రయాలు ప్రారంభిస్తున్నారు. ఇంటి ఖర్చులు పోను.. ఆర్థికంగా బలపడుతున్నారు.

సిరిసిల్లలో ఉదయం 6గంటలకు విధుల్లో కండక్టర్ పిల్లి రోజారాణి
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలు ఎక్కువే ఉన్నారు. ఉదయం ఆరు గంటలకే ఫస్ట్ బస్ డ్యూటీ కోసం మహిళా కండక్టర్లు బయలుదేరుతారు. పొద్దంతా డ్యూటీ చేసి.. వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి అప్పగించి ఇంటికి చేరుతారు. ఉద్యోగ బాధ్యత పూర్తిచేసి కుటుంబానికి ఆసరాగా నిలుస్తారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సిబ్బంది ఉదయం ఆరు గంటలకే విధుల్లో ఉంటూ అత్యవసర సేవలు అందిస్తుంటారు.

పెద్దపల్లి: గురాంపల్లిలో కొడుక్కి స్నానం చేయిస్తున్న లావణ్య
వేకువజామునే పిల్లలను నిద్ర నుంచి లేపి పిల్లలకు స్నానం చేయిస్తా రు. 7 గంటల వరకే పాఠశాలకు సిద్ధం చేయిస్తారు. పిల్లలను స్నా నం మొదలు.. డ్రెస్.. జెడ ఇతర సపర్యలు చేస్తున్నంత సేపు బాగా చదువుకోవాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఉన్నతంగా ఎదగాలని పిల్లలకు హితబోధ చేస్తా రు. అల్పాహారం సిద్ధం చేస్తారు.

పెద్దపల్లిలో విధులకు వెళ్తున్న ప్రైవేటు టీచర్లు సుమలత, లత
కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చేందుకు పలువురు మహిళలు ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్నారు. ఉద యం 9 గంటలకు ప్రైవేటు, ప్రభు త్వ టీచర్లు, ఇతర ప్రైవేటు రంగా ల్లో పనిచేసే మహిళలు లంచ్ బాక్స్ పట్టుకొని చలో..చలో అంటూ కదులుతున్నారు. సాయంత్రం వరకు విధులు నిర్వహించి తిరిగి ఇంటి ముఖం పడుతున్నారు.

సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేస్తున్న డాక్టర్ లహరి
ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించేందుకు 10 గంటలకే విధులకు హాజరవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యాలయాల్లో విధుల్లో ప్రజాసేవలో తరిస్తున్నారు. అధికా రులు.. అర్జీదారులకు వారధిగా ఉంటూ.. ప్రభుత్వపాలనలో మహిళా ఉద్యోగులు భాగస్వాములు అవుతున్నారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటున్నారు.

పెద్దపల్లిలో పిల్లలకు లంచ్ రెడీ చేస్తున్న గాదాసు శైలజ
పిల్లలను స్కూళ్లకు పంపి, భర్తలను ఉద్యోగానికి పంపిస్తూ కాసేపైనా విశ్రాంతి తీసుకోకుండా మధ్యాహ్నం భోజన తయారీకి సన్నద్ధం అవుతుంటారు. కుటుంబ ఆరోగ్యమే లక్ష్యంగా పౌష్టికాహారాన్ని వండుతుంటారు. రుచికరమైన వంటలు చేసి.. పిల్లలకు, భర్తకు భోజనం తయారు చేస్తుంటారు. లంచ్ బాక్స్‌ల్లో వడ్డించుకుని.. పాఠశాలల్లో ఉన్న పిల్లలకు తీసుకెళ్తుంటారు.

పెద్దపల్లిలో పాఠశాలలో చిన్నారికి అన్నం తినిపిస్తున్న తల్లి
ఇంటి పని మొత్తం పూర్తి చేసుకుని.. పిల్లలకు లంచ్‌బాక్సులు రెడీ చేసుకుని పాఠశాలలకు వెళ్తుంటారు. అక్కడ చిన్నారులకు గోరుముద్దలు తినిపించుకుంటూ.. తరగతి గదుల్లో చెప్పిన పాఠాలను తెలుసుకుంటారు. గ్రామాల్లో వ్యవసాయకూలీలు పొలం పనుల్లో నిమగ్నమవుతూ.. పాటలు పాడుతూ సరదాగా సాగుతుంటారు.

పెద్దపల్లిలో రాత్రివే చలి మంట కాగుతూ..
పొద్దంతా కష్టపడి.. అలిసిపోయి.. కుటుంబసభ్యులతో కాసేపు సరదాగా గడుపుతుంటారు. రాత్రి తినేందుకు వంట సిద్ధం చేస్తుంటారు. ఆరోజు మిగిలిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. రోజూవారి కార్యక్రమాలు, కుటుంబ పరిస్థితి, అవసరాలు, ఆచరణలపై భర్త, ఇంటి పెద్దలతో చర్చిస్తుంటారు.

పెద్దపల్లి మహిళా పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో ఎస్సై అక్కల రాజమణి
గృహిణులు తమ పిల్లలను పాఠశాల నుంచి ఇంటికి తీసుకొస్తుంటారు. హోంవర్క్ చేయిస్తూ.. అనుమానాలు నివృత్తి చేస్తూ టీచర్‌గా మారుతుంటూరు. పొ లం పనులకు వెళ్లినవారు చేలలో బిజీబిజీగా ఉంటారు. కొందరు అత్యవసర సేవల్లో పనిచేసే మహిళలు సమయంతో పనిలేకుండా ముందుకు సాగుతుంటారు.

కొడుకు కూతురు శాన్వి, ఫర్నీత్‌లను నిద్రపుచ్చుతున్న తల్లి భైరి సుధ
చిన్నారులు.. కుటుంబసభ్యులకు భోజనాలు వడ్డించి మిగిలిపోయిన పనులు పూర్తిచేసుకుంటారు. రేపటి కోసం అవసరమైన పనులు సిద్ధం చేసుకుంటారు. చిన్నారులను లాలించి, నిద్రబుచ్చుతారు. కుటుంబ క్షేమమే తమ బాధ్యతగా ముందుకు సాగుతూ.. రోజంతా కష్టపడే మహిళలు.. ఆ ఇంట్లోని వారు అందరూ నిద్రపోయిన తరువాత విశ్రాంతి తీసుకుంటారు.
ఫొటోలు: సాక్షి, ఫొటోగ్రాఫర్లు పెద్దపల్లి/రాజన్న సిరిసిల్ల


