దేశీయ వెండి ధరలు ఇటీవల వారాల పాటు కొనసాగిన తీవ్ర హెచ్చుతగ్గుల అనంతరం కొంత శాంతించాయి. ఈ నెల ప్రారంభంలో రికార్డు స్థాయిలను తాకిన వెండి ధరలు, ఇప్పుడు ప్రపంచ మార్కెట్ సంకేతాల ప్రభావంతో తగ్గుదల బాట పడుతున్నాయి.
జనవరి నెల వెండికి అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. నెల ప్రారంభం నుంచే ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, బలహీనమైన అమెరికన్ డాలర్, సురక్షిత పెట్టుబడిగా లోహాలపై పెరిగిన డిమాండ్ ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
జనవరి చివరి నాటికి వెండి ధరలు చరిత్రాత్మక గరిష్ఠాలకు చేరాయి. జనవరి 31 నాటికి భారతదేశంలో భౌతిక వెండి కిలోకు సుమారు రూ.3.35 లక్షల వద్ద ట్రేడవగా, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మార్చి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ.3.95 లక్షల వరకు చేరింది. శనివారం (జనవరి 31) ఒక్క రోజే వెండి ధర కేజీకి రూ.55 వేలు పతనమైంది. జనవరి 30న, కామెక్స్ లో వెండి గరిష్ట ధర (ఔన్స్‌కు) 118 డాలర్ల నుండి 37 శాతం తగ్గి 74 డాలర్లకు పడిపోయింది.
ఎందుకీ తగ్గుదల?
వెండి ధరల్లో వచ్చిన భారీ తగ్గుదల వెనుక ప్రధానంగా అంతర్జాతీయ కారణాలే ఉన్నాయి.
అమెరికా డాలర్ బలపడటంతో విలువైన లోహాలపై ఆసక్తి తగ్గింది. డాలర్ బలంగా ఉన్నప్పుడు విదేశీ కొనుగోలుదారులకు వెండి మరింత ఖరీదవుతుంది.
బంగారం ధరలు పడిపోవడం కూడా వెండిపై ప్రతికూల ప్రభావం చూపింది. బంగారం–వెండి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం కారణంగా వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.
అలాగే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ను నామినేట్ చేయడంతో మార్కెట్ సెంటిమెంట్‌లో మార్పు వచ్చింది.
ఈ పరిణామాలన్నీ కలసి వెండి ధరలను ఇటీవలి గరిష్ఠాల నుంచి వెనక్కి నెట్టేశాయి.
ఇది చదివారా? కియోసాకి వెండినంతా అమ్మేసుకున్నాడా?


