ప్రస్తుత ఆధునిక కాలంలో మనమంతా ప్రతీ పనికి, అవసరానికి విద్యుత్తుపైననే ఆధారపడుతున్నాం. అయితే ఆ విద్యుత్తును అందుకునేందుకు మనం వాడే వైర్లు, ప్లగ్‌లు మనకు చాలాసార్లు చికాకు కలిగిస్తుంటాయి. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు అద్భుత ప్రయోగాలు చేస్తున్నారు. వైఫై (Wi-Fi) ద్వారా డేటా ఏవిధంగా గాలిలో ప్రయాణిస్తుందో, అదే తరహాలో విద్యుత్తును కూడా వైర్లు లేకుండా సరఫరా చేసే సాంకేతికతను వారు అభివృద్ధి చేస్తున్నారు.
గాలి ద్వారా ప్రసారం
ఈ వైఫై తరహా విద్యుత్ ప్రాజెక్టులో ఫిన్లాండ్‌లోని ప్రఖ్యాత ‘ఆల్టో యూనివర్సిటీ’ కీలక పాత్ర పోషిస్తోంది. విద్యుదయస్కాంత క్షేత్రాలు (Electromagnetic Fields),‘రిజోనెంట్ కప్లింగ్’ అనే సాంకేతికతను ఉపయోగించి, గాలి ద్వారా విద్యుత్తును పంపవచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు నిరూపించారు. దశాబ్దాల క్రితం నికోలా టెస్లా కలలుగన్న ఈ వైర్లెస్ విద్యుత్ కల, ఇప్పుడు ఫిన్లాండ్ శాస్త్రవేత్తల కృషితో సాకారం కానుంది.
తక్కువ దూరాల్లో సమర్థవంతం
ఆల్టో యూనివర్సిటీ గతంలోనే మ్యాగ్నెటిక్ లూప్ యాంటెన్నాల ద్వారా విద్యుత్ ప్రసారంపై ప్రయోగాలు చేసి విజయం సాధించింది. ఈ యాంటెన్నాల మధ్య ఏర్పడే శక్తివంతమైన ఐస్కాంత క్షేత్రం ద్వారా శక్తి ఒక చోటు నుండి మరో చోటుకు సులభంగా చేరుకుంటుందని గ్రహించారు. దీనివల్ల విద్యుత్ నష్టం (Energy Loss) చాలా తక్కువగా ఉంటుందని, తక్కువ దూరాల్లో ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ప్రయోగాత్మక దశను దాటి..
ఇటీవల సోషల్ మీడియాలోను, అంతర్జాతీయ టెక్ వేదికలపై ఫిన్నిష్ శాస్త్రవేత్తలు కొన్ని వీడియోలను విడుదల చేశారు. ఇందులో ఎటువంటి వైర్ల సాయం లేకుండానే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, బల్బులు, సెన్సార్లు పనిచేయడాన్ని గమనించారు. ఇది కేవలం ల్యాబ్ వరకే పరిమితం కాకుండా, ప్రయోగాత్మక దశ నుంచి ఆచరణాత్మక దశకు చేరుకుంటున్నదనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.
పరిశోధనలు ముమ్మరం
అయితే ఈ సాంకేతికత ఇప్పుడున్న విద్యుత్ వైర్ల వ్యవస్థను ఇప్పటికిప్పుడే పూర్తిగా తొలగించలేదు. ప్రస్తుతం ఈ పద్ధతి కేవలం తక్కువ దూరాలకే పరిమితమైవుంది. ట్రాన్స్‌మీటర్ - రిసీవర్ మధ్య దూరం పెరిగే కొద్దీ విద్యుత్ ప్రసార సామర్థ్యం తగ్గిపోతుంది. దీనిని అధిగమించి, సుదూర ప్రాంతాలకు విద్యుత్తును పంపడంపై ప్రస్తుతం ఫిన్లాండ్‌లో పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి.
మనిషి ఆరోగ్యంపై ప్రభావం?
గాలిలో విద్యుత్ ప్రసారం చేయడం వల్ల మనుషులకు ఏమైనా ప్రమాదం ఉంటుందా? అనే కోణంలో కూడా ఆల్టో విశ్వవిద్యాలయ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. మానవ కణజాలం ఈ తరంగాలకు ఎలా స్పందిస్తుందనే దానిని వారు పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఇది సురక్షితమని తేలితే, గుండెకు అమర్చే ‘పేస్ మేకర్’ వంటి వైద్య పరికరాలకు సైతం ఆపరేషన్ అవసరం లేకుండానే బయట నుండే వైర్లెస్ పద్ధతిలో ఛార్జ్ చేయవచ్చు.
గ్రిడ్ వ్యవస్థకు తోడుగా..
భారీ స్థాయిలో విద్యుత్తును ఒక నగరం నుండి మరో నగరానికి పంపడానికి ప్రస్తుతం, విద్యుత్ గ్రిడ్ వ్యవస్థను, వైర్లను వినియోగిస్తున్నాం. వైర్లెస్ విద్యుత్ అనేది ప్రస్తుతానికి సంప్రదాయ వ్యవస్థకు ప్రత్యామ్నాయం కాదు. కానీ ఒక అద్భుతమైన అదనపు వెసులుబాటు అని చెప్పిడంతో సందేహం లేదు. భవిష్యత్తులో మొబైల్ ఫోన్లు, రోబోట్లు, ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి ఇది ఒక వరంగా మారనుంది.
భవిష్యత్‌లో అందుబాటులోకి..
పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ వైర్లెస్ విద్యుత్ సాంకేతికత సాధారణ ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరికొన్ని ఏళ్ల సమయం పట్టనుంది. ప్రభుత్వాల నుండి అనుమతులు, భద్రతా ప్రమాణాలు, ఖర్చు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఫిన్లాండ్ చేస్తున్న ఈ ప్రయోగాలు భవిష్యత్‌లో మన జీవనశైలిని మరింత సులభతరం చేస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఇది కూడా చదవండి: పాక్‌లో హమాస్ - లష్కరే భేటీ.. వీడియో వైరల్


