న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని చలి గడ్డకట్టిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రత 4.6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో ఈ సీజన్‌లోనే శనివారం అత్యంత చలి రోజుగా నమోదైంది. తీవ్రమైన చలి గాలుల దృష్ట్యా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. రానున్న రోజుల్లో ఆకాశం నిర్మలంగా ఉన్నప్పటికీ, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.6 నుండి 3.0 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 16-18 డిగ్రీల మధ్య ఉండవచ్చని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మంచు దుప్పటిలో విమానాశ్రయం
తీవ్రమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) వద్ద శనివారం ఉదయం దృశ్యమానత (Visibility) కేవలం 200 మీటర్లకు పడిపోయింది. ఉదయం 7 గంటల సమయంలో విమానాశ్రయంలో 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భారత దేశమంతటా ఈ వారం పొగమంచు ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలలో కూడా తీవ్రమైన చలి పరిస్థితులు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
#WATCH | Delhi | People take refuge in night shelter homes as cold wave continues to grip the national capital.
(Visuals from night shelter home in Lodhi Road area) pic.twitter.com/EpMxTWUuxf— ANI (@ANI) January 9, 2026
ఊపిరి సలపని వాయుకాలుష్యం
గత డిసెంబర్ నెలలో 5.6, 5.7 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రతలే ఇప్పటివరకు కనిష్టంగా ఉండగా, తాజాగా నమోదైన ఉష్ణోగ్రతలు వాటిని అధిగమించాయి. ఒకవైపు చలి పులి వణికిస్తుంటే, మరోవైపు వాయు కాలుష్యం ఢిల్లీ ప్రజలకు ఊపిరి సలపనివ్వడం లేదు. శనివారం నాటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 361గా నమోదై ‘చాలా అధ్వాన్నం’ (Very Poor) విభాగంలో కొనసాగుతోంది. ముఖ్యంగా నెహ్రూ నగర్ ప్రాంతంలో ఏక్యూఐ 426కు చేరుకోవడంతో అక్కడ పరిస్థితి ‘అత్యంత తీవ్రం’ (Severe) గా మారింది. ఆనంద్ విహార్, వివేక్ విహార్, ద్వారక, సిరిఫోర్ట్ తదితర ప్రాంతాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఢిల్లీలోని మొత్తం 39 మానిటరింగ్ స్టేషన్లలో 33 చోట్ల గాలి నాణ్యత అత్యంత పేలవంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
కాలుష్య కారకాలివే..
ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యానికి గల కారణాలను పుణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం) విశ్లేషించింది. ఆ గణాంకాల ప్రకారం నగర కాలుష్యంలో 16.9 శాతం వాటా వాహనాల ఉద్గారాలదేనని తేలింది. దీని తర్వాత ఢిల్లీ పరిసరాల్లోని పరిశ్రమల ద్వారా 13.1 శాతం, గృహాల నుండి వచ్చే ఉద్గారాల వల్ల 4.3 శాతం కాలుష్యం చేరుతోంది. వీటితో పాటు వ్యర్థాల దహనం (1.6%), నిర్మాణ పనులు (2.1%), రోడ్లపై దుమ్ము (1.1%) కూడా గాలి నాణ్యత క్షీణించడానికి కారణమవుతున్నాయి.
ఇది కూడా చదవండి: విద్యుత్ విప్లవం: వేలాడే వైర్లు.. భయపెట్టే ట్రాన్స్‌మీటర్లు కనుమరుగు


