సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని మహిళా ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని, కొన్ని మీడియా సంస్థలు సాగిస్తున్న అసత్య ప్రచారాలపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రస్థాయిలో మండిపడింది. మహిళా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని సంఘం ఆరోపించింది. ఈ విషయంలో ఐఏఎస్ అధికారుల సంఘానికి తమ సంపూర్ణ సంఘీభావాన్ని ఐపీఎస్ అసోసియేషన్ ప్రకటించింది. నిరాధారమైన ఆరోపణలతో ప్రభుత్వ అధికారుల ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించింది.
ఐపీఎస్ అసోసియేషన్ అధ్యక్షుడు డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఇతర సభ్యులు ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. మహిళా అధికారులు ఎంతో చిత్తశుద్ధి కలిగి, ధైర్యంతో, వృత్తి నైపుణ్యంతో సమాజం కోసం విధులు నిర్వర్తిస్తున్నారని, వారిపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తాయని అసోసియేషన్ ఆ ప్రకటనలో పేర్కొంది.
సదరు మీడియా సంస్థలు తక్షణమే తమ తప్పును సరిదిద్దుకోవాలని ఐపీఎస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. చేసిన తప్పును అంగీకరిస్తూ, బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలోని అభ్యంతరకర కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన మీడియా, మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికింది. ఇటువంటి అసత్య ప్రచారాలను ఇకపై ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: చలికి గడ్డకట్టిన ఢిల్లీ.. స్థంభించిన జనజీవనం


