ట్రంప్ ప్రకటనపై యూరప్ దేశాల నేతల స్పందన
లండన్: గ్రీన్‌లాండ్ స్వాధీన ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామనే కారణంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమపై టారిఫ్‌లను ప్రకటించడాన్ని యూరప్ దేశాల నేతలు ఖండించారు. ట్రంప్ ప్రభుత్వ వైఖరిని డెన్మార్క్, యూకే, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ తప్పుబట్టారు. ‘గ్రీన్‌లాండ్ విషయంలో మా వైఖరి సుస్పష్టం. ఆ ప్రాంతం డెన్మార్క్ సామ్రాజ్యంలోనిదే. దాని భవిష్యత్తును నిర్ణయించాల్సింది డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రజలు మాత్రమే’ అని వారు పేర్కొన్నారు.
‘టారిఫ్ హెచ్చరికలు అట్లాంటిక్ దేశాల మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీస్తాయి. ప్రమాదకరమైన పరిణామాలకు దారితీసే ప్రమాదముంది. యూరప్, అమెరికా మధ్య ఉండాల్సిన సహకారంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నాం’ అని వారు పేర్కొన్నారు. ఆర్కిటిక్ ప్రాంత రక్షణ మొత్తం నాటో కూటమికి కీలకమైన అంశం. ఆర్కిటిక్‌లోని వివిధ ప్రాంతాలకు రష్యా నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవడానికి మిత్రదేశాలన్నీ కలిసి మరిన్ని చర్యలు చేపట్టాలి.
నాటో మిత్రదేశాల సమష్టి భద్రత కోసం కృషి చేస్తున్న మిత్రపక్షాలపైనే టారిఫ్‌లు విధించడం పూర్తిగా తప్పు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వంతో నేరుగా చర్చిస్తాం’ అని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ట్రంప్ బెదిరింపులకు తాము లొంగబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ స్పష్టం చేయగా యూరప్ మిత్ర దేశాలను ట్రంప్ బ్లాక్ మెయిల్ చేయడం సరికాదని స్వీడన్ ప్రధాని క్రిస్టెర్సన్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఉమ్మడి స్పందన కోసం నార్వే, స్వీడన్, యూకేలతో తీవ్రంగా చర్చిస్తున్నామన్నారు.
ఈ విషయంలో సంయమనంతో వ్యవహరించాలని, వాణిజ్య ఉద్రిక్తతలను మరింత ముదిరేలా వ్యవహరించరాదని నార్వే ప్రధాని జొనాస్ పేర్కొన్నారు. ఇది ఎవరికీ మంచిదికాదన్నారు. గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికా ప్రయత్నాలకు అడ్డు చెబుతున్న డెన్మార్క్, యూకే, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ ఉత్పత్తులపై ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 10 శాతం టారిఫ్‌లు వసూలు చేస్తామని ట్రంప్ తాజాగా ప్రకటించారు. గ్రీన్‌లాండ్‌పై ఈ దేశాలు తమతో ఒక అంగీకారానికి రాని పక్షంలో జూన్ నుంచి టారిఫ్‌లను 25 శాతానికి పెంచుతామని ఆయన హెచ్చరించడం తెల్సిందే.


