న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించడంలో ముందు వరుసలో ఉందనే పేరుపొందిన పాకిస్తాన్ గడ్డపై తాజాగా మరో ప్రమాదకర పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ హమాస్, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కమాండర్ల మధ్య జరిగిన భేటీ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది.
పాలస్తీనాకు చెందిన హమాస్ గ్రూపు, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే ఉగ్రవాదులు తమ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నట్లు ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్ కేంద్రంగా ఏర్పడిన ఈ కూటమి భవిష్యత్తులో అంతర్జాతీయ భద్రతకు పెను సవాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌లోని గుజ్రన్ వాలాలో లష్కరే తోయిబాకు చెందిన ‘పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్’ (పీఎంఎంఎల్) నిర్వహించిన ఒక కార్యక్రమంలో హమాస్ సీనియర్ కమాండర్ నజీ జహీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లష్కరే కమాండర్ రషీద్ అలీ సంధుతో ఆయన సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి రావడంతో ఈ ఉగ్ర ముఠాల మధ్య ఉన్న సంబంధాలు బహిర్గతమయ్యాయి.
Senior Hamas commander attended Lashkar terrorist function as Chief guest in Gujranwala, Pakistan
Israel will be watching this 😎 pic.twitter.com/kuTKF0zHpP— Megh Updates 🚨™ (@MeghUpdates) January 7, 2026
హమాస్ నేత నజీ జహీర్‌కు పాకిస్తాన్‌తో ఉన్న సంబంధాలు ఈనాటికి కావు.. 2025, ఫిబ్రవరిలో పహల్గాం ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు ఆయన పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించి, లష్కరే, జైషే మొహమ్మద్ కమాండర్లతో కలిసి భారత వ్యతిరేక ర్యాలీలో ప్రసంగించారు. అంతకుముందు 2024 జనవరిలో కరాచీ ప్రెస్ క్లబ్‌లో ప్రసంగించారు. ఇస్లామాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ నుంచి సన్మానం కూడా అందుకున్నారు. ఈ ఉగ్ర ముఠాల ఐక్యత మరింతగా ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


