కొత్త వస్తువులు చూస్తే కొనకుండా ఉండలేకపోతున్నాను! | Health Tips: Understanding Compulsive Shopping Disorder | Sakshi
Sakshi News home page

కొత్త వస్తువులు చూస్తే కొనకుండా ఉండలేకపోతున్నాను!

Nov 27 2025 11:02 AM | Updated on Nov 27 2025 11:02 AM

Health Tips: Understanding Compulsive Shopping Disorder

నాకు చిన్నప్పటి నుంచి ఏ కొత్త వస్తువు చూసినా, కొనాలన్న ఆశ ఎక్కువ. స్కూలు రోజుల్లో రకరకాల పెన్నులు, ప్రతీ సంవత్సరం రెండు మూడు స్కూల్‌ బ్యాగులు, చెప్పులు, షూస్‌ కొనేవాడిని. తర్వాత నా ఆసక్తి బట్టలు మీదకు మళ్ళింది. మార్కెట్‌లోకి కొత్త రకం డ్రెస్‌లు వచ్చినప్పుడల్లా కొనమని పట్టుబట్టేవాణ్ణి. కొనక΄ోతే అలిగి అన్నం తినడం మానేసేవాడిని.   తర్వాత నా మోజు సైకిళ్ళ మీకికి తిరిగింది. టీవీలో కొత్త మోడల్‌ సైకిల్‌ కనిపించగానే పాత సైకిల్‌ అమ్మేసి కొత్తదాన్ని కొనేవాడిని. 

కాలేజి రోజుల్లో ప్రతి నెలా ఫోన్‌ మార్చేవాడిని, డిగ్రీ పూర్తయ్యాక బైకులు నాకొత్త వ్యసనం అయ్యాయి. మార్కెట్‌ లో కొత్త బైక్‌ విడుదలయితే నా పాత బైక్‌ తక్కువ ధరకే అమ్మేసి అప్పు తీసుకొని మరీ కొత్త బైక్‌ కొనేవాడిని. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆఫర్స్, డీల్స్‌ కోసం వెతకడం, నియంత్రణ లేకుండా ఖర్చు చేయడం చేస్తున్నాను. ఇలా కొన్న వాటిని తక్కువ ధరకు అమ్మి మళ్లీ కొత్త వస్తువులు కౌంటున్నాను. దీనివలన డబ్బులు కోల్పోతున్నాను. ఇంట్లో భార్యతో గొడవలు, మనశ్శాంతి కూడా ఉండడం లేదు. ఈ అలవాటుని ఎలా మార్చుకోవాలి? 
– శ్యామ్‌ సుందర్, గోదావరిఖని

మీరు చెప్పిన లక్షణాలన్నీ ‘కంపల్సివ్‌ బైయింగ్‌ డిజార్డర్‌’ అనే మానసిక సమస్యకు దగ్గరలో ఉన్నాయి. ఇది ‘ఇంపల్సివ్‌ కంట్రోల్‌ డిజార్డర్‌’అనే మానసిక వ్యాధుల కేటగిరీలోకి వస్తుంది. దీనిలో ఏదో ఒక విషయం మీద విపరీతమైన తపన ఉంటుంది. ఆ పని చేసేదాకా మనసులో నిలకడ ఉండదు. ఎప్పుడూ అనే ఆలోచనలే ఉంటాయి. ఆ పని చేయగానే ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. దీనివలన నష్టం జరిగినప్పుడు తర్వాత బాధపడుతూ ఉంటాము. 

అది షాపింగ్‌ అవ్వొచ్చు, జూదం అనొచ్చు, ఎక్కువగా సెక్స్‌ ఆలోచనలు రావడం కావచ్చు లేదా అతిగాని తినాలనే ఆరాటం కావచ్చు. వీటన్నింటిలో ‘డోపమైన్‌‘ అనే రసాయనం స్థాయి పెరుగుతుంది. దానివలన తాత్కాలికంగా చాలా ఆనందం కలుగుతుంది. ఒక్కసారి డోపమైన్‌ స్థాయి తగ్గితే మళ్ళీ ఆ పని చేస్తేనే ఆ రసాయనం పెరిగి ఆనందం కలుగుతుంది. క్రమేణా ఇదొక వ్యసనం లాగా మారుతుంది. చాలా మంది ఆల్కహాల్, ఇతర డ్రగ్స్‌ కి బానిసలా అవడం వెనుక కూడా ఇదే మెకానిజం ఉంటుంది. 

ఇక మీ సమస్య విషయానికి వస్తే ‘కంపల్సివ్‌ బైయింగ్‌ డిజార్డర్‌కు ఖచ్చిత మైన మందులు లేనప్పటికీ ‘యాంటీ డిప్రెసెంట్‌‘ ‘యాంటీ క్రేవింగ్‌’ మందులు వాడి కొంత వరకు మీ ప్రవర్తనని అదుపు చేయవచ్చు. దానితోపాటు సైకోథెరపీ, మారైటల్‌ థెరపీ కూడా ఉపయోగ పడుతుంది. ఎవరో చెప్పినట్లు ఆఫర్‌లో కొంటే 50 శాతం డబ్బులు మిగులుతాయి. అసలు ఆఫర్లకి దూరంగా ఉంటే 100 శాతం మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి కదా... మీరు దిగులు చెందకుండా వెంటనే మంచి సైకియాట్రిస్టుని కలవండి. అన్నీ కుదుట పడతాయి.
(డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com)

(చదవండి: సమయం ఆసన్నమైంది మిత్రమా..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement