బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లల్లో పెరుగుతున్న ఉబకాయాన్ని అరికట్టేందుకు నడుం బిగించింది. బాల్యంలో ఉబకాయం రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు కఠిన నియమాన్ని అమల్లోకి తెచ్చింది. రాత్రి 9 గంటల వరకు టీవీ, ఆన్‌లైన్‌లో జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం విధించింది. ఈ రూల్‌తో పిల్లలను ఉబకాయం నుంచి బయటపడేలా దోహదం చేస్తుందని బ్రిటీష్ ప్రభుత్వం భావిస్తోంది. సోమవారం నుంచే ఈ కొత్త రూల్‌ను అమల్లోకి తీసుకొచ్చింది.
తక్కువ పోషకాహార ఆహారాలు, చక్కెర పానీయాల ప్రకటనలను నిషేధించడం వల్ల ప్రతి సంవత్సరం పిల్లల ఆహారంలో సుమారు 7.2 బిలియన్ కేలరీలు తగ్గుతాయని ఆరోగ్య, సామాజిక సంరక్షణ విభాగం (DHSC) తెలిపింది. దీని వలన ఊబకాయం బారిన పడే పిల్లల సంఖ్య సుమారు 20 వేల వరకు తగ్గుతుందని అభిప్రాయపడింది. దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రభుత్వ జాతీయ ఆరోగ్య సేవ (NHS)కు సుమారు 2 బిలియన్ పౌండ్ల ప్రయోజనం చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.
రాత్రి 9 గంటల వరకు జంక్ ఫుడ్ ప్రకటనలను పరిమితం చేయడం, ఆన్‌లైన్‌లో చెల్లింపు ప్రకటనలను నిషేధించడం వల్ల పిల్లలు, తల్లిదండ్రులను అనారోగ్యకరమైన ఆహారం నుంచి రక్షించవచ్చని భావిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మరింత సులభతరం అవుతుందని యూకే ఆరోగ్య మంత్రి ఆష్లే డాల్టన్ అన్నారు. వ్యాధులకు చికిత్స చేయడం కంటే.. వాటిని నివారించడంపై దృష్టి పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తద్వారా ప్రజలు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారని తెలిపారు. జంక్‌ఫుడ్ ప్రకటనలు పిల్లల ఆహారపు అలవాట్లను ప్రభావితం చేస్తాయని వెల్లడించారు.
జంక్ ఫుడ్ తినడం వల్ల చిన్న వయస్సులోనే ఊబకాయంతో పాటు సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశముందని బ్రిటన్ అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారిక గణాంకాల ప్రకారం ఇంగ్లాండ్‌లో 22.1 శాతం మంది పిల్లలు ప్రాథమిక పాఠశాల నుంచే అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య 35.8 శాతానికి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూకేలో ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఆసుపత్రిలో చేరడానికి దంత క్షయం ప్రధాన కారణమని అన్నారు. తాజాగా విధించిన ఆంక్షలు పిల్లలను అత్యంత హానికరమైన ప్రకటనల నుంచి రక్షించడంలో సహాయపడతాయని ఒబేసిటీ హెల్త్ అలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరీన్ జెన్నర్ అన్నారు.
ఇప్పటివరకు ఆరోగ్యకరమైన తరాన్ని సృష్టించడం ప్రభుత్వ లక్ష్యమని.. ఈ విధానం ఊబకాయం సంబంధిత వ్యాధులను నివారించడానికి విస్తృత ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన భాగమని ఆమె అన్నారు. ఇది మరింత ప్రభావవంతంగా ఉండేలా చూసుకోవడానికి రాబోయే రోజుల్లో నిబంధనలు బలోపేతం చేయడం చాలా అవసరమని తెలిపారు.


