స్పాట్ మార్కెట్‌లో రూ. 20,000 పతనమైన సిల్వర్
ఫ్యూచర్స్‌లో రూ. 1,07,971 డౌన్
రూ 14,000 తగ్గిన బంగారం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్స్ మధ్య ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు దిగడం, అమెరికా డాలరు పుంజుకోవడం తదితర అంశాల నేపథ్యంలో శుక్రవారం బంగారం, వెండి ధరలు గణనీయంగా పతనమయ్యాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి 10 గ్రాముల రేటు ఏకంగా రూ. 14,000 క్షీణించి రూ. 1,69,000కు తగ్గింది. అటు వెండి సైతం కేజీకి రూ. 20,000 తగ్గి రూ. 3,84,500కి క్షీణించింది. దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో బంగారం ఏప్రిల్ కాంట్రాక్టు 8% క్షీణించి రూ. 1,68,750 వద్ద ట్రేడయ్యింది.
సిల్వర్ మార్చ్ కాంట్రాక్టు ఒక దశలో క్రితం ముగింపు రూ. 4,20,048తో పోలిస్తే ఏకంగా రూ. 1,07,971 మేర పతనమైంది. దాదాపు 27% పడిపోయి రూ. 2,91,922 వద్ద ట్రేడయ్యింది. రికార్డు బ్రేకింగ్ ర్యాలీ అనంతరం లాభాల స్వీకరణ జరగడంతో పసిడి, వెండి ధరలు కరెక్షన్‌కి లోనైనట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
అంతర్జాతీయంగా స్పాట్ మార్కె ట్లో బంగారం ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 285.30 డాలర్లు తగ్గి 5,087.73 డాలర్లకు క్షీణించింది. ఒక దశలో 425.86 డాలర్లు క్షీణించి 4,945.26 డాలర్లకు పతనమైంది. ఇక వెండి కూడా ఇంట్రాడేలో 17.5 శాతం పడి 95.26 డాలర్లను కూడా తాకింది. చివరికి 12% (14 డాలర్లు) తగ్గి 101.47 డాలర్ల వద్ద ముగిసింది. ఫ్యూచర్స్ మార్కెట్ కామెక్స్‌లో పుత్తడి ఏప్రిల్ కాంట్రాక్టు 273 డాలర్లు తగ్గి 5,085 డాలర్ల దగ్గర ట్రేడయ్యింది. వెండి దాదాపు 16 డాలర్లు క్షీణించి 98.70 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


