2025 జనవరిలో రూ. 78వేలు వద్ద ఉన్న బంగారం ధర 2026 జనవరికి రూ. 1.78లక్షలు క్రాస్ చేసింది. ఏడాది కాలంలో లక్ష రూపాయలు పెరిగిందన్నమాట. గోల్డ్ రేటు రోజు రోజుకి పెరుగుతున్న తీరు చూసి పసిడి ప్రియులలో కూడా ఒకింత భయం మొదలైంది. ఇది వరకు ఎప్పుడూ లేనంతగా.. పెరిగిపోతుండడంతో రాబోయే రోజుల్లో గోల్డ్ కొనడానికి సాధ్యమవుతుందా అని ఆలోచిస్తున్నారు.
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీన్ని చూసి చాలామంది గోల్డ్ కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. రేట్ల పెరుగుదల విషయంలో ప్రజలు గాబరాపడాల్సిన అవసరం లేదు. పెరిగిన ధరలకు కారణం.. ప్రపంచ రాజకీయ, సామాజిక పరిస్థితులే అని గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'విలియం లీ' పేర్కొన్నారు.
పసిడి ధరల పెరుగుదలను లీ.. నీటి బుడగ(బబుల్)తో పోల్చారు. ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉంది. అంటే గోల్డ్ రేటు ఏ సమయంలో అయినా భారీగా తగ్గిపోతుందని అన్నారు. కాబట్టి ధరలు పెరుగుతున్నాయి, భవిష్యత్తులో బంగారం దొరకదేమో అని ఎగబడి బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.
కొన్ని సంస్థలు ఇచ్చే రిపోర్ట్స్ కూడా ప్రజలను భయపెడుతున్నాయి. ఇదంతా ఒక ట్రాప్ అని విలియం లీ పేర్కొన్నారు. కొన్ని పెద్ద సంస్థలు, ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని ఎక్కువ ధరకు విక్రయించుకోవడానికి ఇలా చేస్తుంటారని ఆయన అన్నారు. ఎప్పుడైతే ఒక వస్తువుకు డిమాండ్ పెరుగుతుందో.. దాని ధర కచ్చితంగా పెరుగుతుంది. కానీ బంగారం విషయంలో మాత్రం లండన్, న్యూయార్క్ వంటి దేశాల్లోని కొన్ని పెద్ద బ్యాంకులు ఫిక్స్ చేస్తాయని ఆరోపించారు.
ఇదీ చదవండి: ఊహకందని రేటు.. రికార్డు స్థాయికి చేరిన వెండి!
1980లో బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరిగాయి. ఈ సమయంలో కూడా చాలామంది ప్రజలు గోల్డ్ కొనడానికి ఎగబడ్డారు. కొన్ని రోజుల తరువాత గోల్డ్ రేటు 57 శాతం పడిపోయింది. 2011లో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు (2026) కూడా ఇదే రిపీట్ అవుతుందని ఆయన అన్నారు. కాబట్టి రేటు పెరిగిందని కొనేయకండి. కొన్ని రోజులు వేచి చూడండి. తప్పకుండా.. బంగారం ధర తగ్గుతుందని చెప్పారు.


