అమెరికా ఓవల్ ఆఫీస్‌లో రెండోసారి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే కీలక నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్.. గడిచిన 365 రోజుల్లో తన ‘ట్రంపరితనాన్ని’ చూపిస్తూనే ఉన్నారు. అమెరికా ఫస్ట్ అనే మంత్రాన్ని జపిస్తూ శరవేగంగా వెలువడుతున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. చైనాతో టారిఫ్‌ల యుద్ధం, అక్రమ వలసలపై ఉక్కుపాదం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో కలిసి డోజ్(DOGE) ద్వారా ప్రభుత్వ ప్రక్షాళన.. ఇలా ప్రతి అడుగులోనూ ట్రంప్ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ ఏడాది పొడవునా సాగిన ఈ సంచలన నిర్ణయాల తుపాను ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ముద్ర వేసింది? జీడీపీ లెక్కలు, ఏఐ బూమ్ వెనుక దాగిన మార్కెట్ వాల్యుయేషన్లు ట్రంప్‌నకు విజయ కేతనం పడుతున్నాయా లేక 2026లో రాబోయే భారీ ఆర్థిక పరీక్షకు సంకేతాలు ఇస్తున్నాయా? వంటి అంశాలపై విశ్లేషణ..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టి రేపటితో ఏడాది పూర్తవుతుంది. ఈ సంవత్సరం కాలంలో సుంకాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ(DOGE), కృత్రిమ మేధ (ఏఐ)లో భారీ పెట్టుబడుల వంటి నిర్ణయాలతో వైట్‌హౌస్ నిరంతరం వార్తల్లో నిలిచింది. రాజకీయంగా పెను మార్పులు చోటుచేసుకున్న ఈ ఏడాది ఆర్థికంగా కూడా మిశ్రమ ఫలితాలను అందించింది.
ఆరంభంలో సంకోచం.. ఆపై..
ట్రంప్ పాలన 2025 ప్రారంభంలో కొంత ఒడిదుడుకులతో సాగింది. 2025 మొదటి త్రైమాసికంలో అమెరికా జీడీపీ 0.6 శాతం క్షీణించింది. 2022 తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇలా వెనకబడటం ఇదే తొలిసారి. అయితే, ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. రెండో త్రైమాసికంలో 3.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.3 శాతం వృద్ధి నమోదై ఆర్థిక వ్యవస్థ మళ్లీ పట్టాలెక్కింది. వినియోగదారుల ఖర్చు పెరగడం, ఎగుమతులు పుంజుకోవడం, దిగుమతుల్లో తగ్గుదల ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ద్రవ్యోల్బణం, ఉద్యోగాల సవాలు
ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. పీసీఈ (PCE) ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 2.8 శాతంగా ఉండగా, డిసెంబర్ నాటికి 2.7 శాతానికి తగ్గింది. సుంకాల వల్ల ధరలు భారీగా పెరుగుతాయన్న ఆందోళనలు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి అటువంటి నాటకీయ మార్పులు కనిపించలేదు. కానీ, ఉద్యోగ మార్కెట్ ఆందోళన కలిగిస్తోంది. యూఎస్‌లో నిరుద్యోగ రేటు 2025 నవంబర్‌లో 4.5 శాతానికి చేరింది. 2025లో నెలకు సగటున కేవలం 49 వేల ఉద్యోగాలు మాత్రమే జోడయ్యాయి. ఇది గడిచిన ఏడేళ్ల సగటు (1.41 లక్షలు) కంటే చాలా తక్కువ. బిగ్ టెక్ సంస్థల్లో కొనసాగుతున్న లేఆఫ్స్ దీనికి ప్రధాన కారణం.
అమెరికా కంటే ప్రపంచమే ముందంజ
ట్రంప్ 2.0 తొలి ఏడాదిలో అమెరికా మార్కెట్లు లాభాలను పంచాయి. గడిచిన ఏడాదిలో..
ఎస్ అండ్ పీ 500: +16%
నాస్‌డాక్: +20%
డౌ జోన్స్: +14%
ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా మార్కెట్ల జోరు తక్కువగానే ఉంది. జపాన్ నిక్కీ (40%), కొరియా కోస్పి (92%), హాంగ్ సెంగ్ (37%) వంటి అంతర్జాతీయ సూచీలు అమెరికాను మించిపోయాయి. డాలర్ ఇండెక్స్ 9.3 శాతం పడిపోవడం, బంగారం ధరలు అనూహ్యంగా పెరగడం ఈ ఏడాది విశేషం.
ఏఐ బూమ్
ట్రంప్ హయాంలో ఏఐ రంగానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా ‘స్టార్‌గేట్’ వంటి 500 బిలియన్ డాలర్ల మెగా ప్రాజెక్టులు టెక్ రంగాన్ని ఉత్సాహపరిచాయి. ఆల్ఫాబెట్, ఎన్విడియా వంటి ‘మాగ్-7’ స్టాక్స్ మార్కెట్ విలువలో 20 శాతం వృద్ధి సాధించాయి. ప్రస్తుతం ఎస్ అండ్ పీ 500లో 42 శాతం వాటా కేవలం ఏఐ అనుబంధ కంపెనీలదే ఉండటం గమనార్హం.
అసలైన పరీక్ష ముందే?
ప్రస్తుతం అమెరికా మార్కెట్లు 28 రెట్ల పీఈ(ప్రైస్ టు ఎర్నింగ్ - ఉదాహరణకు.. కంపెనీ రేషియో 20 ఉంటే ఆ కంపెనీ సంపాదించే 1 రూపాయి లాభం కోసం 20 రూపాయలు చెల్లిస్తున్నారని అర్థం) వద్ద ట్రేడవుతున్నాయి. ఇది 2000 నాటి డాట్‌కామ్ బబుల్ స్థాయిని గుర్తుచేస్తోంది. 2026లో వడ్డీ రేట్ల నిర్ణయాలు, ఫెడ్ రిజర్వ్ వైఖరి, సుంకాల దీర్ఘకాలిక ప్రభావం అమెరికా ఆర్థిక స్థితిని నిర్ణయించనున్నాయి. రికార్డు స్థాయి స్టాక్ మార్కెట్లపై ట్రంప్ గర్వపడుతున్నా పెరుగుతున్న రుణాలు, మార్కెట్ వాల్యుయేషన్ల మధ్య ఈ ఏఐ బూమ్ ఎంతకాలం నిలుస్తుందనేది వేచి చూడాలి.
ఇదీ చదవండి: ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..


