క్లీన్‌ ఎనర్జీ స్టార్స్‌..! | Women eco-entrepreneurs with clean energy startups | Sakshi
Sakshi News home page

పర్యావరణ స్ఫూర్తి: క్లీన్‌ ఎనర్జీ స్టార్స్‌..!

Nov 27 2025 11:23 AM | Updated on Nov 27 2025 12:22 PM

Women eco-entrepreneurs with clean energy startups

వ్యాపారం ద్వారా లాభం పొందాలి...అలాగే పర్యావరణానికి, సమాజానికి మేలు చేకూర్చాలి. ఈ రెండు విధానాలను వ్యాపారంలో చేర్చడం పెద్ద సవాల్‌. పర్యావరణహిత వ్యాపారాలు చేస్తూ  ఎకో ఎంట్రప్రెన్యూర్‌లుగా రాణిస్తున్నారు నేటి మహిళలు. క్లీన్‌ ఎనర్జీ స్టార్టప్స్‌తో దేశంలోనే ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు: ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.  

రియా మజుందార్‌ సింఘాల్‌
భారతదేశంలోని మొట్టమొదటి, అతిపెద్ద స్థిరమైన ప్యాకేజింగ్‌ కంపెనీ అయిన ‘ఎకోవేర్‌ సొల్యూషన్స్‌’ వ్యవస్థాపకురాలు రియా మంజుదార్‌ సింఘాల్‌. ముంబయ్‌వాసి అయిన రియా బయోడిగ్రేడబుల్‌ వస్తువులను తయారుచేస్తుంది. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత నారీ శక్తి పురస్కారం అందుకుంది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో యంగ్‌ గ్లోబల్‌ లీడర్, ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌– క్లీన్‌ ఎయిర్‌ జాతీయ కమిటీ సభ్యురాలు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో చదువుకున్న రియా భారతదేశంలో ప్లాస్టిక్‌ ముప్పును పరిహరించే ఏకైక లక్ష్యంతో ‘ఎకోవేర్‌ సొల్యూషన్స్‌’ను స్థాపించింది. 

ప్లాస్టిక్‌ను పూర్తిగా కంపోస్ట్‌ చేయగల ప్రత్యామ్నాయాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఫుడ్‌ ప్యాకేజింగ్‌ పరిశ్రమను బ్రేక్‌ చేసింది. వ్యవసాయ పంటల వ్యర్థాల నుండి ఎకోవేర్‌ తయారవుతుంది. వాయు కాలుష్యాన్ని నివారిస్తుంది. భారతదేశంలో అతిపెద్ద ఫుడ్‌ సర్వీస్‌ ఆపరేటర్‌ అయిన ఇండియన్‌ రైల్వేలను ఎకోవేర్‌ బయోడిగ్రేడబుల్స్‌ ట్రేలకు మారేలా ఒప్పించడం రియా సాధించిన గొప్ప విజయాలలో ఒకటి.  

అజైతా షా
గ్రామీణ భారతావనిలోని ఇళ్లకు అధిక నాణ్యత, స్వచ్ఛమైన శక్తితో నడిచే సౌర దీపాలు, కుకింగ్‌ స్టౌలు.. వంటి ఉపకరణాలను అందించడానికి ‘ఫ్రాంటియర్‌ మార్కెట్స్‌(క్లీన్‌ ఎనర్జీ)’ను స్థాపించింది. మహిళా వ్యవస్థాపకుల నెట్‌వర్క్‌ ద్వారా అమ్మకాలు, సేవలను కొనసాగిస్తుంది. అజైతా క్లీన్‌ ఎనర్జీ యాక్సెస్‌ ప్రపంచానికి కొత్తేమీ కాదు, ఫ్రంటియర్‌ మార్కెట్స్‌కు ముందు భారతదేశం అంతటా 10,000కు పైగా గ్రామాల్లో 13 లక్షలకు పైగా మహిళలకు సేవలందిస్తూ, ఏడేళ్లుగా మైక్రోఫైనాన్స్‌ రంగంలో పనిచేశారు.

గ్రామాల్లో సరైన విద్యుత్తు అందుబాటులో లేదన్న వాస్తవాన్ని అర్థం చేసుకొని ఫ్రాంటియర్‌ మార్కెట్లను ప్రారంభించింది. గ్రామీణ కుటుంబాలకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ క్లీన్‌ ఎనర్జీ వినియోగదారులలో 70 శాతం  మహిళలే ఉన్నారు. 

నీలిమా మిశ్రా
ఒడిశాలోని భువనేశ్వర్‌లో వ్యర్థాల నిర్వహణ రంగంలో ఒక విప్లవాత్మక స్టార్టప్‌ ద్వారా సంచలనం సృష్టిస్తోంది. పర్యావరణ స్పృహ కలిగిన నీలిమా రబీ నారాయణ్‌ మిశ్రా స్థాపించిన ‘సీబా గ్రీన్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సస్టెయినబిలిటీలో ఒక ఉద్యమం. పర్యావరణ పరిరక్షణకు అంకితమైన ఈ స్టార్టప్‌ ఐక్యరాజ్య సమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో ఒకటిగా చేర్చింది. 

2019లో నెలకొల్పిన ఈ స్టార్టప్‌ తన అనుభవాలనుండి పుట్టుకువచ్చిందని చెబుతుంది నీలిమా మిశ్రా. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం నుండి పట్టాలు పొందిన నీలిమ‘సీబా గ్రీన్‌’ ద్వారా వ్యర్థాల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. వ్యర్థాలను సేకరించడం, సేంద్రీయ వ్యర్థాలను విలువైన కం΄ోస్ట్‌గా మార్చడం, రీ సైక్లింగ్‌ను సులభతరం చేస్తూ పరిశుభ్రమైన నగరాలకు ఊపిరి ఊదుతుంది.

ఆర్తి రాణా తరు  
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరి జిల్లాకు చెందిన ఆర్తి రాణా తరు 350 స్వయం సహాయక సంఘాలలోని పదివేల మంది మహిళల ద్వారా చేత చేనేత ఉత్పత్తులను తయారు చేయిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచింది. ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్, వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ వంటి సంస్థల మద్దతుతో ఆరేడేళ్లలో వేల మందికి చేరువయ్యింది ఆర్తి. 

మొదట ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానాలో సాధారణంగా కనిపించే పొడవైన, దృఢమైన గడ్డితో బుట్టలు, పెన్‌ స్టాండ్‌లను తయారు చేశారు. ఇవి వారి చేనేత వస్త్రాలతో పాటు ట్రైబల్‌ కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిబిషన్‌లో ప్రజాదరణ పొందాయి. సస్టెయినబిలిటీ సాధించడం, మహిళల్లో స్వావలంబనను ప్రోత్సహించడంలో ఆర్తి రాణా 2020లో నారీ శక్తి పురస్కార్‌తో పాటు మరెన్నో సత్కారాలూ అందుకుంది.

(చదవండి: కొత్త వస్తువులు చూస్తే కొనకుండా ఉండలేకపోతున్నాను!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement