ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ ప్రభంజనం కొనసాగుతున్న వేళ, భారతదేశం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఏఐ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. కేవలం అగ్రరాజ్యాల నమూనాలను అనుకరించకుండా మన దేశ అవసరాలకు తగ్గట్టుగా ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్’(SLM) అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాబోయే కేంద్ర బడ్జెట్ 2026లో ఈ స్వదేశీ ఏఐ నమూనాల పట్ల కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.
ఎల్‌ఎల్‌ఎం Vs ఎస్‌ఎల్‌ఎం.. భారత్‌కు ఏది ముఖ్యం?
గత కొన్ని ఏళ్లుగా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు బిలియన్ల కొద్దీ పారామీటర్లతో కూడిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs)ను అభివృద్ధి చేశాయి. ఇవి శక్తివంతమైనవి అయినప్పటికీ వీటి నిర్వహణకు భారీ ఖర్చు, అపారమైన కంప్యూటింగ్ శక్తి అవసరం. భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో ప్రతి పౌరుడికి ఏఐ సేవలు అందాలంటే ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ (SLMs)’ సరైన వ్యూహమని నిపుణులు భావిస్తున్నారు.
ఇవి అతి తక్కువ కంప్యూటింగ్ శక్తితో పని చేస్తాయి. ప్రాంతీయ భాషలు, మాండలికాలపై ప్రత్యేక శిక్షణ పొందుతాయి. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాలకు ప్రత్యేకంగా వీటిని రూపొందించవచ్చు.
భాషా వైవిధ్యానికి ఏఐ అండ
దేశంలో వందల సంఖ్యలో భాషలు, మాండలికాలు ఉన్నాయి. గ్లోబల్ ఏఐ మోడల్స్ స్థానికంగా ఉన్న అన్ని భాషల్లో ప్రావీణ్యం సాధించాలంటే కష్టం. ఈ లోటును పూడ్చడానికి ‘సర్వం 1’ (Sarvam 1) వంటి మోడల్స్ ఇప్పటికే పునాది వేశాయి. ఇది 10 భారతీయ భాషలకు మద్దతు ఇచ్చే 2 బిలియన్ పారామీటర్ మోడల్. ప్రభుత్వం చేపట్టిన ‘భారత్ జెన్’ (BharatGen) వంటి కార్యక్రమాలు స్వదేశీ ఏఐ అభివృద్ధిలో వేగం పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్ని స్థాయుల్లోని వారి అవసరాలకు అనుగుణంగా ఏఐ నమూనాలను నిర్మించడం కీలకం.
బడ్జెట్ 2026లో ఆశించేవి..
2026 బడ్జెట్‌లో ఇండియా ఏఐ మిషన్ (IndiaAI Mission) విస్తరణకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించనున్నారు.
1. క్లౌడ్ ప్రొవైడర్ల ద్వారా స్టార్టప్‌లకు, చిన్న సంస్థలకు ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయాలను తక్కువ ధరకే అందుబాటులోకి తేవడం.
2. వ్యవసాయం, గ్రామీణ పాలన, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ప్రాంతీయ లాంగ్వేజ్ డేటా సేకరణకు ప్రత్యేక నిధులు.
3. ఏఐ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులను తయారు చేయడానికి విద్యా సంస్థలకు ప్రోత్సాహకాలు.
దేశంలో 85.5 శాతం కుటుంబాల వద్ద స్మార్ట్‌ఫోన్లు, 86.3 శాతం ఇంటర్నెట్ సదుపాయం ఉన్న తరుణంలో స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ విప్లవం ఉత్పాదకతను పెంచడమే కాకుండా సామాన్యుడికి డిజిటల్ సేవలను చేరువ చేస్తుంది. స్వదేశీ ఏఐ ద్వారా భారతదేశం గ్లోబల్ ఏఐ పవర్‌హౌస్‌గా ఎదగడమే కాకుండా, తన సాంస్కృతిక, భాషా వారసత్వాన్ని సాంకేతికతతో అనుసంధానించనుంది.
ఇదీ చదవండి: ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు


