ఒకప్పుడు శుభకార్యం అంటే పలకరింపులు, పట్టుచీరలు, బంగారు కానుకల సందడి. కానీ నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరల సెగ మధ్యతరగతి గడప దాటి వారి బంధాలపై ప్రభావం చూపుతోంది. ‘అప్పుడు వారు మాకు తులం బంగారం పెట్టారు, ఇప్పుడు మేము వారికి అంత ఇవ్వలేకపోతున్నామే’ అనే ఆవేదన.. బంధువుల్లో ఆత్మీయతపై ఆందోళన పెంచుతోంది.
అసలు కానుకల వెనుక అర్థం
సంప్రదాయంగా బంగారం, వెండి బహుమతులు కేవలం ఆడంబరం కోసం పుట్టినవి కావు. దీని వెనుక లోతైన సామాజిక, ఆర్థిక భద్రత దాగి ఉంది. పూర్వకాలంలో ఆడపిల్లకు ఇచ్చే నగలు ఆమె ఆర్థిక భద్రతకు భరోసాగా ఉండేవి. బంధువుల మధ్య బంగారు కానుకల మార్పిడి అనేది ఒక ‘సామాజిక పొదుపు’ లాంటిది. ఒకరి ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ కలిసి ఇచ్చే కానుకలు, ఆ కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తాయని ధోరణి ఉంది.
పెరుగుతున్న ధరలు.. అంతరాలు
ప్రస్తుతం బంగారం ధరలు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. గతంలో తులం బంగారం రూ.50,000 ఉన్నప్పుడు జరిగిన శుభకార్యంతో, ఇప్పుడు తులం రూ.1,40,000 ధరతో బేరీజు వేయడం వల్ల సమస్యలు మొదలవుతున్నాయి. ‘వారు మాకు అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు మేము ఇవ్వకపోతే తక్కువ చేసి చూస్తారు’ అనే అభద్రతా భావం బంధువుల మధ్య గోడలు కడుతోంది. కానుకలు ఇచ్చుకోలేక చాలామంది సన్నిహితుల వేడుకలకు వెళ్లడమే మానేస్తున్నారు. ఇది పరోక్షంగా సామాజిక దూరాన్ని పెంచుతోంది.
మానవ సంబంధాలను కాపాడుకోవడం ఎలా?
డబ్బు కన్నా మనుషులు ముఖ్యం అని భావించినప్పుడే బంధాలు నిలుస్తాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అనుసరించాల్సిన కొన్ని మార్గాలివే..
1. కాలానుగుణ మార్పును అంగీకరించాలి.. పదేళ్ల క్రితం నాటి ధరలు ఇప్పుడు లేవని గ్రహించాలి. ఇచ్చే కానుక బరువును (గ్రాములను) కాకుండా అవతలి వారి ఆర్థిక పరిస్థితిని, ఆత్మీయతను గౌరవించాలి.
2. ప్రత్యామ్నాయాల వైపు చూపు.. కేవలం బంగారం, వెండి మాత్రమే కానుకలు కావు. స్థిరాస్తి బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా నగదు రూపంలో చిన్న మొత్తాన్ని అందించడం కూడా గౌరవప్రదమే.
3. ముందస్తు ప్రణాళిక.. రాబోయే శుభకార్యాల కోసం ‘గోల్డ్ స్కీమ్స్’ వంటి వాటి ద్వారా చిన్న మొత్తాల్లో పొదుపు చేయడం వల్ల భారంగా అనిపించదు.
4. సన్నిహిత బంధువుల మధ్య ఆర్థిక ఇబ్బందుల గురించి మొహమాటం లేకుండా చర్చించుకోవడం వల్ల అపోహలు తొలగిపోతాయి.
5. వేడుకకు వెళ్లడం, తోడుగా నిలబడటం అనేది వస్తురూపంలో ఇచ్చే కానుక కంటే గొప్పదని గుర్తించాలి.
బంగారం మెరుస్తుంది కానీ మాట్లాడలేదు. బంధం మౌనంగా ఉన్నా మనసును తడుముతుంది. ధరలు పెరిగినప్పుడు మన ఆలోచనా ధోరణిని మార్చుకోవాలే తప్ప, ఆత్మీయులను దూరం చేసుకోకూడదు.
ఇదీ చదవండి: ఒరాకిల్ నిధుల వేట.. రూ.14 లక్షల కోట్లు కావాలట!


