సామాన్యుడిపై భారం.. డేటా సెంటర్లకు రాయితీ
అమెరికాలో గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లులు గుదిబండగా మారుతున్నాయి. గత ఐదేళ్లలో విద్యుత్ ధరలు ఆకాశాన్ని తాకగా ఈ భారం పంపిణీలో తీవ్ర అసమానతలు ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డేటా సెంటర్ల విద్యుత్ అవసరాలు పెరుగుతున్నప్పటికీ, వాటి ఖర్చును కూడా సామాన్య పౌరులే మోయాల్సి వస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆకాశాన్నంటుతున్న ధరలు
ఫిబ్రవరి 2020తో పోలిస్తే అమెరికా వ్యాప్తంగా విద్యుత్ ధరలు సగటున 40 శాతం పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ముఖ్యంగా వాషింగ్టన్‌లో జులై 2020 నుంచి జులై 2025 మధ్య విద్యుత్ ఖర్చులు ఏకంగా 93 శాతం పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (EIA) డేటా ప్రకారం 2022-2024 మధ్య..
నివాస వినియోగదారుల విద్యుత్తు బిల్లులు 10 శాతం పెరిగాయి.
వాణిజ్య వినియోగదారులపై 3 శాతం మాత్రమే పెరిగాయి.
పారిశ్రామిక వినియోగదారులపై ధరలు 2 శాతం తగ్గాయి.
డేటా సెంటర్లు
చిన్నపాటి నగరాలకు సరిపోయే విద్యుత్తును వినియోగించే డేటా సెంటర్లు గ్రిడ్‌లోకి వస్తున్నా వాటికి తక్కువ ధరలకే విద్యుత్ అందుతోంది. ఈఐఏ గణాంకాల ప్రకారం, 2024 చివరి నాటికి నివాస వినియోగదారులకు యూనిట్ (కిలోవాట్-గంట) ధర 16 సెంట్లు ఉండగా వాణిజ్య వినియోగదారులకు అది 13 సెంట్లు మాత్రమే ఉంది.
ఈ వ్యత్యాసానికి కారణాలు
నివాస ప్రాంతాలకు విద్యుత్ చేరవేయడానికి స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఖర్చు పెరిగింది. ఇవి తుఫానులు, అడవి మంటల వల్ల దెబ్బతింటే ఆ మరమ్మతు ఖర్చులు వినియోగదారులపైనే పడుతున్నాయి.
డేటా సెంటర్లు నేరుగా హై-వోల్టేజ్ ట్రాన్స్‌మిషన్ లైన్లకు అనుసంధానమవుతాయి. తద్వారా పంపిణీ ఖర్చుల నుంచి తప్పుకుంటున్నాయి.
పెద్ద కంపెనీలకు ఉన్న లాబీయింగ్ బలం సామాన్య ప్రజలకు ఉండదు. యుటిలిటీ రెగ్యులేటర్ల వద్ద కంపెనీలు తమకు అనుకూలమైన ధరలను సాధించుకోగలుగుతున్నాయి.
గ్రిడ్ అప్‌గ్రేడ్ భారం ఎవరిది?
ఇటీవల యూఎస్‌లో పీజేఎం అనే గ్రిడ్ ఆపరేటర్ 5 బిలియన్ డాలర్ల వ్యయంతో ట్రాన్స్‌మిషన్ లైన్ల అప్‌గ్రేడ్ ప్రాజెక్టును చేపట్టింది. డేటా సెంటర్ల వల్లేఈ అప్‌గ్రేడ్ అవసరం ఏర్పడినప్పటికీ వర్జీనియా, మేరీల్యాండ్ వంటి ప్రాంతాల్లో ఈ భారాన్ని నివాస వినియోగదారుల బిల్లుల్లో చేర్చడం వివాదాస్పదమైంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయ నివేదిక ప్రకారం, అనేక యుటిలిటీ సంస్థలు మెటా వంటి దిగ్గజ కంపెనీలతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. టెక్సాస్‌లో ఎల్ పాసో ఎలక్ట్రిక్ సంస్థ మెటా డేటా సెంటర్ కోసం ప్రత్యేక రాయితీలు ఇచ్చి ఆ విషయాన్ని ప్రజల దృష్టికి రాకుండా దాచేందుకు ప్రయత్నించడం గమనార్హం.
మార్పు దిశగా..
ఈ అసమానతలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్వర్డ్ లా స్కూల్ ఎక్స్‌పర్ట్ అరి పెస్కో మాట్లాడుతూ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత రెగ్యులేటర్లపై ఉందన్నారు. ఇప్పటికే వర్జీనియా రాష్ట్రం డేటా సెంటర్ల కోసం ప్రత్యేక వినియోగదారుల క్లాస్‌ను ఏర్పాటు చేసి గ్రిడ్ అప్‌గ్రేడ్ల కోసం వారి నుంచే ఎక్కువ వసూలు చేసేలా నిబంధనలు మార్చింది. విస్కాన్సిన్ వంటి రాష్ట్రాలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. పెరుగుతున్న విద్యుత్ ధరలు అమెరికాలో ఒక ప్రధాన రాజకీయ, ఆర్థిక అంశంగా మారాయి. దీన్ని సరిదిద్దకపోతే ఓటర్ల ఆగ్రహం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: డిజిటల్ భారత్ ముంగిట ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్’ విప్లవం


