‘భారత్-విస్తార్‌’తో డిజిటల్ అండ! | Bharat VISTAAR announced Union Budget 2026 AI powered platform | Sakshi
Sakshi News home page

‘భారత్-విస్తార్‌’తో డిజిటల్ అండ!

Feb 4 2026 8:15 AM | Updated on Feb 4 2026 8:35 AM

Bharat VISTAAR announced Union Budget 2026 AI powered platform

భారతీయ వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విడివిడిగా ఉన్న వ్యవసాయ పరిశోధనలను, డేటాను ఏకీకృతం చేస్తూ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా రైతులకు నేరుగా సలహాలు అందించేలా ‘భారత్-విస్తార్‌’ అనే సరికొత్త డిజిటల్ వ్యవస్థను రూపొందించింది. అగ్రిస్టాక్ పోర్టల్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్‌) ప్యాకేజీలను ఏఐ సిస్టమ్‌లతో అనుసంధానించడం ద్వారా సాగును మరింత లాభసాటిగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యం.

ఏఐ టూల్‌ ఎందుకు?

ప్రస్తుతం మన దేశంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, స్టార్టప్‌లు విత్తన అభివృద్ధి నుంచి సప్లై చైన్ వరకు వేర్వేరు ప్రాజెక్టులపై పనిచేస్తున్నాయి. అయితే ఈ సమాచారం అంతా ఒకే చోట లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు అందడం లేదు. భారత్-విస్తార్‌ ద్వారా ఈ వనరులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తారు. అగ్రిటెక్ స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు ఉత్పత్తి చేసే భారీ డేటాను ఏఐ విశ్లేషించి రైతులకు అర్థమయ్యేలా వివరిస్తుంది.

రైతులకు చేకూరే ప్రయోజనాలు

  • దీని ద్వారా సాధారణ సమాచారం కంటే నిర్దిష్టమైన, ధ్రువీకరించిన శాస్త్రీయ సలహాలు రైతులకు అందనున్నాయి.

  • ఐకార్‌ శాస్త్రీయ పరిశోధనలను నేరుగా డిజిటల్ రికార్డులతో అనుసంధానించడం ద్వారా పొలంలోని పరిస్థితిని బట్టి సలహాలు అందుతాయి.

  • సంక్లిష్టమైన శాస్త్రీయ డేటాను రైతులకు వారి స్థానిక భాషల్లోనే సులువుగా అర్థమయ్యేలా ఈ ఏఐ టూల్‌ సర్వీసులు అందిస్తుంది.

  • కరువు, వరదలు లేదా తెగుళ్ల దాడుల గురించి అగ్రిస్టాక్ ద్వారా ముందస్తుగా హెచ్చరికలు అందుతాయి.

  • ఇది కేవలం సమాచారానికే పరిమితం కాకుండా ప్రభుత్వ పథకాల అమలు, రుణాలు అందజేయడం, బీమా సేవలను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.

ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యం

ఈ వ్యవస్థ కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదు. యూనిఫైడ్ ఫార్మర్ సర్వీస్ ఇంటర్ ఫేస్ (యూఎఫ్‌ఎస్‌ఐ), ఏపీఐల ద్వారా ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్‌లు కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానం కావచ్చు. దీనివల్ల మార్కెట్ కనెక్షన్లు మెరుగుపడటమే కాకుండా రైతులకు మరిన్ని వినూత్నమైన సేవలు అందుబాటులోకి వస్తాయి.

డేటా భద్రతకు ప్రాధాన్యం

రైతుల డేటా విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. డేటాపై పూర్తి హక్కు రైతుకే ఉంటుంది. ఐటీ చట్టం, ఆధార్ చట్టం ప్రకారం ఈ సమాచారం భద్రంగా ఉంటుంది. ఏదైనా ప్రైవేట్ సంస్థ రైతు డేటాను యాక్సెస్ చేయాలంటే కచ్చితంగా ఆ రైతు నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement