1991లో అతడి సొంత సర్వీస్ రివాల్వర్‌తోనే 14సార్లు కాల్చిన దోషి
ఫ్లోరిడా జైలులో శిక్ష అమలు
స్టార్క్(యూఎస్‌ఏ): ఓ పోలీస్ అధికారిని అతడి సొంత సర్వీస్ రివాల్వర్‌తో ఏకంగా 14సార్లు కాల్చి మరణానికి కారకుడైన వ్యక్తికి మంగళవారం సాయంత్రం ఫ్లోరిడా జైలులో మరణ శిక్ష అమలు చేశారు. స్టార్క్ సమీపంలోని ఫ్లోరిడా స్టేట్ ప్రిజన్‌లో సాయంత్రం 6 గంటలకు దోషి అయిన బిల్లీ లియోన్ కీర్స్(53)కు మూడు ఇంజెక్షన్ల ద్వారా ఈ శిక్షను అమలు చేశారు. చివరి కోరిక తెలపాలని జైలు వార్డెన్ కోరగా..‘మృతుడు డానీ పారిష్ కుటుంబం నుంచి క్షమాపణలు మాత్రమే కోరుతున్నాను. ఇంతకు మించి వారికి తిరిగి ఏమీ ఇవ్వలేను’అని పేర్కొన్నాడు.
ఆ సమయంలో మరణ శిక్ష అమలును చూసేందుకు కుటుంబీకులు, అధికారులు కలిపి అక్కడ 15 మంది వరకు ఉన్నారు. బిల్లీ లియోన్ కీర్స్ 1991 జనవరిలో ఓ రోజు కారులో వెళ్తుండగా ఫోర్ట్ పియర్స్ పోలీసు అధికారి డానీ పారిష్ అతడిని ఆపారు. ఆ సమయంలో అతడు రాంగ్ రూట్‌లో వెళ్తున్నాడు. పైపెచ్చు అతడి వద్ద డ్రైవింగ్ లైసెన్సు లేదు. దీంతో, అతడికి బయటకు రప్పించి, చేతులకు బేడీలు వేసేందుకు యత్నించగా పెనుగులాట జరిగింది.
అదను చూసుకుని పారిష్ వద్ద ఉన్న సర్వీసు రివాల్వర్‌ను కీర్స్ లాక్కున్నాడు. అతడిపైకి 14సార్లు కాల్చాడు. దీంతో, అక్కడికక్కడే పారిష్ చనిపోయారు. పోలీసులు అనంతరం కీర్స్‌ను ఇంట్లోనే అరెస్ట్ చేశారు. 1991లోనే కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. ఫ్లోరిడా సుప్రీంకోర్టు మళ్లీ విచారణ చేపట్టాలని ఆదేశాలిచ్చింది. 1997లో తిరిగి విచారణ జరిపిన కోర్టు కూడా అతడికి మరణశిక్షనే విధించింది. గత వారం ఫ్లోరిడా సుప్రీంకోర్టు కీర్స్ అప్పీల్‌ను తిరస్కరించింది. మరణ శిక్ష అమలుకు కొద్ది గంటల ముందు కీర్స్ చేసిన తుది అప్పీల్‌ను అమెరికా సుప్రీంకోర్టు సైతం ఎలాంటి వ్యాఖ్యానం లేకుండా కొట్టివేసింది.


